నవతెలంగాణ – హైదరాబాద్: భారత పర్యటనకు విచ్చేసిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు శుక్రవారం ఢిల్లీలో ఘన స్వాగతం లభించింది. పర్యటనలో భాగంగా ఆయన రాజ్‌ఘాట్‌ను సందర్శించి జాతిపిత మహాత్మా గాంధీకి నివాళులర్పించారు. గాంధీ సమాధి వద్ద పుష్పగుచ్ఛం ఉంచి ఆయన శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా పుతిన్ వెంట కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ ఉన్నారు. అనంతరం పుతిన్ అక్కడి సందర్శకుల పుస్తకంలో సంతకం చేశారు.
అంతకుముందు రాష్ట్రపతి భవన్ ప్రాంగణంలో పుతిన్‌కు సంప్రదాయబద్ధంగా గౌరవ వందనంతో స్వాగతం పలికారు. ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయన్ను సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఇరు దేశాల ఉన్నతాధికారులను ఒకరికొకరు పరిచయం చేసుకున్నారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ, అధ్యక్షుడు పుతిన్ హైదరాబాద్ హౌస్‌లో అధికారిక చర్చలు జరపనున్నారు. ఈ భేటీలో రక్షణ, ఇంధన రంగాల్లో సహకారం, ప్రాంతీయ భద్రత, దీర్ఘకాలిక ఆర్థిక భాగస్వామ్యం వంటి కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ చర్చలు ఇరు దేశాల సంబంధాలను మరింత బలోపేతం చేస్తాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.



