క్రికెట్‌కు టెస్టు స్పెషలిస్ట్ వీడ్కోలు
నవతెలంగాణ – ముంబయి
భారత టెస్టు క్రికెట్ స్పెషలిస్ట్ చతేశ్వర్ పుజారా (37) ఆటకు వీడ్కోలుకు పలికాడు. ‘అన్ని మంచి విషయాలకు తప్పనిసరిగా ఓ ముగింపు ఉంటుంది’ అంటూ పుజారా అన్ని రకాల క్రికెట్ ఫార్మాట్ల నుంచి వైదొలుగుతున్నట్టు ఆదివారం ప్రకటించాడు. చివరగా 2023 ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్లో ఆడిన చతేశ్వర్ పుజారా.. ఆ తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమయ్యాడు. ఆటకు వీడ్కోలు చెప్పకముందే.. పుజారా రెండో ఇన్నింగ్స్ మొదలెట్టాడు. పుజారా టెలివిజన్ వ్యాఖ్యాతగా ప్రస్తుతం రాణిస్తున్నాడు. 37 ఏండ్ల చతేశ్వర్ పుజారా క్రికెట్ కెరీర్‌లో టెస్టులకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. టెస్టు జట్టులో భారత క్రికెట్ దిగ్గజం రాహుల్ ద్రవిడ్ స్థానంలో నం.3 పొజిషనల్‌లో బ్యాటింగ్ చేసిన పుజారా.. అంచనాలను ఎక్కువసార్లే అందుకున్నాడు. 19 సెంచరీలు, 35 అర్థ సెంచరీలు సాధించిన పుజారా.. టెస్టు క్రికెట్‌లో తను ఆడిన ప్రతి జట్టుపై సెంచరీలు సాధించాడు. అఫ్గనిస్తాన్‌తో ఒక్క టెస్టులో ఆడినా.. వంద మార్క్ అందుకోలేదు. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌పై ఐదు సెంచరీలు బాదిన పుజారా.. శ్రీలంకపై నాలుగు శతకాలు బాదాడు. 2010 బెంగళూర్ టెస్టులో ఆస్ట్రేలియాపై అరంగేట్రం చేసిన చతేశ్వర్ పుజారా.. భారత్‌కు ఎన్నో సిరీస్‌ల్లో విజయాలు అందించాడు. అందులో ఆస్ట్రేలియా గడ్డపై 2018-19, 2020-21 బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ సహా 2023 స్వదేశీ సీజన్‌లో భారత్‌కు సిరీస్ అందించటంలో పుజారా పాత్ర కీలకం. 2018-19లో ఆస్ట్రేలియా గడ్డపై భారత్ చారిత్రక తొలి టెస్టు సిరీస్ విజయం అందుకోగా.. నాలుగు టెస్టుల్లో 521 పరుగులతో చతేశ్వర్ పుజారా ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచాడు. దేశవాళీ క్రికెట్‌లో సౌరాష్ట్ర తరఫున రంజీ ట్రోఫీలో ఆడిన పుజారా.. ఇంగ్లాండ్ కౌంటీ క్రికెట్‌లో ససెక్స్ తరఫున బరిలో నిలిచాడు. సుదీర్ఘ క్రికెట్ కెరీర్‌లో మద్దతుగా నిలిచిన అభిమానులు, కుటుంబ సభ్యులు, సహచర క్రికెటర్లు, బీసీసీఐకి పుజారా ధన్యవాదాలు తెలిపాడు. భారత టెస్టు క్రికెట్‌ను మరింత ప్రత్యేకంగా నిలిపిన చతేశ్వర్ పుజారాకు రిటైర్‌మెంట్ సందర్భంగా బీసీసీఐ శుభాకాంక్షలు తెలిపింది.
టెస్టు క్రికెట్ యోధుడు
వైట్‌బాల్ ఫార్మాట్‌లో పుజారాకు ఆకర్షణీయ గణాంకాలు లేవు. వన్డేల్లో అతడికి అవకాశాలు సైతం తక్కువే వచ్చాయి. భారత్‌కు 5 వన్డేలు ఆడిన పుజారా 51 పరుగులే చేశాడు. లిస్ట్-ఏ క్రికెట్‌లో మాత్రం 130 మ్యాచుల్లో 57 సగటుతో 5759 పరుగులు సాధించాడు. కానీ రెడ్‌బాల్ ఫార్మాట్‌లో చతేశ్వర్ పుజారా దిగ్గజాల సరసన నిలిచాడు. 103 టెస్టుల్లో భారత్‌కు ప్రాతినిథ్యం వహించిన పుజారా.. 43.60 సగటు, 7195 పరుగులు చేశాడు. 19 శతకాలు, 35 అర్థ సెంచరీలు పుజారా ఖాతాలో ఉన్నాయి. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 278 మ్యాచుల్లో 51.8 సగటుత పుజారా 21301 పరుగులు చేశాడు. 66 సెంచరీలు, 81 అర్థ సెంచరీలు ఫస్ట్ క్లాస్ కెరీర్‌లో సాధించాడు. టీ20 ఫార్మాట్‌లో పుజారా ఆడింది తక్కువే. 71 మ్యాచుల్లో పుజారా 1556 పరుగులు చేశాడు. ఐపీఎల్‌లో పుజారా మూడు ప్రాంఛైజీల తరఫున ఆడాడు. టెస్టుల్లో పుజారా అత్యధిక స్కోరు అజేయ 206 పరుగులు కాగా.. టీ20ల్లో అజేయ 100 పరుగులు.