కలెక్టర్లకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి ఆదేశం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఎన్నికల సంఘం ఈసీఐనెట్ వేదికపై అందుబాటులో ఉన్న ‘బుక్-ఎ-కాల్స్ విత్ బీఎల్‌ఓ’ సౌకర్యాన్ని ప్రజలు విస్తృతంగా వినియోగించేలా ప్రోత్సహించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) సీ.సుదర్శన్ రెడ్డి జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఆయన బుధవారం మెమో జారీ చేశారు. ఓటర్లు తమకు సంబంధించిన బీఎల్‌ఓలను నేరుగా సంప్రదించి ఓటరు వివరాల్లో సవరణలు, ధ్రువీకరణ చేసుకునే వీలుంటుందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో ఇది కీలకంగా ఉపకరిస్తుందని వివరించారు.
బీఎల్‌ఓల ఫోన్ నంబర్లలో మార్పులు జరిగితే వాటిని వెంటనే ఈఆర్వో నెట్ ప్లాట్‌ఫాంలో నవీకరించాలని ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులకు సూచించారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌తో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులు క్షేత్రస్థాయిలో అమలుకు అవసరమైన ఆదేశాలు జారీ చేయాలని సూచించారు. ఓటర్లు సులభంగా బీఎల్‌ఓలతో సంప్రదించి కాల్ బుక్ చేసుకునేలా ముందస్తుగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. పలు రాష్ట్రాల్లో కొనసాగుతున్న ప్రత్యేక సమగ్ర సవరణల నేపథ్యంలో, ప్రజలతో ప్రత్యక్ష అనుసంధానం పెంపొందించడంతో పాటు ఓటర్ల జాబితాల ఖచ్చితత్వాన్ని మెరుగుపర్చడమే ఈ చర్యల లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.
‘బుక్-ఎ-కాల్స్ విత్ బీఎల్‌ఓ’ ను ప్రోత్సహించండి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



