– రష్యా అధ్యక్షుడి పర్యటన ఖరారు
– ధ్రువీకరించిన క్రెమ్లిన్
మాస్కో : రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ డిసెంబర్‌లో భారత్‌లో పర్యటించనున్నారు. క్రెమ్లిన్ ఫారీన్ పాలసీ సహాయకుడు ఈ విషయాన్ని ధృవీకరించారు. అయితే తేదీ విషయంలో స్పష్టత రావాల్సి ఉన్నది. రష్యా నుంచి చమురు దిగుమతులపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత్‌పై సుంకాలు విధించిన నేపథ్యంలో ఆయనపర్యటన ప్రాధాన్యత ను సంతరించుకున్నది. ఇప్పటికే భారత్, రష్యా దేశాల మధ్య సంబంధాలు మరింత బలపడుతున్నాయి. షాంఘై సహకార సంస్థ(ఎస్‌సీఓ) సమ్మిట్‌లో భారత ప్రధాని మోడీ, పుతిన్ సోమవారం సమావేశమవుతారనీ, డిసెంబర్ పర్యటనకు సన్నాహాలపై చర్చిస్తారని క్రెమ్లిన్ సహాయకుడు యూరి ఉషాకోవ్ తెలిపారు. గతంలో భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కూడా పుతిన్ పర్యటనపై ధృవీకరించారు. ఆయన త్వరలో భారత్‌లో పర్యటిస్తారని చెప్పారు. రష్యా చమురు కొనుగోళ్లను కారణంగా చూపుతూ ట్రంప్.. భారత దిగుమతులపై అదనంగా 25 శాతం సుంకం విధించారు. రష్యా నుంచి తక్కువ ధరకు చమురు కొని, దానిని బహిరంగ మార్కెట్‌లో అధిక లాభాలకు అమ్ముకుంటుందని ట్రంప్ ఆరోపించిన విషయం విదితమే. ఉక్రెయిన్ పై రష్యా దాడిని ఆపేందుకు మాస్కోపై ఒత్తిడి పెంచేందుకు ఈ ఆంక్షలు విధిస్తున్నామని అమెరికా వాదించింది. ఈ చర్యను భారత్ తప్పుబట్టింది. రష్యా నుంచి అమెరికా, యూరప్ దేశాలు కూడా చమురు దిగుమతులు చేసుకుంటున్నాయని భారత్ గుర్తు చేసింది. 2022 ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌పై దాడి తర్వాత రష్యా తన ఇంధన అమ్మకాలను ఐరోపా నుంచి భారత్, చైనా వంటి దేశాలకు మళ్లించిన విషయం విదితమే.
ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం
ఈ నెలలో పుతిన్.. మోడీకి ఫోన్ చేసి ఉక్రెయిన్ యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌తో తాను జరిపిన సమావేశం గురించి వివరించారు. ఈ రెండు దేశాల ప్రత్యేక, విశేష వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి వారు ద్వైపాక్షిక సహకారానికి సంబంధించిన అనేక అంశాలను చర్చించుకున్నారు.
డిసెంబర్‌లో భారత్‌కు పుతిన్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES