ఫ్రాన్స్‌లో సమ్మెల హోరు
పారిస్ : ఫ్రాన్స్‌లో సంక్షేమ పథకాలకు, ఇతర ప్రజా ప్రయోజనకర కార్యక్రమాలకు నిధులను భారీగా తగ్గిస్తూ చేపడుతున్న చర్యలపై ప్రజానీకం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే వివిధ రూపాల్లో పోరాడిన ప్రజలు ప్రభుత్వం నుంచి తగిన ప్రతిస్పందన రాకపోవడంతో దేశవ్యాప్తంగా సమ్మెలకు పిలుపునిస్తున్నారు. ఈ క్రమంలో గురువారం పారిస్ సహా పలు నగరాల్లో శ్రమజీవులు సమ్మె చేపట్టడంతో జనజీవనం స్థంబించింది. దేశాధ్యక్షులు మాక్రాన్ ప్రభుత్వం పొదుపు పేరుతో ప్రజా సంక్షేమానికి నిధుల కోత విధించేందుకు ప్రణాళికలపై కార్మిక సంఘాలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నాయి. దీంతో పెద్ద ఎత్తున సమ్మెలకు పిలుపిచ్చారు. ఫలితంగా గురువారం జనజీవననానికి అంతరాయం కలిగింది. పాఠశాలలు, ఫార్మసీలు మూతపడ్డాయి. దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో రవాణా స్తంభించింది. టీచర్లు, హెల్త్ వర్కర్లు, రవాణా సిబ్బంది అందరూ ఈ నిరసనల్లో చేతులు కలిపారు. గతేడాది పెన్షన్ సంస్కరణలపై జరిగిన నిరసన తర్వాత మళ్ళీ ఇంత పెద్ద ఎత్తున ప్రజా సమీకరణ జరగడం ఇదేనని కార్మిక సంఘాలు పేర్కొంటున్నాయి.
ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లు తమ సమ్మెను అక్టోబరు వరకు వాయిదా వేసుకోవడంతో విమానయానరంగంలో పెద్దగా ప్రభావం కనిపించలేదు. ఇంధన రంగంలో కూడా ఈ సమ్మె ప్రభావం కనిపించింది. సమ్మెకు సంఘీభావంగా కార్మికులు ఉత్పత్తిని తగ్గించడంతో అణు విద్యుత్‌లో 1.1 గిగావాట్ విద్యుత్ ఉత్పత్తి క్షీణించింది. గత వారమే బాధ్యతలు స్వీకరించిన ప్రధాని సెబాస్టియన్ లెకొర్నుకు ఈ సమ్మె ప్రధాన పరీక్షగా నిలిచింది. గత ప్రధాని ఫ్రాంకోయిస్ బైరూ రూపొందించిన పొదుపు పథకాల ప్యాకేజీపై ప్రజల నిరసనలు వెల్లువెత్తడంతో దిద్దుబాటు చర్యలు తీసుకుంటానని సెబాస్టియన్ హామీ ఇచ్చారు. కానీ కార్మికసంఘాలు తమ పట్టును వీడలేదు. ఫ్రాన్స్‌లోనే అతిపెద్ద టీచర్స్ యూనియన్‌అయిన ఎస్‌ఎన్‌ఇఎస్- ఎఫ్‌ఎస్‌యు ప్రధాన కార్యదర్శి సోఫీ మాట్లాడుతూ, ఇలాంటి హామీలవల్ల తమ ఆగ్ర హం చల్లారదన్నారు. మార్పుకు మాక్రాన్ పెద్ద అడ్డంకి అని సిజిటి యూనియన్ నేతల సోఫీ బినెట్ వ్యాఖ్యానించారు. దేశ బడ్జెట్‌లో లోటును తగ్గించాలంటే కోతలు తప్పవని ప్రభుత్వం వాదిస్తోంది. కానీ పార్లమెంట్‌లో మెజారిటీ లేకపోవడంతో 2026 బడ్జెట్‌ను ఆమోదించడంలో లెకొర్ను ప్రభుత్వం పోరాడుతోంది.
సంక్షేమ నిధుల కోతపై ప్రజాగ్రహం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES