Thursday, August 28, 2025
E-PAPER
spot_img
Homeజాతీయంపంజాబ్ లో ఉగ్రకుట్రను భగ్నం చేసిన పోలీసులు

పంజాబ్ లో ఉగ్రకుట్రను భగ్నం చేసిన పోలీసులు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : పహల్గామ్ ఉగ్రదాడి ఘటన అనంతరం దేశంలో మరిన్ని దాడులు జరిగే అవకాశం ఉందన్న నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ క్రమంలో కేంద్ర హోంశాఖ నిన్న అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రజలంతా స్వీయరక్షణ చర్యలపై దృష్టి సారించాలని, అత్యవసర పరిస్థితులకు సిద్ధంగా ఉండాలని సూచించింది. ఇందులో భాగంగా రేపు దేశవ్యాప్తంగా మాక్‌డ్రిల్ నిర్వహించాలని కోరింది.
ఇదే సమయంలో, ఉగ్రవాద కార్యకలాపాలపై భద్రతా బలగాలు ఉక్కుపాదం మోపుతున్నాయి. పంజాబ్‌లోని అటవీ ప్రాంతానికి సమీపంలో ఉగ్ర కదలికలపై సమాచారం అందుకున్న పోలీసులు, విస్తృత గాలింపు చర్యలు చేపట్టారు. ఈ సోదాల్లో భారీగా గ్రెనేడ్లు, ఐఈడీలతో పాటు ఉగ్రవాదులు ఉపయోగించే వైర్‌లెస్ కమ్యూనికేషన్ హార్డ్‌వేర్‌ను స్వాధీనం చేసుకుని, ఉగ్ర కుట్రను భగ్నం చేసినట్లు అధికారులు వెల్లడించారు. పంజాబ్‌లో స్లీపర్ సెల్స్‌ను తిరిగి క్రియాశీలం చేసేందుకు పాకిస్థాన్ ఐఎస్ఐతో సంబంధాలున్న ఉగ్రవాద సంస్థలు ప్రయత్నిస్తున్నాయని రాష్ట్ర డీజీపీ తెలిపారు. మరోవైపు, కశ్మీర్‌లోని బుద్గాం జిల్లాలో ఉగ్రవాదులకు సహకరిస్తున్న ఇద్దరు వ్యక్తులను భద్రతా సిబ్బంది అరెస్టు చేసి, వారి నుంచి ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల కుప్వారా జిల్లాలోనూ భద్రతా బలగాలు ఓ ఉగ్ర స్థావరాన్ని ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే.
పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత దేశంలో మరిన్ని దాడులకు ఆస్కారం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించిన నేపథ్యంలోనే ఈ భద్రతా చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. దీంతో దేశవ్యాప్తంగా భద్రతా బలగాలు, పోలీసులు పూర్తి అప్రమత్తతతో వ్యవహరిస్తున్నారు. గగనతల దాడుల వంటివి జరిగితే ప్రజలు ఆందోళనకు గురికాకుండా ఎలా వ్యవహరించాలి, సైరన్‌ మోగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల వంటి అంశాలపై ఈ మాక్‌డ్రిల్‌లో దృష్టి సారిస్తారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad