నవతెలంగాణ-హైదరాబాద్: ఓట్ చోరీకి వ్యతిరేకంగా దేశరాజధాని ఢిల్లీలో కాంగ్రెస్ భారీ ర్యాలీ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ ర్యాలీకి పెద్దయోత్తున పార్టీశ్రేణులు తరలివచ్చారు. రామ్‌లీలా మైదానమంతా జనాలతో కిక్కిరిసిపోయింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఎంపీ ప్రియాంకా గాంధీ బీజేపీకి సవాల్ విసిరారు. బీజేపీకి దమ్ముంటే బ్యాలెట్ ఓటింగ్ పద్ధతితో కాంగ్రెస్ పార్టీని ఓడించాలని సవాల్ విసిరారు.
ఈవీఎంల ద్వారా ఓటు చోరీకి పాల్పడుతూ బీజేపీ అధికారాన్ని నిలబెట్టుకుంటుందని ఆరోపించారు. బ్యాలెట్ ద్వారా ఎన్నికలు నిర్వహిస్తే బీజేపీ ఓడిపోతుందని ఆ పార్టీ పెద్దలకు తెలుసునని ఎద్దేవా చేశారు. బీహార్‌లో ఓట్ చోరీకి పాల్పడి బీజేపీ అధికారంలోకి వచ్చిందని, కషాయ పార్టీ విజయ రహస్యం ఓట్ చోరీ అని, ఆ విషయం దేశం మొత్తం తెలుసునని చెప్పారు.
బీజేపీ, మోడీ, అమిత్ షాలు ప్రజల్లో విశ్వాసం కోల్పోయారని, పార్లమెంట్ సమావేశాల్లో ఆ విషయం తమకు స్పష్టంగా ఆర్థమైందని తెలియజేశారు. ఈసీ చేపట్టిన సర్, ఎన్నికల విధానాలు, ఓట్ చోరీ గురించి ఉభయ సభలలో చర్చించాలని కాంగ్రెస్ కోరితే.. అనవసర విషయాలపై మోడీ ప్రభుత్వం చర్చలు కొనసాగిస్తుందని మండిపడ్డారు.
బీజేపీ పాలనలో న్యాయవ్యవస్థకు ముప్పు వాటిల్లిందని, మీడియా వ్యవస్థ ధవవంతుల చేతిలోకి వెళ్లిపోయిందని ప్రియాంకా గాంధీ ఆందోళన వ్యక్తం చేసింది. ప్రతిపక్షాల ఎంపీలపై, పార్టీ నేతలపై ఈడీ, సీబీఐ, ఐటీ వంటి దర్యాప్తు సంస్థలను తమపై ఉసుగొల్పుతుందని ఆమె విమర్శించారు.



