Sunday, December 14, 2025
E-PAPER
Homeజాతీయంఅణు ఇంధన రంగంలో ప్రయివేటు జోక్యం వద్దు

అణు ఇంధన రంగంలో ప్రయివేటు జోక్యం వద్దు

- Advertisement -

బీమా రంగంలో వంద శాతం ఎఫ్‌డీఐకి నో
కేంద్ర క్యాబినెట్‌ నిర్ణయానికి సీపీఐ(ఎం) తీవ్ర ఖండన

న్యూఢిల్లీ : అణు విద్యుత్‌ ఉత్పత్తిలోకి ప్రయివేటు, విదేశీ కంపెనీల ప్రవేశాన్ని అనుమతిస్తూ కేంద్ర క్యాబినెట్‌ తీసుకున్న నిర్ణయాన్ని సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో తీవ్రంగా వ్యతిరేకించింది. అలాగే బీమా రంగంలోకి వంద శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ)ను అనుమతించాలన్న క్యాబినెట్‌ నిర్ణయంతో విభేదించింది. ఈ మేరకు పొలిట్‌బ్యూరో ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్‌ సమావేశాల్లో అణు ఇంధన చట్టం (1962), అణు నష్టానికి పౌర బాధ్యత చట్టం (సీఎల్‌ఎన్‌డీఏ 2010)లను సవరించాలని కేంద్ర క్యాబినెట్‌ నిర్ణయించింది. విదేశీ సాంకేతికత, పరికరాల సరఫరాదారులతో పాటు ప్రయివేటు కంపెనీల ప్రవేశాన్ని అనుమతించేందుకు ఉద్దేశించిన సవరణలు ప్రతిపాదించాయి.

అణు ఇంధనం వంటి వ్యూహాత్మకమైన, కీలకమైన రంగంలో ప్రయివేటు కంపెనీలకు ద్వారాలు తెరవడం వినాశకరమైన చర్య అనీ, అణు ఇంధన కంపెనీలకు వారు ఉత్పత్తి చేసిన విద్యుత్‌పై టారిఫ్‌లను నిర్ణయించడంలో ఈ సవరణలు స్వేచ్ఛను ఇస్తాయని పొలిట్‌బ్యూరో పేర్కొంది. సీఎల్‌ఎన్‌డీఏకు చేసే సవరణ ప్రమాదకరమైనదనీ, ఏదైనా అణు ప్రమాదం జరిగినపుడు బాధితులకు ఇవ్వాల్సిన నష్టపరిహారాన్ని నీరు కారుస్తుందని సీపీఐ(ఎం) విమర్శించింది. ”అమెరికా ఒత్తిళ్ళకు తలొగ్గిన ప్రభుత్వం.. ప్రమాదాలు, ఇతర అవాంఛనీయ సంఘటనలు జరిగినపుడు ఉత్పత్తిదారునికి బాధ్యత లేకుండా చేయడానికి ఈ చట్టాన్ని సవరిస్తోంది. దీనివల్ల కంపెనీలకు డబుల్‌ బొనాంజా లభిస్తుంది. ప్రమాదాలు జరిగిన పక్షంలో వారు బాధ్యత వహించనక్కరలేదు. అలాగే విద్యుత్‌ చార్జీలు నిర్ణయించడంలో రెగ్యులేటరీ పర్యవేక్షణకు లోబడి ఉండనక్కరలేదు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వ కార్పొరేట్‌ అనుకూల విధానాలకు ఇది మరొక ఉదాహరణ” అని పొలిట్‌బ్యూరో పేర్కొన్నది.

బీమా రంగంలో ఎఫ్‌డీఐ
బీమా రంగంలో వంద శాతం ఎఫ్‌డీఐకి అనుమతించడంతో దేశీయ బీమా పరిశ్రమ అస్థిరతకు గురవుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. పాలసీదారుల గోప్యత దీనివల్ల దెబ్బతింటుందనీ, ఆర్థిక భద్రత గందరగోళంలో పడుతుందని వివరించింది. ”విదేశీ పెట్టుబడిదారుల వాణిజ్య ప్రాధాన్యతలు ప్రజల సంక్షేమ లక్ష్యాలను అణగదొక్కుతాయి. దీనితో ఆర్థిక సుస్థిరతకు, సామాజిక భద్రతకు విఘాతం కలుగుతుంది. ఈ చర్య బీమా రంగాన్ని దోపిడీదారులు మొత్తంగా స్వాధీనం చేసుకోవడానికి ద్వారాలు తెరుస్తుంది. ఫలితంగా కీలకమైన జాతీయ వనరులపై నియంత్రణ కోల్పోతాం” అని సీపీఐ(ఎం) విమర్శిం చింది. దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ సవరణలను వ్యతిరేకించాలని సమాజంలోని అన్ని ప్రజాస్వామ్య శక్తులకు సీపీఐ(ఎం) పిలుపునిచ్చింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -