– నిజామాబాద్ జిల్లా సహకార అధికారి శ్రీనివాస్
– కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి
నవతెలంగాణ-కమ్మర్ పల్లి
రైతుల సౌకర్యార్థమే సింగిల్ విండోల ఆధ్వర్యంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని నిజామాబాద్ జిల్లా సహకార అధికారి శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయం గోదాం వద్ద సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని సొసైటీ చైర్మన్ రేగుంట దేవేందర్ తో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా నిజామాబాద్ జిల్లా సహకార అధికారి శ్రీనివాస్ మాట్లాడుతూ రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటను దళారులకు అమ్మిన మోసపోవద్దన్న ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందన్నారు. అందులో భాగంగానే కమ్మర్ పల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. రైతులు తాము పండించిన మొక్కజొన్నను కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి ప్రభుత్వం అందించే మద్దతు ధరను పొందాలన్నారు.
ఎంతో శ్రమ కూర్చి పండించిన పంటను దళారులను నమ్మి, పంటను విక్రయించి మోసపోవద్దని రైతులకు సూచించారు. కొనుగోలు కేంద్రాల ద్వారా క్వింటాలు మొక్కజొన్నకు రూ.2400 మద్దతు ధర అందించడం జరుగుతుందన్నారు. రైతులు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకొని ప్రభుత్వం అందించే మద్దతు ధరను పొందాలని కోరారు. కార్యక్రమంలో కమ్మర్పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పాలెపు నరసయ్య, వైస్ చైర్మన్ సుంకేట బుచ్చన్న, క్లస్టర్ అధికారి పోశన్న, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సుంకేట రవి, మండల వ్యవసాయ అధికారిని రమ్యశ్రీ, వ్యవసాయ విస్తరణ అధికారులు కావ్య, రమేష్, సొసైటి డైరెక్టర్లు రేంజర్ల మహేందర్, సీఈఓ శంకర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.