యూఎస్‌తో ప్లూటోనియం ఒప్పందం రద్దు
మాస్కో : రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అమెరికాతో 2000 సంవత్సరంలో కుదిరిన ప్లూటోనియం నిర్వహణ ఒప్పందాన్ని అధికారికంగా రద్దు చేశారు. అణు ఆయుధాల ఉత్పత్తిని పరిమితం చేయడానికి ఉద్దేశించిన ఈ ఒప్పందం నుంచి నిష్క్రమించడానికి వీలుగా రష్యా పార్లమెంట్‌లోని దిగువ సభలో ఈ బిల్లును ఆమోదించగా దీనికి గతవారం ఫెడరేషన్ కౌన్సిల్ అనుమతి ఇచ్చింది. పుతిన్ ఆమోదంతో ఈ చట్టం సోమవారం నుంచి అమలులోకి వచ్చింది. 2000, సెప్టెంబర్‌లో సంతకం చేయబడిన ఈ ఒప్పందం ప్రకారం.. రష్యా, అమెరికా దేశాలు సైనిక అవసరాలకు అవసరం లేని 34 టన్నుల అణు ఆయుధాల గ్రేడు ప్లూటోనియంను నిర్వహించాల్సి ఉండేది. అమెరికా శతృత్వ చర్యలు, ఆంక్షలు విధించడం, రష్యా తూర్పు సరిహద్దుల వద్ద నాటో ప్రభావం పెరగడంతో ఈ ఒప్పందాన్ని రద్దు చేసినట్టు రష్యా తెలిపింది.
క్రూజ్ మిస్సైల్‌లో చిన్న అణు శక్తి యూనిట్ అభివృద్ధి చేశామని, దీనితో మిస్సైల్ పరిధిని అనంతంగా పొడిగించవచ్చని పుతిన్ చెప్పారు. ఇది తక్కువ ఎత్తులో ఎగరని, అనిశ్చిత మార్గంతో కూడిన మిస్సైల్ అని వివరించారు. ప్రపంచంలో దీనికి సమానమైనది లేదన్నారు. రష్యన్ అధికారుల ప్రకారం.. ఈ మిస్సైల్ 15 గంటలు గాలిలో ఉండి, సుమారు 14,000 కిలోమీటర్లు (8,700 మైళ్లు) ప్రయాణించింది. మాస్కో దీన్ని అమలులోకి తీసుకురావడానికి పనిచేస్తోంది. ఇది అమెరికా, రష్యా మధ్య మరింత ఉద్రిక్త పరిస్థితులను పెంచనుందని నిపుణులు భావిస్తున్నారు. అయితే రష్యా తయారుచేసిన అత్యాధునిక క్షిపణిపై ట్రంప్ జీర్ణించుకోలేక.. ఉక్రెయిన్‌ను ఉసిగొల్పుతున్నారనే కారణంతో పుతిన్ ఈ నిర్ణయం తీసుకొని ఉండొచ్చని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.



