– 20న హైదరాబాద్‌లో సెక్యూరిటీ గార్డుల జాతీయ సదస్సు :
సీఐటీయూ జాతీయ కోశాధికారి ఎం.సాయిబాబు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ప్రయివేటు సెక్యూరిటీ ఏజెన్సీస్(రెగ్యులేషన్) చట్టం-2005ని పకడ్బందీగా అమలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను సీఐటీయూ అఖిల భారత కోశాధికారి, ప్రయివేటు సెక్యూరిటీ గార్డ్స్, అలైడ్ వర్కర్స్ యూనియన్ జాతీయ కన్వీనర్ ఎం.సాయిబాబు డిమాండ్ చేశారు. ఈనెల 20న హైదరాబాద్‌లో సెక్యూరిటీ గార్డుల జాతీయ సదస్సు నిర్వహించ నున్నట్టు ప్రకటించారు. ఆ సదస్సును జయప్రదం చేయాలని సెక్యూరిటీగార్డులకు పిలుపు నిచ్చారు. ఆదివారం హైదరాబాద్‌లోని సీఐటీయూ రాష్ట్ర కార్యాలయంలో తెలంగాణ ప్రయివేటు సెక్యూరిటీ గార్డ్స్, అలైడ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కో ఆర్డినేషన్ కమిటీ సమావేశం జరిగింది. దానికి సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు కె.ఈశ్వర్‌రావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా సాయిబాబు మాట్లాడుతూ..ఆర్థిక వ్యవస్థలో అత్యంత కీలకమైన ఉత్పత్తి ప్రక్రియ మొదలుకొని ఆ సరుకుల నిల్వ, రవాణా, పంపిణీ జరిగే అన్ని విభాగాల వద్ద సెక్యూరిటీ గార్డులు పనిచేస్తున్నారని తెలిపారు. దేశంలో 22 వేల సెక్యూరిటీ ఏజెన్సీ పరిధిలో అధికారికంగా కోటిమందికిపైగా సెక్యూరిటీ గార్డులు ప్రభుత్వ, ప్రయివేటు సంస్థల్లో పనిచేస్తున్నారన్నారు. వారంతా ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్టు పద్ధతిలో నియమించిన వారేనని తెలిపారు. వారికి ఉద్యోగ భద్రత లేదని వాపోయారు. వారితో ఏకధాటిగా 12 గంటలు పనిచేయిస్తున్నారనీ, రిలీవర్ రాకపోతే 24గంటలు విధులు నిర్వర్తించాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. అధిక పనిగంటలు పనిచేస్తే ఓటీ కూడా చెల్లించడం లేదని వాపోయారు. చట్టం ప్రకారం వారికి ఐడీ కార్డులు, యూనిఫామ్, షూస్, టార్చ్ లైట్ తదితర రక్షణ పరికరాలకు ఏజెన్సీలు ఇవ్వాల్సి ఉన్నప్పటికీ ఎక్కడ కూడా అమలు కావడం లేదని ఎత్తిచూపారు. యాజమాన్యాలు, ఏజెన్సీలు పీఎఫ్‌ను ఎగ్గొడుతు న్నాయని చెప్పారు. ఆ యూనియన్ రాష్ట్ర కన్వీనర్ యాటల సోమన్న మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎనిమిదేండ్లుగా వాచ్ అండ్ వార్డ్ షెడ్యూల్లో కనీస వేతనాలు సవరించ లేదని విమర్శించారు. దీనివల్ల కోటిమందికిపైగా ప్రయి వేటు సెక్యూరిటీ గార్డులు, అనుబంధ హౌస్‌కీపింగ్ కార్మికులు ఆర్థికంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. లేబర్‌కోడ్‌లు సెక్యూరిటీ గార్డుల పట్ల అత్యంత ప్రమాదకరంగా మారబోతు న్నాయ న్నారు. సమాశంలో రాష్ట్ర కో-ఆర్డినేషన్ కమిటీ సభ్యులు టి. సాంబయ్య, ఆపోలో సెక్యూరిటీ గార్డ్స్ యూనియన్ (సీఐటీయూ) ప్రధాన కార్యదర్శి హెచ్.దామోదర్, నాయకులు ఉమాశంకర్, అప్పారావు, కె.జ్యోతి, బుద్దపూర్ణిమా ప్రాజెక్ట్ సెక్యూరిటీ గార్డ్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి ఆరోగ్యమ్మ, నాయకులు శోభ, మేడ్చల్ పారిశ్రామిక సెక్యూరిటీ గార్డ్స్ యూనియన్ నాయకులు కె.రామకృష్ణ, ఓదేలు తదితరులు పాల్గొన్నారు.
ప్రయివేటు సెక్యూరిటీ ఏజెన్సీస్ చట్టాన్ని అమలు చేయాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES