Tuesday, July 29, 2025
E-PAPER
Homeతాజా వార్తలుఏసీ రెడ్డి స్ఫూర్తితో ప్రజా ఉద్యమాలు

ఏసీ రెడ్డి స్ఫూర్తితో ప్రజా ఉద్యమాలు

- Advertisement -

– మోడీ పాలనలో ఆర్థిక అసమానతలు
– సోషలిజమే దేశానికి ప్రత్యామ్నాయం : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ
నవతెలంగాణ-జనగామ

తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు జనగామ ప్రాంత అభివృద్ధికి బాటలు వేసిన ప్రజా నేత ఏసీరెడ్డి నరసింహారెడ్డి స్ఫూర్తితో ప్రజా ఉద్యమాలు నిర్మిద్దామని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌ వెస్లీ అన్నారు. ఏసీరెడ్డి నరసింహారెడ్డి 34వ వర్ధంతి సందర్భంగా సోమవారం పార్టీ జనగామ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక నెహ్రూ పార్క్‌ నుంచి ఆర్టీసీ చౌరస్తా మీదుగా సాయిరాం కన్వెన్షన్‌ హాల్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం జిల్లా కార్యదర్శి మోకు కనకా రెడ్డి అధ్యక్షతన సభ జరిగింది. ముందుగా ఏసీ రెడ్డి నరసింహారెడ్డి చిత్రపటానికి, ముదిగొండలో భూపోరాటంలో అమరులైన వారికి, కేరళ మాజీ ముఖ్యమంత్రి అచ్యుతానందన్‌కు నివాళులర్పించారు. ఈ సందర్భంగా జాన్‌వెస్లీ మాట్లాడుతూ.. కేంద్రంలో 11 ఏండ్ల బీజేపీ పాలనలో ఆర్థిక అసమానతలు, నిరుద్యోగం పెరిగిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. దేశాన్ని దోచుకుంటున్న కార్పొరేట్‌ శక్తులకు లక్షల కోట్లు రాయితీలిస్తున్న ప్రభుత్వం.. ఓట్లు వేసి గెలిపించిన సామాన్య ప్రజలపై మాత్రం జీఎస్టీ పేరుతో పన్నుల భారాలు వేస్తున్నదని విమర్శించారు. ఫలితంగా దేశంలో సుమారు 80కోట్ల మంది ప్రజలు ఆహార ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. అలాగే, రైతులకు గిట్టుబాటు ధర కల్పించడం లేదని తెలిపారు. కార్మిక హక్కులను కాలరాస్తూ లేబర్‌ కోడ్లు తీసుకొచ్చారని, 8 గంటల నుంచి 12 గంటలకు పని గంటలను పెంచి కార్మికుల శ్రమను దోచుకుంటున్నారని అన్నారు. ప్రజా సమస్యలు పరిష్కరించకుండా విద్వేషాలు రెచ్చగొడుతూ పాలన చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలకు నిధులు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని విమర్శించారు. ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని అన్నారు. ఎన్నికల కమిషన్‌ను స్వతంత్రంగా పనిచేయనీయకుండా బీజేపీ సంస్థగా మార్చే కుట్ర చేస్తోందని అన్నారు. బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలపై పెద్ద ఎత్తున పోరాటాలు చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయకుండా ప్రజలను ఇబ్బందులకు గురిచేయడం సరికాదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న స్థానిక సమస్యలపై ఆగస్టు, సెప్టెంబర్‌ నెలల్లో గ్రామాలు, పట్టణాల్లో సమస్యల పరిష్కారానికి పోరాటాలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రాపర్తి రాజు అహల్య, సాంబరాజు యాదగిరి, సింగారపు రమేష్‌, బొట్ల శేఖర్‌, రాపర్తి సోమయ్య, జిల్లా కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -