Friday, January 9, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలులాభమా..నష్టమా!

లాభమా..నష్టమా!

- Advertisement -

కవిత పార్టీతో గులాబీ పార్టీలో చర్చ
బీఆర్‌ఎస్‌ ఓటు బ్యాంకు చెదిరే ప్రమాదం
పార్టీ నేతల్లో అంతర్మథనం

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
తెలంగాణలో కొత్తగా రాజకీయ పార్టీ ఆవిర్భవించబోతుందన్న కల్వకుంట్ల కవిత వ్యాఖ్యలు ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశ మవుతున్నాయి. ఆమె పార్టీని స్థాపించడం వల్ల రాష్ట్రంలో ఏ పార్టీకి లాభం కలుగుతుంది?, ఏ పార్టీకి నష్టం కలుగుతుందనే విషయాలపై విశ్లేషణలు జరుగుతున్నాయి. అధికార కాంగ్రెస్‌కు మేలు కలుగుతుందా? బీజేపీకి ప్రయోజనం కలుగుతుందా? అన్నది కీలక అంశంగా మారింది. ఆమె కేసీఆర్‌ కూతురుగా, బీఆర్‌ఎస్‌ ఎంపీగా, ఎమ్మెల్సీగా పనిచేశారు. ఇప్పుడు ఎమ్మెల్సీ పదవికి, ఆ పార్టీకి రాజీనామా చేయడంతోపాటు గులాబీ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు.

బీఆర్‌ఎస్‌లో ఆమె సుదీర్ఘకాలంగా పనిచేయడంతో ఆ పార్టీ ముఖ్యనాయకుల నుంచి కార్యకర్తల వరకు సంబంధాలున్నాయి. దీంతో ఆ పార్టీ ఓటు బ్యాంకు చెదిరిపోయే ప్రమాదముందని పలువురు అభిప్రాయపడుతున్నారు. దీంతో గులాబీ పార్టీలో చర్చ మొదలైంది. ఇప్పటికే బీఆర్‌ఎస్‌ ప్రతిపక్షంలో ఉన్నది. కవిత పార్టీని స్థాపిస్తే పార్టీ కార్యకర్తలు ఆమె వైపు చూస్తారనే అభిప్రాయం వినిపిస్తున్నది. ప్రస్తుతం అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు లేకపోవడంతో బీఆర్‌ఎస్‌కు ఎలాంటి నష్టం ఉండబోదని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నా.. ఇంకోవైపు ఆమె వల్ల బీఆర్‌ఎస్‌కు నష్టమేనని అంతర్మథనం చెందుతున్నారు. కానీ బయటకు మాత్రం ఆమె గురించి పట్టించుకోనట్టు మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఆమెకు బీఆర్‌ఎస్‌ పార్టీ ఏం తక్కువ చేసిందని మహిళా నేతలు ప్రశ్నిస్తున్నారు.

కవిత ఎవరు వదిలిన బాణం
కల్వకుంట్ల కవిత ఎవరు వదిలిన బాణం అనే చర్చ రాజకీయ వర్గాల్లో విస్తృతంగా జరుగుతున్నది. కాంగ్రెస్‌ వదిలిన బాణమా?, బీజేపీ వదిలిన బాణమా?అన్నది హాట్‌టాపిక్‌ గా మారింది.ఆమెను వెనుక ఉండి నడిపిస్తున్నది ఎవరన్న ప్రశ్న తలెత్తున్నది. రాజకీయ పార్టీని నడపడమంటే అంత ఆషామాషీ వ్యవహారం కాదు. ఆర్థికపరమైన అంశాలతో ముడిపడిన అంశం. పార్టీ నిర్వహణ, ఇతర ఖర్చులకు సంబంధించిన డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయన్నది ప్రశ్నార్థకంగా ఉన్నది. కవిత పార్టీ పెడితే బీజేపీ మద్దతు ఇస్తుందా? కాంగ్రెస్‌ మద్దతు ఇస్తుందా?అన్న తేలాలి. మరోవైపు ఆమె కొత్త పార్టీని స్థాపించకుండా కాంగ్రెస్‌లో చేరతారనే చర్చ కూడా జరుగుతున్నది.

ఇంకోవైపు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ను ఆమె విమర్శించడం లేదు. బీఆర్‌ఎస్‌ టార్గెట్‌గానే ఆమె వ్యవహరిస్తున్నారు. ఇంకోవైపు పదేండ్లు బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉన్నపుడు ఆమె పదవులను అనుభవించారు. 2014 నుంచి 2019 వరకు నిజామాబాద్‌ ఎంపీగా పనిచేశారు. ఎంపీగా ఓడిపోయిన వెంటనే 2020 నుంచి ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉన్నపుడు పదవులను అనుభవించి ప్రతిపక్షంలో ఉన్నపుడు పార్టీకి అండగా ఉండాల్సింది పోయి విమర్శలు చేయడమేంటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇంకోవైపు పార్టీ అధికారంలో ఉన్నపుడు తప్పుడు నిర్ణయాలు, అవినీతిపై ప్రశ్నించకుండా ఇప్పుడు వాటిని ప్రస్తావిస్తే వాటికి విశ్వసనీయత ఎలా వస్తుందని కొందరు ప్రశ్నిస్తున్నారు.

సమస్యలపై బీఆర్‌ఎస్‌ ఫోకస్‌
పంచాయతీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు తరఫున సుమారు నాలుగు వేల మందికిపైగా సర్పంచ్‌లుగా గెలిచారని ఆ పార్టీ చెప్తున్నది. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు అధికార కాంగ్రెస్‌పై వ్యతిరేకతతో ఉన్నారనీ, అందుకే ఎక్కువ సీట్లలో గెలవలేకపోయిందని వారు అంటున్నారు. ఇదే ఊపుతో మున్సిపల్‌, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సిద్ధం కావాలని చెప్తున్నారు. కాగా ఎన్నికలతోపాటు ప్రజా సమస్యలపై బీఆర్‌ఎస్‌ దృష్టిసారించింది. ముఖ్యంగా కృష్ణా జలాల్లో తెలంగాణకు అన్యాయం చేస్తున్న కాంగ్రెస్‌ ప్రభుత్వ వైఫల్యంపై ప్రజాపోరాటం చేయాలని నిర్ణయించింది.

పాలమూరు, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లో సంక్రాంతి తర్వాత బహిరంగసభలను నిర్వహించనుంది. బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ స్వయంగా హాజరయ్యే అవకాశమున్నది. కాంగ్రెస్‌ ఇచ్చిన ఆరు గ్యారంటీలు, 420 హామీల అమల్లో వైఫల్యంపైనా ప్రశ్నించనుంది. యూరియా కొరత వల్ల రైతులు పడే ఇబ్బందులపైనా ఫోకస్‌ చేయనుంది. ప్రజల్లో ఉండి వారి సమస్యలపై పనిచేస్తే పార్టీ చెదిరిపోకుండా ఇతర పార్టీలవైపు చూడకుండా ఉండేలా పనికొస్తుందని భావిస్తున్నారు. బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ కూడా కవిత పార్టీతోపాటు ప్రభుత్వంపై ఎలా పోరాటం చేయాలన్న దానిపై విశ్లేషణలు చేస్తున్నారని ఆ పార్టీ నాయకులు చెప్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -