నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండల కేంద్రంలోని బాలుర గురుకుల పాఠశాలలో ఆచార్య జయశంకర్ జయంతి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. తెలంగాణ జాతిపితయని, ఒక ఉద్యమకెరటమని, ఆయన ఆశయాల మార్గములో ప్రతి ఒక్కరూ నడవాలని, మహానీయుల స్ఫూర్తిని విద్యార్థులు పొందాలని ప్రిన్సిపాల్ నందాల గంగాశంకర్, ప్రముఖ పద్యకవి డా బి. వెంకట్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తెలంగాణ గురుకుల బాలుర విద్యాలయం, జూనియర్ కళాశాలలో ఆచార్య జయశంకర్ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయన చిత్రపటమునకు నివాళులను అర్పించి,పువ్వులతో పూజించారు.
తెలంగాణ ఉద్యమ నేతగా,రాష్ట్ర ఏర్పాటులో కీలకపాత్ర పోషించి,నీళ్ళు నిధులు నియామకాల్లో తెలంగాణ నష్టపోయిందని పలు సమావేశాల్లో తన గొంతుక వినిపించిన తెలంగాణ ఉద్యమ మాస్టారు ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సారని అన్నారు. 1934, ఆగస్టు 6 న ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఆత్మకూర్ మండలం అక్కంపేట గ్రామములో మహాలక్ష్మీ,లక్ష్మీకాంతారావు దంపతులకు జయశంకర్ సార్ జన్మించారని అన్నారు. తెలుగు, ఉర్దూ, ఆంగ్లం, హిందీ భాషలలో మంచి ప్రావీణ్యం గల ఆయన తెలంగాణ ఉద్యమానికి తన జీవితాన్ని అంకితం చేశారని అన్నారు. ఆజన్మ బ్రహ్మచారిగాజీవించారని,ఆయన మార్గదర్శనములో ప్రతి ఒక్కరూ నడవాలని అన్నారు.
విద్యార్థులు దేశభక్తి గేయాలను ఆలపించారు. తెలంగాణ పాటలతో అలరించారు. సీనియర్ ఉపాధ్యాయులు సుమన్, వేణుగోపాల్, గణేశ్, నరహరి, రాము, గంగాప్రసాద్, 557మంది గురుకుల విద్యార్థులు, సంస్కృతభారతి, గీతాభారతి, క్రీడాభారతి, కళాభారతి, ఇంటర్ విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.