చట్టసభల్ని అడ్డుపెట్టుకొని సంపద పెంచుకుంటున్న ప్రజాప్రతినిధులు
పెరిగిన ఎంపీల ఆదాయాలపై ఏడీఆర్ రిపోర్ట్
అంతా కోట్ల ఆసాములే!…ఆ రేస్‌లో బీజేపీ ఎంపీలు ఫస్ట్
ఆ తర్వాతి స్థానంలో కాంగ్రెస్, వైఎస్‌ఆర్‌సీపీ, ఎంఐఎం ఎంపీలు
దేశంలో కోట్లాది మంది ప్రజలు ధరల పెరుగుదల, ఆదాయ స్థబ్దత, ఉద్యోగాల లేమితో జీవన భారాన్ని మోస్తున్న కాలంలోనే, ప్రజల ఓట్లతో అధికారంలోకి వచ్చిన ప్రజాప్రతినిధుల వ్యక్తిగత సంపద మాత్రం వేగంగా పెరుగుతోంది. గత పది ఏళ్లలో మూడు వరుస లోక్‌సభ ఎన్నికల్లో గెలిచిన ఎంపీల ఆస్తులు సగటున 110 శాతం పెరిగినట్లు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రీఫార్మ్స్ తాజా నివేదిక వెల్లడించింది. ఈ గణాంకాలు రాజకీయ విజయం ప్రజాసేవకా, లేక ఆస్తులు పోగేసుకోవడానికా అన్న కీలక ప్రశ్నను ముందుంచుతున్నాయి.
2014 నుంచి 2024 వరకు వరుసగా ఎన్నికల్లో గెలిచిన 102 మంది ఎంపీల అఫిడవిట్ల ఆధారంగా రూపొందిన ఈ నివేదిక.. ప్రజల జీవితం నెమ్మదిగా కదులుతుంటే, ప్రజాప్రతినిధుల సంపద మాత్రం రెట్టింపు అవుతున్న తీరును స్పష్టంగా చూపిస్తోంది. వామపక్షాలను మినహాయిస్తే పార్టీలు, ప్రాంతాలు, భావజాలాలకు అతీతంగా ఈ ధోరణి కొనసాగుతోంది. అధికారంలో నిలకడగా ఉన్నవారే, వరుసగా గెలిచినవారే, అత్యధికంగా ఆస్తులు పెంచుకున్నారని ఏడీఆర్ నివేదిక చెబుతోంది. మూడు వరుస గెలుపులు ప్రజల విశ్వాసానికి సూచిక కావాల్సిన చోట, అదే గెలుపులు వ్యక్తిగత ఆస్తుల పెంపుకు మెట్లుగా మారుతున్నాయన్న అనుమానాన్ని ఈ గణాంకాలు బలపరుస్తున్నాయి.
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
‘ప్రజాసేవ’ దారితప్పుతోంది. రాజ్యాదికారంలో సామాన్యుడు అట్టడుగునే మిగిలిపోతున్నాడు. సంపన్నులే చట్ట సభలకు ఎన్నికవుతున్నారు. వారు గెలిచాక, సహజంగానే ఆదాయాలు వందలకోట్లు దాటిపోతున్నాయి. చట్టసభల్లో ప్రాతినిధ్యాన్ని సొంత ఆస్తుల పెంపుకోసం వాడుకుంటున్నారనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. ఎంపీల ఆస్తులు పెరిగినంత వేగంగా, వారి నియోజకవర్గాల్లోని ప్రజల ఆదాయాలు పెరగట్లేదు. తాజాగా అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్(ఏడీఆర్) నివేదిక ఈ విషయాలను మరోసారి బహిర్గతం చేసింది. మూడు వరుస లోక్‌సభ ఎన్నికల్లో గెలిచిన 102 మంది ఎంపీల ఆస్తులు సగటున 110 శాతం పెరిగాయని వెల్లడించింది. ఆదాయాలు అమాంతం పెరిగిన ఎంపీల్లో 65 మంది బీజేపీకి చెందినవారే ఉండటం గమనార్హం. మహారాష్ట్రలోని సతారా నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ ఎంపీ ప్రతాప్‌సిన్హా మహరాజ్ ఆస్తులు ఏకంగా రూ. 162 కోట్లు పెరిగాయి. ఆ తర్వాత రూ. 130 కోట్లకు పైగా పెరుగుదలతో తరువాత స్థానంలో బీజేపీకి చెందిన గుజరాత్‌లోని జామ్‌నగర్‌కు ఎంపీ పూనంబెన్ హేమంత్‌భాయ్ ఉన్నారు.
మజ్లిస్ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఆస్తులు 488 శాతం వృద్ధిని సాధించాయి. శ్రీకాకుళం ఎంపీ, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఆస్తులు 177 శాతం పెరిగాయి. వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి ఆస్తులు రూ.124 కోట్లకు పైగా పెరిగాయి. అదేపార్టీకి చెందిన కడప ఎంపీ అవినాశ్‌రెడ్డి ఆస్తులు 477 శాతం పెరిగాయి. 2014 నుంచి 2024 వరకు వరుసగా ఎన్నికల్లో గెలిచిన 102 మంది ఎంపీల అఫిడవిట్ల ఆధారంగా ఈ నివేదికను ఏడీఆర్ రూపొందించినట్టు పేర్కొంది. ఓవైపు దేశంలో ప్రజాజీవితం ఆర్థిక ఒడిదుడుకులకు గురవుతుంటే, ప్రజా ప్రతినిధుల ఆదాయాలు ఏకంగా వందల రెట్లు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తున్న అంశమే. రాజకీయ వ్యవస్థ పూర్తిగా సంపన్నుల చేతిలోకి వెళ్ళిపోతుండటం గమనార్హం. వామపక్షాలను మినహాయిస్తే మిగిలిన పార్టీల న్నింటిలో ఈ ధోరణి స్పష్టంగా కనిపిస్తోంది. ఎంపీలుగా మూడు వరుస విజయాలు ప్రజా విశ్వాసానికి సూచికగా నిలవాలి. కానీ అదే సమయంలో సదరు ఎంపీల వ్యక్తిగత ఆస్తులు భారీగా పెరుగుతున్న అంశాన్ని విశ్లేషించాల్సిందే. మూడు పర్యాయాలు ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి నుంచి లోక్‌సభ సభ్యుడిగా గెలుపొందిన ప్రధాని మోడీ ఆస్తులు కేవలం రూ. 1,36,15,307 మాత్రమే పెరిగాయి.
2014 లో తొలిసారి ఎంపీగా పోటీ చేసిన మోడీ తన ఆస్తులను రూ.1,65,91,582 కోట్లుగా ప్రకటించగా, 2019 ఎన్నికల్లో రూ.2.51 కోట్లుగా అఫిడవిట్‌లో చూపారు. అయితే, మూడు సార్లు ప్రధానిగా ఉన్నా తన ఆస్తులు మాత్రం కేవలం 82 శాతం మాత్రమే పెరిగినట్లు తెలిపారు. ఇదే సందర్భంలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆస్తులు దాదాపు రూ.11 కోట్లు పెరిగినట్లు ఏడీఆర్ తెలిపింది. 117 శాతంతో ఆయన 38వ స్థానంలో నిలిచినట్టు తెలిపింది. 2014 లో రారు బరేలీ ఎంపీగా గెలిచిన రాహుల్ తన ఆస్తులను రూ. 9.40 కోట్లుగా, 2019 లో వాయనాడ్ ఎంపీగా రూ. 15. 88 కోట్లుగా, 2024 లో ఆమేథి ఎంపీగా రూ. 20.39 కోట్లుగా చూపారని పేర్కొంది. కోటా ఎంపీ, లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా ఆస్తులు రూ. 8 కోట్లు, కేంద్ర మంత్రులు జితేంద్ర సింగ్ ఆస్తులు రూ. 4 కోట్లకు పైగా, కిరణ్ రిజిజు రూ. 3 కోట్లకు పైగా, అనుప్రియ పటేల్ ఆస్తులు రూ. 1.5 కోట్లకు పైగా పెరిగాయి. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి, నవ్‌సారీ నియోజక వర్గ ఎంపీ సీఆర్ పాటిల్ ఆస్తులు మాత్రం తరిగిపోయాయి.



