నీళ్లను సముద్రంలోకి వదిలేస్తున్నారు
కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు ఫైర్
నీళ్ల విలువ రేవంత్, ఉత్తమ్‌లకు తెలియదని వ్యాఖ్య
రాజకీయాల కోసం రైతులపై పగ పట్టారు
నవతెలంగాణ-సిద్దిపేట
‘నీళ్ల విలువ రైతులకే తెలుస్తుంది… రేవంత్ రెడ్డికి, ఉత్తమకుమార్ రెడ్డికి తెలియదు. స్వతహాగా కేసీఆర్ రైతు కాబట్టి ఆయనకు నీటి విలువ తెలుసు. అందుకే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారు’ అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు తెలిపారు. సిద్దిపేట క్యాంప్ కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ..కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయాల కోసం రైతులపై పగ ప్రతీకారం తీర్చుకుంటున్నదని అన్నారు. అధికారంలోకి వస్తే ప్రజలకు మేలు చేయాలి తప్ప కీడు చేయకూడదన్నారు. కట్టిన ఇల్లు.. పెట్టిన పొయ్యిలాగా కాళేశ్వరం ప్రాజెక్టు ఉంటే, కాంగ్రెస్ ప్రభుత్వం నీళ్లను సముద్రంలోకి వదులుతూ ప్రాజెక్టును పడావు పెట్టిందన్నారు. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులో 62 వేల క్యూసెక్కుల వరద వస్తున్నదని అన్నారు. నంది మేడారంలో కట్క ఒత్తితే రోజుకి రెండు టీఎంసీల నీళ్లు వచ్చి మిడ్ మానేరులో పడతాయని, వారం రోజుల కిందనే ఈ విష యాన్ని ఉత్తమకుమార్ రెడ్డికి తెలుపుతూ ఉత్తరం రాశానన్నారు. అన్నపూర్ణ, రంగనాయకసాగర్, మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్, బస్వాపూర్ రిజర్వాయర్లు ఖాళీగా ఉన్నాయని, చెరువులన్నీ ఖాళీగా ఉన్నాయని, నీళ్లను ఒడిసి పట్టి, వెంటనే మోటర్లు ఆన్ చేయండి అని ప్రభుత్వానికి విన్నపం చేసినా ఆన్ చేయలేదని అన్నారు. ఇప్పుడు ఎల్లంపల్లి గేట్లెత్తి నీళ్లను సముద్రంలోకి వదులుతున్నారన్నారు. ఇది రాష్ట్రప్రభుత్వ క్రిమినల్ నిర్లక్ష్యమని వ్యాఖ్యానించారు. గోదావరి పరివాహక ప్రాంతాల్లో 60 శాతం డ్యాములు ఖాళీగా ఉన్నాయని, ప్రభుత్వం ఎవరి కోసం పని చేస్తోందని ప్రశ్నించారు. అన్నపూర్ణ కెపాసిటీ మూడున్నర టీఎంసీలు.. అందులో ఉన్నది కేవలం ఒక టీఎంసీ నీళ్లు మాత్రమేనని, రంగనాయక సాగర్ కెపాసిటీ 3 టీఎంసీలకు ఒక టీఎంసీ, మల్లన్న సాగర్ కెపాసిటీ 50 టీఎంసీలకు 10 టీఎంసీలు, కొండపోచమ్మ సాగర్ కెపాసిటీ 15 టీఎంసీలకు 4 టీఎంసీలు, బస్వాపూర్ 12 టిఎంసిలకు అర టీఎంసీ ఉన్నాయని అన్నారు. ఎస్సారెస్పీలో 61 టీఎంసిలు వచ్చాయనీ, వరద కాలువ ఓపెన్ చేసి మిడ్ మానేరు ఎల్‌ఎండి ఎందుకు నింపడం లేదని ప్రశ్నిం చారు. అసలు ఇరిగేషన్‌శాఖకు మంత్రి ఉన్నాడా అని ఎద్దేవా చేశారు. 30 టీఎంసీల మిడ్ మానేరులో ఉన్నది కేవలం 10 టిఎంసిలే, ఎల్‌ఎండిలో కూడా 24 టీఎంసీల్లో కేవలం ఏడుటీఎంసీలు మాత్రమే ఉన్నాయనీ అన్నారు. ఈ రిజర్వాయర్‌లను నింపితే యాసంగిలో లక్షల ఎకరాల్లో పంట పండుతుందన్నారు. ఎల్లంపల్లిలో ఏడు మోటార్లు నడిపితే 22,000 క్యూసెక్కులు మిడ్ మానేరుకు వస్తాయని ఎందుకు మూడు మోటార్లే నడుపుతున్నారని ప్రశ్నించారు. కృష్ణా నదిలో హైడెల్ పవర్ ఉచితంగా ఉత్పత్తి అవుతున్నదని తెలిపారు. జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్‌లో రోజుకు 42 మిలియన్ యూనిట్లు కరెంటు ఉత్పత్తి అవుతున్నదని అన్నారు. మోటర్లు ఆన్ చేయడం చేతకాకపోతే తామే వేలాదిమంది రైతులతో కదిలి వెళ్లి మోటార్లను ఆన్ చేస్తామని హెచ్చరించారు. ‘కాళేశ్వరం ప్రాజెక్టు మోటార్లను ఆన్ అండ్ ఆఫ్ చేస్తున్నారు.. ఇవి ఇంట్లో ఉండే వన్ హెచ్‌పీ మోటర్లు కాదు. అలా చేస్తే మోటార్లు పాడైతాయి. బేరింగ్లు పోతాయి. పొద్దున ఏడు నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు మోటార్లు నడిపిస్తున్నారు. ఇది సరికాదు. బీహెచ్‌ఎల్ కూడా ప్రభుత్వాన్ని హెచ్చరించింది’ అన్నారు. మోటర్లు పనికిరాకుండా పోతే మళ్లీ ఆ బదనాం బీఆర్‌ఎస్‌పై వేయాలని చూస్తున్నారన్నారు. శ్రీశైలం, నాగార్జునసాగర్‌లో గేట్లు ఎత్తి నీళ్లను సముద్రంలోకి వదులుతున్నారు కానీ మోటర్లు ఆన్ చేసి నీళ్లను ఒడిసిపట్టడం లేదన్నారు. కమీషన్లకే వారికి సమయం సరిపోవడం లేదని పరిపాలన ఎక్కడ చేస్తారని ఆరోపించారు. వెంటనే మోటార్లను ఆన్‌చేసి ఖాళీగా ఉన్న రిజర్వాయర్లను, చెరువులను నింపాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో రాజనర్సు, రాధాకృష్ణ శర్మ, గుండు భూపేష్, నాయకం లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
ప్రాజెక్టులు పడావు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES