Monday, August 18, 2025
E-PAPER
spot_img
Homeఅంతర్జాతీయంట్రంప్‌ పునర్విభజన ప్రణాళికపై నిరసనలు

ట్రంప్‌ పునర్విభజన ప్రణాళికపై నిరసనలు

- Advertisement -

అమెరికాలో వందలాది ర్యాలీలు
వాషింగ్టన్‌ :
జిల్లాల పునర్విభజన కోసం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ చేస్తున్న ప్రయత్నాలపై ప్రజలు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారు. రిపబ్లికన్లకు అనుకూలంగా ఉండేలా టెక్సాస్‌లో జిల్లాలను పునర్విభజించాలని ట్రంప్‌ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ శనివారం అమెరికా వ్యాప్తంగా ప్రజాస్వామ్య అనుకూల కార్యకర్తలు, కార్మిక సంఘాలు వందలాది ర్యాలీలు, ఇతర కార్యక్రమాలు నిర్వహించాయి. పునర్విభజన ప్రణాళికకు ఆమోదం లభించాలంటే టెక్సాస్‌ సభలో కోరం అవసరమవుతుంది. దానిని అడ్డుకోవాలని నిర్ణయించుకున్న డెమొక్రాట్లు సభకు హాజరు కాలేదు. టెక్సాస్‌లో జరిగిన ర్యాలీని ఉద్దేశించి కాంగ్రెస్‌ మాజీ సభ్యుడు బెటో ఓ రూర్కే ప్రసంగిస్తూ ‘వారు భయపడుతున్నందునే ఈ పని చేస్తున్నారు’ అని ఎత్తిపొడిచారు. ట్రంప్‌ ప్రణాళికను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా 300 ర్యాలీలు జరిగాయి. 44 రాష్ట్రాలు, వాషింగ్టన్‌ డీసీలో జరిగిన ప్రదర్శనలకు వేలాది మంది హాజరయ్యారు. టెక్సాస్‌కు చెందిన యాభై మంది డెమొక్రాట్లు రాష్ట్రం నుంచి పయనమై ఇల్లినాయిస్‌ చేరుకున్నారు. వారు గత రెండు వారాలుగా సభ మొహం కూడా చూడడం లేదు. టెక్సాస్‌ రాష్ట్రంలో అరెస్ట్‌ వారంట్లు జారీ అవుతుండడంతో వాటి నుంచి తప్పించుకునేందుకు డెమొక్రాట్‌ ప్రతినిధులు ఇల్లినాయిస్‌ చేరారు. అక్కడ వారికి నిషేధాజ్ఞలు వర్తించవు. టెక్సాస్‌లో శుక్రవారం ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి ఓటింగ్‌ జరపాలని గవర్నర్‌ గ్రెగ్‌ అబ్బోట్‌ నిర్ణయించినప్పటికీ డెమొక్రాట్ల గైర్హాజరుతో అది సాధ్యపడలేదు. దీంతో ఆయన మరోసారి సమావేశాన్ని ఏర్పాటు చేసే పనిలో పడ్డారు. అయితే ప్రత్యేక సమావేశాన్ని రద్దు చేసినప్పుడే తాము తిరిగి టెక్సాస్‌ వస్తామని సభలోని డెమొక్రాట్లు తేల్చి చెప్పారు.
2026లో జరిగే మధ్యంతర ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌పై పట్టు బిగించాలని ట్రంప్‌ యోచిస్తున్నారు. అందుకోసం డెమొక్రాట్ల పాలనలోని రాష్ట్రాలలో రిపబ్లికన్లకు అనుకూలంగా ఉండేలా జిల్లాల పునర్విభజన చేపట్టాలని ఆయన నిర్ణయించారు. అధ్యక్షుడు చేపట్టిన ఈ అసాధారణ, పక్షపాత చర్య ప్రస్తుతం టెక్సాస్‌కు మాత్రమే పరిమితమైంది. ట్రంప్‌ చర్యపై డెమొక్రటిక్‌ పార్టీ నేతలు, కార్యకర్తలు మండిపడుతున్నారు. ట్రంప్‌కు వ్యతిరేకంగా ప్రజలను సమీకరించేందుకు మరిన్ని ర్యాలీలు నిర్వహించాల్సిన అవసరం ఉన్నదని ప్రజాస్వామ్యవాదులు కోరుకుంటున్నారు. కాగా టెక్సాస్‌ రాజధాని కాపిటల్‌లో అతి పెద్ద ర్యాలీ జరిగింది. ప్రతినిధిసభలో ఆస్టిన్‌కు చెందిన డెమొక్రటిక్‌ సభ్యులు లాయిడ్‌ డాగెట్‌, గ్రెస్‌ కాసర్‌ ప్రజలను ఉత్తేజపరుస్తూ ప్రసంగించారు. ప్రతిపాదిత రిపబ్లికన్‌ మ్యాప్‌లో ఆస్టిస్‌ నుంచి కాంగ్రెస్‌కు ఉన్న ఏకైక సీటు కోసం వీరిద్దరూ పోటీ పడుతున్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad