- ఎఫ్‌ఆర్‌బీఎం పరిధిని నుంచి తొలగించాలి : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విజ్ఞప్తి
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్‌కు ఆర్థిక సాయం అందించాలని డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో విద్యా నాణ్యత, పిల్లల పోషకాహారం అందించే లక్ష్యంతో ఈ స్కూల్స్ ను ప్రవేశ పెట్టినట్టు తెలిపారు. ఈ మేరకు గురువారం నాడిక్కడ కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను.. ఆమె కార్యాలయంలో కలిసి విజ్ఞప్తులు అందజేశారు. ఈ భేటిలో డిప్యూటీ సీఎంతో పాటు రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్ రావు, కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులు, ప్రాయోజిత పథకాల సమన్వయ కార్యదర్శి గౌరవ్ ఉప్పల్ పాల్గొన్నారు. దాదాపు అరగంట పాటు సాగిన ఈ భేటీలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, లోన్‌ల రీస్ట్రక్చర్, విద్యా సంస్థలకు కేంద్ర సాయం, ఇతర అంశాలపై చర్చించారు. తెలంగాణ చేపట్టిన కుల గణన సర్వేలో 56.33 శాతం బీసీలు, 17.43 శాతం ఎస్సీ, 10.45 శాతం ఎస్టీలు ఉన్నట్టు తేలిందని వివరించారు. అయితే విద్యా, పోషకాహార రంగాలలో ఫలితాలు తక్కువగా ఉన్నాయని ఈ అసమానతలు తరతరాలుగా పేదరికాన్ని రూపుమాపనివ్వడంలేదన్నారు. ఈ అంతరాలను పరిష్కరించడానికే.. తెలంగాణ ప్రభుత్వం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ విధానాన్ని రూపొందించిందని వివరించారు. ఈ సమగ్ర విద్యా విధానం కోసం రూ.30 వేల కోట్లు అంచనా వ్యయంగా ఉందన్నారు. ఇందులో 105 క్యాంపస్‌ల నిర్మాణానికి రూ.21 వేల కోట్లు, విద్యా రంగంలో అనుబంధ పెట్టుబడులకు రూ.9,000 కోట్లు అంచనా వేసినట్టు తెలిపారు. ఒక్కో స్కూల్‌లో 5 నుంచి12 తరగతుల వరకు దాదాపు 2,560 మంది విద్యార్థులుంటారని చెప్పారు. దాదాపు 2.7 లక్షల మంది విద్యార్థులు ప్రత్యక్షంగా లబ్ది పొందుతారని, ఇదే సందర్బంలో దాదాపు 5,250 పొరుగు ప్రభుత్వ పాఠశాలలకు మద్దతు ఇచ్చే కేంద్రాలుగా పనిచేస్తాయన్నారు. అందువల్ల ఈ స్కూల్స్ ను ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితుల నుంచి మినహాయింపును ఇస్తే.. నిధుల సమీకరణకు మార్గం సగమం అవుతుందని విజ్ఞప్తి చేశారు. అలాగే కేంద్ర ప్రభుత్వ సహకారాన్ని కూడా అందించాలని కోరారు.
లోన్లను రీస్ట్రక్చర్ చేయండి
గత బీఆర్‌ఎస్ సర్కార్ హయాంలో చేసిన అప్పులకు సంబంధించిన లోన్లను రీస్ట్రక్చర్ చేయాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ను కోరినట్టు డిప్యూటీ సీఎం భట్టి తెలిపారు.
భేటి అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రానికి సంబంధించిన ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా అధిక వడ్డీతో తీసుకున్న రుణాల పరిమితిని సడలించాలని కోరినట్టు చెప్పారు. ఇందుకోసం లోన్ రీస్ట్రక్చరింగ్ చేయాలని విజ్ఞప్తి చేశామన్నారు. అలాగే రాష్ట్రంలో పామాయిల్ పెద్ద మొత్తంలో సాగువుతోందని తెలిపారు. ఈ నేపథ్యంలో దిగుమతి సుంకం సమస్యగా మారిందన్నారు. పామాయిల్ గెలలకు టన్నుకు రూ. 25 వేల కనీస మద్ధతు ధర కల్పించేలా దిగుమతి సుంకాన్ని 44 శాతానికి పెంచాలని మంత్రి కోరినట్టు చెప్పారు. తద్వారా రాష్ట్రంలో పామాయిల్ సాగు పెరిగి గ్రామీణ ఆర్ధిక వ్యవస్థ బలపడుతుందని వివరించారు.