Tuesday, December 16, 2025
E-PAPER
Homeఎడిట్ పేజిప్రయివేటు ఏకస్వామ్యం ఓ పెనుసవాలు

ప్రయివేటు ఏకస్వామ్యం ఓ పెనుసవాలు

- Advertisement -

ఇటీవల భారతదేశ ప్రధాన రవాణా వ్యవస్థని ఒక్కసారిగా మోకాళ్లపై కూర్చోబెట్టింది ఇండిగో విమానయాన యాజమాన్యం. వందలకొద్ది విమానాలను రద్దు చేస్తున్నామనే ఇండిగో తీసుకున్న నిర్ణయంపై ప్రభుత్వానికి ముందస్తు సమాచారం ఉందో లేదో ఇప్పటికీ స్పష్టం చేయలేదు. ప్రభుత్వం కూడా దాదాపు ప్రయాణికుల మాదిరిగానే అంతా స్తంభించిపోయిన తర్వాత తెలుసుకొన్నట్టుగానే విధితమవుతోంది. అత్యంత ప్రాధాన్యత కలిగిన వాయు రవాణాకి ఇంతటి అనిశ్చితి ఉండగలదా? ఉండే అవకాశం ఉందని ప్రభుత్వానికి తెలీదా? మరి ఇలాంటి పరిస్థితి ఏర్పడితే ఎంత త్వరితగతిన చర్యలు చేపట్టాలో ప్రభుత్వం దగ్గర విధివిధానాలు లేవా? చేజారిపోయిన పరిస్థితి చూస్తే వాళ్లకి కూడా పరిష్కార మార్గాలకు సంబంధించిన సూచనప్రాయ అధికారాలు కూడా లేవనిపిస్తోంది. ఇండిగో ప్రకటించిన ఈ నిర్ణయం వల్ల సూర్యగ్రహణంలా ఒక్కసారిగా చీకటి కమ్ముకుంది.

ఇదేనా వికసిత్‌ భారత్‌ అంటే? ప్రభుత్వ రంగంలో అయితే ఇలా జరిగేదా? ఒక్కసారిగా ముందస్తు సమాచారం లేకుండా రవాణా వ్యవస్థ మొత్తం స్తంభించి పోయే అవకాశం ఉండేదా? ఏ రంగమైనా పర్యవసానాలు ఆలోచించకుండా కొత్త నిబంధనలను అకస్మాత్తుగా ప్రభుత్వ రంగంలోని అధికారులు అమలు పరచడానికి అవకాశం ఉందా? ప్రతి రంగమూ, ప్రతి అంశము ప్రభుత్వ రంగంలో కొనసాగించడం అసాధ్యమే. దేశం మిశ్రమ ఆర్థిక వ్యవస్థ విధానాన్ని పాటిస్తున్నది. ప్రయివేటు ప్రభుత్వ రంగాల సమ్మిళిత కొనసాగింపు మంచిదే. కానీ ప్రధాన రంగాలైన రవాణా, ఆర్థిక, కమ్యూనికేషన్‌, ఇంధన వంటి రంగాలు పూర్తిగా ప్రభుత్వ కనుసన్నల్లో జరగకపోతే ఆపత్కాల పరిస్థితుల్లో పరిస్థితులు ప్రజా సంక్షేమం కోసం అందుబాటులో ఉంటాయా?

ప్రభుత్వ రంగం అంటేనే ఒక బూచిలాగా ప్రచారం చేసి, ప్రయివేటు రంగానికి వత్తాసు పాడి, పోటీతత్వంలోనే ప్రోగ్రెస్‌ ఉందని నమ్మబలికి, ప్రయివేటు ఆధిపత్యాన్ని పెంచి పోషిస్తే ఇలాంటి ఫలితాలు వస్తాయని, ఎప్పుడూ ప్రజాపక్షం వహించే వామపక్షాలు ఊరికనే చెబుతున్నాయా! ఒక్కసారిగా విమాన ప్రయాణం రంగం స్తంభించడంతో మళ్లీ ప్రభుత్వ రంగాల ప్రాధాన్యతను కొందరు రాజకీయ నాయకులు కూడా ప్రస్తుతిస్తుండడం వారి అవకాశవాద ప్రస్తావన తప్ప ప్రభుత్వ రంగాల ప్రాధాన్యతపై వారికున్న చిత్తశుద్ధి ఏమీ కాదు! కేంద్ర ప్రభుత్వం తాము విధించిన విధి విధానాలలో వెనక్కి తగ్గి పూర్వ పరిస్థితులు నెలకొనే విధంగా చర్యలు చేపట్టాలని ఇండిగో యాజమాన్యాన్ని ఆదేశించింది. ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతాయి. సాధారణ పరిస్థితులు కొంత ఆలస్యంగానైనా నెలకొనవచ్చు.

కానీ స్తంభించిన ఈ కాలంలో జరిగిన వేల కోట్ల రూపాయల నష్టానికి, విలువైన ప్రాణనష్టానికి, ఇతరత్రా పడిపోయిన లావాదేవీలకు బాధ్యులు ఎవరు? కనీసం పోటీతత్వం ఉన్నప్పటికీ ఎయిర్‌ ఇండియా ప్రభుత్వ రంగంలో కొనసాగించాలని గగ్గోలు పెడితే దానిని టాటా గ్రూప్‌కు అప్పగించడమే ఎయిర్‌ ఇండియాకు స్వాతంత్రం వచ్చినంత గొప్పగా చెప్పుకొని ఈ ఇండిగో వ్యవహారంలో బయటపడిన మరో అంశం. పైలెట్లను పరిమితికి మించి వినియోగించడం. ఇది వ్యక్తిగత దోపిడీయే కాకుండా ప్రమాదాలకు పునాది పడే అంశం. అంతర్జాతీయ సంస్థలతో పోలిస్తే భారత దేశంలో పైలెట్లకు పనిభారం ఎక్కువట. దాన్ని నియంత్రించడానికే నియమ నిబంధనలు రూపొందించారు. కానీ అమలుపరిచేటప్పుడు చాలినంత కొత్త పైలెట్లను నియమించుకుని ఉంటే బాగుండేది. అలా చేయకపోవడం వల్లనే ఈ నష్టం జరిగింది. ఈ సందర్భంగా ఇతర ఏయే రంగాల్లో అలాంటి మితిమీరిన వినియోగం జరుగుతుందో తప్పకుండా దృష్టి పెట్టాల్సిందే.

దేశంలో అలా జరిగే ప్రధాన రంగం సాఫ్ట్‌వేర్‌రంగం. పరిమితికి మించి శ్రమదోపిడీ జరుగుతున్నది. బయటపడని లైంగికదాడులు ,అఘాయిత్యాలు, అమానుష ఎత్తులు ఎన్నో ఉన్నవి. విమాన ప్రయాణికులు కోట్ల రూపాయలకు పడగలెత్తినవారు కాబట్టి వారి శ్రేయస్సు కోసం ప్రభుత్వ పెద్దలు మేల్కొని ఉంటారు. కానీ సాఫ్ట్‌వేర్‌ రంగం, రోడ్డు రవాణా రంగాలు, అసంఘటిత రంగాలలో అలాంటి దోపిడీలు లెక్కకు మించి జరుగుతున్నాయి. ప్రయివేటు వాహనాలన్నీ సింగల్‌ డ్రైవర్‌తో 24 నడుస్తుంటాయి. వీటన్నిటిని కూడా నియంత్రించడానికి యంత్రాంగాన్ని ఏర్పాటు చేయకుండా నూతనంగా అమల్లోకి తెచ్చిన లేబర్‌ కోడ్‌లలో యాజమాన్యానికి పూర్తి స్వేచ్ఛను ఇచ్చారు.

శ్రామికులు కూడా ”ఇష్టమైతేనే పోవచ్చు” అనే నిబంధన పెట్టి, దానినే రక్షణ కవచంగా భావించాలని సూచిస్తున్నారు. పైలట్ల విషయంలో పనిగంటల గురించిన ఖచ్చితత్వాన్ని మిగతా చోట్ల ఎందుకు పాటించడం లేదు? ఈ వివక్షలో ఎంతమంది మాన ప్రాణాలను కోల్పోతున్నారో ఊహించడం కష్టమేమీ కాదు. అందుచేత ఈ సందర్భంగా పని గంటలు, పని పరిస్థితులు, పనిచేసే వేళలు, పనికి తగిన ప్రతిఫలాలు, వాటిని పర్యవేక్షించే యంత్రాంగం పరిరక్షించడానికి శ్రామికులకు పటిష్టమైన సంఘాలు ఉండేలా చట్టాలను రూపొందించడం వంటివన్నీ కూడా ప్రధాన చర్చలో భాగం కావాలి. అలాంటి ప్రయత్నాలే ”సబ్‌కాసాత్‌ సబ్‌కావికాస్‌” అనే నినాదానికి నిజమైన అర్థాన్నిస్తాయి.

జి.తిరుపతయ్య
9951300016

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -