Saturday, November 8, 2025
E-PAPER
Homeఎడిట్ పేజిప్రజా నాయకుడు కామ్రేడ్‌ సామినేని

ప్రజా నాయకుడు కామ్రేడ్‌ సామినేని

- Advertisement -

కామ్రేడ్‌ సామినేని రామారావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రైతుసంఘం అధ్యక్షునిగా, కార్యదర్శిగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు సుపరి చితుడు. ఒక్క రైతులనే కాదు, అన్ని వర్గాల పేద ప్రజల సమస్యలను పరిష్కరించిన ప్రజా నాయకుడు. ఖమ్మం జిల్లా పాతర్లపాడుకు చెందిన ఆయన ఖమ్మం జిల్లా రైతు సంఘం కార్యదర్శిగా ప్రజల మన్ననలు పొందాడు. అతని సేవా దృక్పధం గుర్తించిన సారంపల్లి మల్లారెడ్డి అతన్ని రాష్ట్ర అధ్యక్షునిగా ఆహ్వానించారు. అప్పుడు మల్లారెడ్డి ఉమ్మడి ఏపీ రైతు సంఘం కార్యదర్శిగా ఉన్నారు. అంతకుముందు అధ్యక్షునిగా ఉన్న కామ్రేడ్‌ బి.తులసిదాసు ప్రజాశక్తికి మారడంతో ఖాళీ అయిన అధ్యక్ష స్థానానికి తగిన వ్యక్తిగా రామారావుని గుర్తించి రాష్ట్ర కేంద్రానికి రమ్మనగా ఆయన కుటుంబంతో సహా హైదరాబాద్‌కు తరలివచ్చారు. అతనికి కూతురు, కుమారుడు ఉన్నారు. భార్య స్వరాజ్యం కూడా ఉద్యమంలో పనిచేశారు.కుటుంబమంతా ప్రజాసేవకు అంకితమైనదే.

అధ్యక్షునిగా రామారావు రాష్ట్ర వ్యాప్తంగా రైతు సంఘం నిర్మాణాన్ని పటిష్టవంతం చేయడానికి, పోరాటాలు నడపడానికి కృషిచేశాడు. కొత్తగా కార్యకర్తలను జిల్లాల వారిగా తయారుచేశాడు. ఆలోచనాపరుడే కాక రానున్న సమస్యలను ముందే పసిగట్టి వాటికి పరిష్కారం కూడా చూపేవాడు. రైతాంగ భూ సమస్యల మొదలు మార్కెట్‌ సమస్యల వరకు ప్రత్యక్షంగా పాల్గొన్నాడు. ముఖ్యంగా, రాష్ట్రంలో ఆత్మహత్యల నివా రణకు పెద్ద ఉద్యమం నిర్వహించడంలో తోడ్పడ్డాడు. కొత్త కార్యకర్తలను రాజకీయంగా అభివృద్ధి చేయడానికి ”విజ్ఞాన తరగతులు” నిర్వహించి రాజకీయ చైతన్యం కలిగింపచేశాడు. ఉమ్మడి రాష్ట్రంలో ఎక్కడ సమస్యలున్నా, ఎక్కడ రైతాంగం ఇబ్బందులు పడుతున్నా అక్కడికి వెళ్లి ఆ సమస్యను సామరస్యంగా గాని, ఉద్యమం ద్వారా గాని పరిష్కారం చూపేవారు. రాజకీయ క్రమశిక్షణే గాక నిర్మాణ, ఆర్థిక క్రమశిక్షణకు మరో పేరుగా ఉన్నారు. రాష్ట్ర కేంద్రాన్ని బలపరచ డంలో రామారావు కృషి ఎనలేనిది. ఉద్యమం బలహీనమైన జిల్లాలో కార్యకర్తలను పెంచుకోవడానికి రాష్ట్ర కేంద్రంతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాడు. రైతు సంఘం పత్రిక రైతువాణిని ఉన్నత స్థాయిలో నిర్వహించాడు. ముఖ్యంగా రైతు ఉద్యమంలో మహిళా కార్యకర్తలను పెంపొందించ టానికి గణనీయమైన కృషి చేశాడు. పంటల వారి సంఘాలు ఏర్పాటు చేయడానికి తోడ్పడ్డారు.

రాష్ట్రంలో నీటి వనరుల నిర్మాణం, మార్కెట్‌లో కనీస మద్ధతు ధరల అమలుకు ప్రత్యక్ష్యంగా పాల్గొన్నా రు. రైతు సమస్యల పరిష్కారానికి రాష్ట్ర వ్యాపితంగా జాతాలు, ర్యాలీలు, నిరసన ప్రదర్శనలు జరపడానికి సూచనలివ్వడమే కాక ప్రత్యక్ష కార్యచరణకు పూనుకున్నాడు. ముఖ్యంగా, అఖిల పక్ష రైతు సంఘాలను సమన్వయం చేయడంలో ముందు పీఠిన ఉన్నారు. సోదర సంఘాలే కాక, మిత్ర పక్ష సంఘాలు రామారావుకు ఎనలేని గౌరవం ఇచ్చారు. ఉద్యమ కొనసాగింపు సందర్భంగా సంఘం పైన, కార్యకర్తల పైన ప్రభుత్వ నిర్భంధం సాగినప్పుడు దాన్ని ఎదుర్కో వడంలో ముందున్నారు. అనేక కేసులు పెట్టబడ్డప్పటికీ పట్టువదలని నాయకుడిగా ఉద్యమాలను కొనసాగిం చారు. ఖమ్మం జిల్లాలోనే కాక రాష్ట్రంలో అనేక భూ సమస్యలు, ఇరిగేషన్‌, మార్కెట్‌, బ్యాంకులు, విద్యుత్‌ సమస్యలను పరిష్కరించారు. అజాత శత్రువుగా పేరుగాంచిన రామారావుకు ఉద్యమాల రీత్యా తప్ప వ్యక్తిగతంగా ఎవరితో ఎలాంటి శత్రుత్వం లేదు.

రాష్ట్రం విడిపోయిన తర్వాత 2014లో తెలంగాణ రైతు సంఘానికి పెసరకాయల జంగారెడ్డి అధ్యక్షులుగా, బొంతల చంద్రారెడ్డి కార్యదర్శిగా ఎన్నికయ్యారు. రామారావు ఖమ్మం వెళ్లి అక్కడి ఉద్యమంలో పాల్గొన్నాడు. తమ గ్రామంలో అతని భార్య స్వరాజ్యం సర్పంచ్‌గా ఎన్నిక కాగా, ఇద్దరూ కలిసి గ్రామాభివృద్ధికి, మండలాభివృద్ధికి కృషిచేశారు. ఇంతటి ప్రజానాయకుడిగా ప్రజలకు, రైతులకు సేవలందించిన రామారావును 30 అక్టోబర్‌ 2025న ”సుపారీ హంతకులు” స్వగ్రామంలోనే హత్యచేశారు. 73 సంవత్సరాల రామారావు యువకునిగా వామ పక్ష భావాలకు ఆకర్షితుడై, జిల్లా, రాష్ట్ర అఖిల భారత స్థాయిలో నాయకుడిగా ఎన్నికయ్యాడు. అఖిల భారత కిసాన్‌ సభ సభ్యునిగా దశాబ్ద కాలం పాటు సేవలందించాడు. రామారావు మృతి వామపక్ష ఉద్యమానికి తీరనిలోటు. ఆయన స్ఫూర్తితో ప్రజలు, కార్యకర్తలు ముందుకు సాగాలి. నేడు పాతర్లపాడులో నిర్వహించే రామారావు సంస్మరణసభను విజయవంతం చేయాలి.

మూడ్‌ శోభన్‌
9949725951

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -