ఇండిగోను ఆదేశించిన ఢిల్లీ హైకోర్టు
విమాన చార్జీలు ఎలా పెంచేస్తారు?
కేంద్రాన్ని, విమానయాన సంస్థలను ప్రశ్నించిన న్యాయస్థానం
న్యూఢిల్లీ : విమానాలు పెద్ద సంఖ్యలో రద్దు కావడంతో విమానాశ్రయాల్లో భారీగా చిక్కుండిపోయిన ప్రయాణికులకు తక్షణమే నష్టపరిహారం చెల్లింపునకు చర్యలు తీసుకోవాలంటూ ఢిల్లీ హైకోర్టు బుధవారం ఇండిగోను ఆదేశించింది. సంక్షోభం కనీ వినీ ఎరుగని రీతిలో నెలకొన్న సమయంలో ఇతర విమానయాన సంస్థలు అనూహ్యంగా ఛార్జీలను ఎలా పెంచేస్తాయని ప్రశ్నించింది. ప్రయాణికులకు నష్టపరిహారం చెల్లించే విషయమై 2010 ఆగస్టు 6న డీజీసీఏ జారీ చేసిన సర్క్యులర్‌ను చీఫ్ జస్టిస్ దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయ, జస్టిస్ తుషార్ రావు గేదెలతో కూడిన బెంచ్ ఈ సందర్భంగా ప్రస్తావించింది. బోర్డింగ్‌ను తిరస్కరించిన, విమానాలు రద్దయిన, ఆలస్యమైన సందర్భాల్లో ప్రయాణికులకు కల్పించే సౌకర్యాలు, నష్టపరిహారం గురించి ఆ సర్క్యులర్‌లో పేర్కొన్నారు.
పరిహారం చెల్లింపు నిబంధనకు ప్రతివాది 3 (ఇండిగో) కచ్చితంగా కట్టుబడి వుండాలని, అలాగే కేంద్ర పౌర విమానయాన శాఖ, డీజీసీఏలు నిర్ధారించాలని కోర్టు ఆదేశించింది. సర్క్యులర్‌లో పేర్కొన్న వాటికి అదనంగా నష్టపరిహారం చెల్లింపు చర్యలేవైనా అందుబాటులో వున్నట్లైతే వాటిని కూడా అధికారులు నిర్ధారించాలని కోర్టు పేర్కొంది. వెంటనే నష్టపరిహారం చెల్లింపు చర్యలను ప్రారంభించాలని ఎయిర్‌లైన్స్‌ను బెంచ్ ఆదేశించింది. కేవలం విమానాలు రద్దయితేనే కాదు, ఇతరత్రా ప్రయాణికులు పడిన ఇబ్బందులకు కూడా చెల్లించాలని పేర్కొంది. దేశవ్యాప్తంగా పలు విమానాశ్రయల్లో వందల సంఖ్యలో ప్రయాణికులు గంటల కొద్దీ పడిగాపులు పడడాన్ని ప్రస్తావించింది. ఏళ్ళ తరబడి తాము పెంచుకుంటూ వచ్చిన పేరు ప్రతిష్టలను ఈ సంఘటన దెబ్బతీసిందని ఇండిగో అంగీకరించింది. అయితే ఇలాంటి అంగీకరణల వల్ల ప్రయోజనమేమీ లేదని, దీనికి ఎలాంటి చట్టప్రాతిపదిక లేదని బెంచ్ పేర్కొంది.
రూ.40వేలకు చార్జీ ఎలా పెంచుతారు ?
ఇంతటి సంక్షోభం ఒకపక్క కొనసాగుతూ వుంటే మరోపక్క ఇతర విమానయాన సంస్థలు ఇబ్బడిముబ్బడిగా చార్జీలను పెంచుతూ పోయాయని, అలా ఎలా చేస్తారని న్యాయస్థానం ప్రశ్నించింది. రూ.4వేల నుంచి రూ.5వేలకు అందుబాటులో వుంటే విమాన టిక్కెట్లు రూ.25వేల నుంచి రూ.30వేలకు వెళ్ళాయని, ఏకంగా రూ.39వేలు నుంచి రూ.40వేలకు ఎలా పెంచేస్తారని, అసలు ఇది ఎలా జరుగుతుందని కోర్టు వ్యాఖ్యానించింది. ఈ పరిస్థితులను అవకాశంగా తీసుకోవడానికి ఇతర విమానయాన సంస్థలను ఎలా అనుమతించారని ప్రశ్నించింది. ఈ దశలో కేంద్రం తరపున అదనపు సొలిసిటర్ జనరల్ చేతన్ శర్మ కలగచేసుకుంటూ మొదటిసారిగా విమానచార్జీలపై పరిమితులు విధించడం ద్వారా కేంద్రం జోక్యం చేసుకుందని చెప్పారు.
ప్రధానమంత్రి కార్యాలయం సమీక్ష
ఇండిగో విమాన అంతరాయాలు, వాటి పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలపై ప్రధానమంత్రి కార్యాలయం మంగళవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత సమీక్ష జరిపింది. డీజీసీఏ, కేంద్ర పౌర విమానయాన శాఖ, ఏఏఐ (ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా) అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.



