Sunday, July 27, 2025
E-PAPER
Homeజోష్ఎక్కుపెట్టిన ప్రశ్నలు

ఎక్కుపెట్టిన ప్రశ్నలు

- Advertisement -

నేటి సామాజిక మాధ్యమాల మూలంగా, ఆ మాధ్యమాల్లో నిర్వహించే కవిత్వసమూహాల మూలంగా కొత్తకవులెందరో పరిచయం కాగలగుతున్నారు. లబ్దప్రతిష్టులు కవిత్వనిర్మాణ మర్మాలను రాస్తుంటే, నిశితంగా నేర్చుకుంటూ, కొత్తగళాలు పదునుదేలుతున్నాయి. మూలాల్లోంచీ రాసేవాళ్లు, పల్లెమట్టిలోంచి పలుకుబడులను పలికేవాళ్లు, ఎంత చాకిరీ చేసినా వెనకబాటుతనమే మిగలడానికి కారణాన్ని అన్వేషించీ వెల్లడయ్యేవాళ్లు, తాత్వికతను వండి వార్చేవాళ్లు, కొత్తవాక్యాన్ని, కొత్త శిల్పాన్ని అందించేవాళ్లు నేడు అనేకమంది తెలుగుకవిత్వంలోకి చురుకైన సూర్య కిరణాల్లా దూసుకొస్తున్నారు. వారిలో పల్లిపట్టు నాగరాజు అనే యువకంఠం బలమైనది. చిరుతలా దూకే పదాలతో సమాజ అపసవ్యతలపై కలబడ్డాడు. ఎంతో కలతపడ్డాడోగానీ, ఎంత నలిగిపోయాడో గానీ ఇవాళ విలువైన అక్షరంగా వెలిగిపోయాడు. ఆ వెలుగు ”యాలై పూడ్చింది”. నేడు అనంతపురం కేంద్రీయ విశ్వవిద్యాలయం ఎంఏ తెలుగు రెండో సమిస్టర్‌ పాఠ్యాంశంగా ఎంపికైంది. ఈ సందర్భంగా నవతెలంగాణ జోష్‌ లో యాలై పూడ్చింది విశేషాలు…
పల్లిపట్టు చిత్తూరుజిల్లా నుండి మొలకెత్తిన కవి. నిజ జీవితంలో చెమటకాల్వలై పారినవాడు. కయ్యల్లో బురదకాళ్లయి తిరిగినవాడు.పారబట్టిన వాడు. వలసవెళ్లి ఇటుకలబట్టీలో కూలీగా కష్టం ఎరిగినవాడు. చదువుకుని, ఉపాధ్యాయుడిగా ఎదిగినవాడు. అక్కడితో ఆగిపోకుండా, కవిత్వమార్గం పట్టాడు. వర్తమాన సమాజానికి ఏమి అవసరమో, ఆ అక్షరం రాయడానికి పూనుకున్నాడు. ఆదిలో ” రెక్కలు” వంటి లఘుప్రక్రియలు రాశాడు. సుగంబాబు, శ్రీనివాస్‌ గౌడ్‌ వంటి కవుల ప్రశంసలు పొందినవాడు. సాహిత్యసభలకు హాజరవడం, మేడిపల్లి రవికుమార్‌ వంటి ఆచార్యుల శిష్యరికం పల్లిపట్టుని కవిత్వపుతేనెపట్టుగా మార్చాయి. తన సహకవులతో చేసే సాహిత్యచర్చలు, పుస్తకపఠనం, జి. లక్ష్మీనరసయ్య వంటి ఉద్ధండుల విమర్శ పల్లిపట్టు పైమెట్టుకు ఆటపట్టుగా మారాయి. అందుకు కవిసంగమం తొడ్పాటు అందించింది. ఇప్పటికే కేంద్రసాహిత్య అకాడమీ యువ పురస్కారం పొందిన ఈ యువకవికి చిన్నవయసులోనే మరో గౌరవం దక్కింది. దానివెనుక పల్లిపట్టుకి కవిత్వం పట్ల ఉన్న నిజాయితీ, నిబద్ధత కారణం. ‘యాలై పూడ్చింది%-%లోఈ కవి కవితారీతిని పరిశీలిద్దాం.
”కర్రులై యుగాల కయ్యల్ని దున్నిన దేహాలు మేము / ఆరెలై యుగాల పాదాల్ని కాచిన దేహాలు మేము/ దేశాల దేహాలు మేము/ దేహాల దేశాలు మావి అంటూ/ ఎన్నిసార్లు పాడినా/ పాటెందుకో ఇంకా ఇంకా మిగిలే వుంటుంది”. ”కాల్చిన ఎండుతునకలాంటి కమ్మని ముద్దులు”, ”పుట్ట తేనే తాగిన మట్టిగొంతుతో” వంటి అభివ్యక్తులతో తన సంపుటికి ప్రారంభాన్ని పలికాడు. కర్రులు, ఆరెలు, ఎండుతున్కలు వంటి పదాలతో ఎత్తుకున్నాడు గనక కవి మూలాలను ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఈ దేశంలో శ్రామికమూలాలున్న దళితులు ఎన్ని ప్రతిఘటనలు, ఎన్ని పోరాటాలుగా సాగుతున్నా అదే వివక్ష, అవే దాడులు పునరావతం అవుతున్నాయి. కవికదే కలతగా మారింది. అందుకే ఇంకా ఇంకా నిరసన గొంతుకై పాడటానికి పాటను నూరుకొచ్చాడు. ఆ పాటలోని చరణాలు పదును పదునుగా అదునుగా కూడా పడ్డాయి. పల్లిపట్టు వన్నీ ధైర్యాక్షరాలే… ”చర్చ” కవితను గమనించండి.
”తడిసిన మట్టిలోంచీ మొలకెత్తి / పట్టెడు బువ్వయ్యే పొలమన్న గురించి మాట్లాడాలి / బువ్వలేక ఎండుతోన్న డొక్కల గురించి మాట్లాడాలి / ఆవుని గురించి మాట్లాడినట్టే బర్రెను గురించి మాట్లాడాలి/ జంతువుని గురించి మాట్లాడే ముందు మనిషిని గురించి మాట్లాడాలి” పల్లిపట్టు ”చర్చ”కు పెట్టిన విషయాలన్నీ వాస్తవిక రాజకీయాలకు పట్టింపులేనివి. పేదవాళ్లకు, దోపిడీ కాబడుతున్న వాళ్లకు,వ్యథాభరిత జీవులకు తోడుపడని పాలకులుండటం గమనించిన కవి, నిలబడాల్సిన వాళ్లవైపు నిలబడ్డాడు. కలబడాల్సిన వాళ్లతోనే కలబడ్డాడు.ఆవు వంటి జంతువుల గురించి కన్నా వధ కాబడే మనుషుల గురించి మాట్లాడమనీ సూటిగా తనగళం వినిపించాడు. ప్రశ్నించే గొంతుకలు ”నిషేధస్వరం” అవుతున్న వేళ, కారాగారావాసంలోకి నెడుతున్న వేళ పల్లిపట్టు సేఫ్‌ జోన్లోంచి కవితను రాయలేదు.రాజ్యానికెదురుగానే చాలా కవితలు రాసాడు. సాహసగుణం లేని కవి నిజాలను పెల్లుబికలేడు. అందుకే సమకాలీనతను బాగా పట్టించుకుని,చిత్రించగలిగాడు.
పల్లిపట్టు పద్యాలలో మట్టివాసన మెండు.మట్టిమనుషులకు పెద్దపీట వేస్తాడు.
”మట్టిని తవ్వే చేతులు/ మట్టిని దున్నే పాదాలు/ వొళ్లంతా మట్టివాసనతో/ పరిమళిస్తున్న సమూహాలు”గాయాల్ని మోస్తూ, మోసకారి కుట్రలకు బలికావద్దని అప్రమత్తం చేస్తాడు.
”మట్టితో పెట్టుకుంటే/ మట్టిగరచిపోవడమే” అనికూడా హెచ్చరిక విడుస్తాడు.ఇంకా మట్టిపదాలను కవిత్వమెలా చేసాడో పరికించండి.
”మనుషులంతా /మట్టిని తొడుక్కుని తిరుగాడే మట్టికువ్వలు/ మట్టివేళ్లతో చిగురించే మట్టిబొమ్మలు” గుండెనిండా మట్టివాసన పీల్చుకునేలా మట్టిసౌరభాన్ని పదాలతట్టలో సర్ది, మనకందించాడు. సమాజ అపసవ్యతలే కాదు, రాజ్యం పాల్పడే అరాచకాలే కాదు. బహుజనుల వ్యథాభరిత బతుకుగోసలూ పల్లిపట్టు బాధ్యతగా వినిపించాడు. రుక్కత్త (చేపలమ్మే బతుకు), దుఃఖపోగులనేత (నేతన్న జీవితం), సపాయమ్మలు, మంగలిన్యాయం వంటి కవితలు పల్లిపట్టు బహుజన దక్పథానికి అద్దంపడుతున్నాయి. వత్తుల కడగండ్లనే కాదు, ఆత్మగౌరవ పతాకంగా కూడా వాళ్లను ఎగరేసాడు. మంగలిన్యాయం కవితలో…
”మురికిజుట్టుని కూడా/ ముఖం చిట్లించుకోకుండా గొరిగి/ కోరమీసాలో రొయ్యమీసాలో/ మట్టసంగా దిద్దీ”
ఒక ముఖ్యమంత్రి మంగలివాళ్లను కలవనన్నప్పుడు నిరసనగా రాసాడు. ఇది సందర్భకవితే గానీ అగ్రకుల భావనను, వివక్షను పదునుగా తిరస్కరించిన వైనం వుందిందులో! రుక్కత్త కవితలో చేపలమ్మే స్త్రీని అత్తగా బంధం కలుపుకుని రాసాడు. పల్లెల్లో బహుజనుల మధ్య చుట్టం వరసలు పెట్టి పిలిచే దశ్యాలెన్నో వుంటాయి. ఆమెను వర్ణిస్తూ…
”కులమూ గిలమూ అంటూ కుళ్లిన మనిసి కాదు/ ఆకలేస్తే ఏ ఇంటైనా అన్ని సద్దినీళ్లో/ అంత సంగటికవనమో తినిపోయేదీ” అంటాడు. ”గెబ్బిడు సింతపండు యీయందే ,ఇంటాడబడుచులా కదలనంటది” అని చెబుతూనే రుక్కత్త జీవనకష్టాన్ని కండ్లకు కట్టిస్తాడు. చేనేతల బతుకుయాతన అర్థంజేసుకున్న విధాన్ని చూడండి..
”బతుకుపోగులెన్ని తూర్లు తెగిపోతున్నా/ తెగిపోని నమ్మకాలేవో/ తమని తాము నేసుకుంటున్న చోట/ ఆశలు అందని అడియాసల గుండంలో/ తడియారని ఆశల్నే అల్లుకుంటూ/ దేశందేహంపై జెండాగా ఎగురుతున్న/ నేతగుడ్డకు ఎన్ని వందనాలు చెయ్యాలి!?”
దేశం జెండాను నేసిన చేనేత వారికి ”ఒక వాక్యమైనా చదువులేని నిర్భాగ్యం ఎందుకుందో”, పట్టు పోగులను అల్లిన వాళ్లకు దుఃఖమెందుకు మిగిలిందోననీ గట్టిగానే ప్రశ్నించాడు. వాళ్ల దుఃఖాన్ని వాళ్లు పోగొట్టే మంత్రాన్ని ముగింపు చేశాడిలా..
”అతికించడమూ తెంపడమూ చేతనైన చేతులు/ దేన్నయినా తెంపకుండా ఎలా వుంటాయి!?
కవి దారి చూపేవాడు. కేవలం కన్నీటిని రాస్తే, అది కవితనం కాదు. కన్నీటి వూబిలోంచి పైకి లాగే కరుణహస్తమే కవిది కావాలి. పల్లిపట్టుది మానవీయకలం. తన గళంనిండా దయ పొంగి పొర్లుతుంది. అది దీనార్త హదయాల పక్షం వహిస్తుంది అనడానికీ సంపుటిలో చాలా కవితలున్నాయి. ఈ సంపుటికి శీర్షికగా నిలిచిన ”యాలై పూడ్చింది” విషయానికొద్దాం. దేశమెలా వుందో తేటతెల్లం చేసిన కవిత. డొల్లతనాల్ని ఎండగట్టిన వస్తువు.
”ఇంగిలీసోడు యలబారి యేండ్లు గడస్తావున్నా/ దుమ్మెత్తిపోస్తారే గానీ /దేశంలోపల దొరల సంగతేందీ!?
దేశం వదిలిపోతున్న దొంగల కతేందీ!?/ సెలవిస్తారా సామీ” ఇంటిదొంగల్ని పట్టించాడిక్కడ.
”దేశాన్ని భారతమ్మని పిల్సుకుంటున్నామే/ ఈ దేశాన ఆడకూతుర్ల మానపేనాలు/ చితికి బూడిదైపోతున్న అగత్త్యమేందీ?”
దేశంలో నిర్భయ,అసిఫా లాంటి దురాగతాల్ని ప్రస్తావనకు తెచ్చాడు. ఇంకా కులమతాల కుమ్ములాటలు, కల్లాల్లో కుమిలే మట్టిగుండెలు, కూటికాడ,కూరకాడ విద్వేషాలు, దేవుడిపేరు మీద సాగే దొంగ భజన్లను,మోసకారితనాల్ని దుయ్యబట్టాడు. వాటికి మద్దెల వాయించననీ, నిరసిస్తాననీ… దాన్ని తన కవిత్వపుయాలగా ప్రకటించుకున్నాడు. కవెపుడు సత్యంవైపు నిలబడాలె. సత్యం కోసం ఎవరితోనైనా కలబడాలె. ఆ కలబడే తెగువ పల్లిపట్టు పద్యాలనిండా వెల్లువెత్తింది.
కవితకు వస్తువెంత ముఖ్యమో, అభివ్యక్తి కూడా అంతే ముఖ్యం. వస్తువు అతడి దక్పథాన్ని, సీరియస్‌ నెస్‌ నీ పట్టిచూపితే, అభివ్యక్తి కవి ప్రతిభకు అద్దంపడుతుంది. కొత్త వాక్యాలను, పదబంధాలను, పోలికలను కవిత్వం ప్రతిబింబిస్తే, ఆ కవి నాల్కలకెక్కుతాడు. పల్లిపట్టు తన కవిత్వంలో ప్రత్యేక ఆకర్షణగా సీమనుడిని తెచ్చాడు. అదే అతడి నివాళ సాహిత్యలోకంలో స్థిరంగా నిలబెట్టింది. కర్రులు, కయ్యలు, గెనాలు,తూర్లు,కుశాల,మడకలు, కవణమై కూచోడం, దొంగనాబట్టా, గెబ్బిడు, కవుడుకుచ్చడంలేని వంటి పదాలెన్నో మట్టిపదాలుగా పోతపోశాడు. ఇంకా కవితా శీర్షికల విషయంలోనూ శ్రద్ధ కనబడుతున్నది. సైబరక్వేరియం, దుఃఖమలయాళం, కరువుఋతువు,కర్రు పలుకుతున్న వాక్యం, పండగ్గెద్ద, పుర్రెలదండయాత్ర, చిగురుకొమ్మలపై సూర్యోదయం, దూడమూతివాసన ..ఇవన్నీ సజనాత్మకంగా, ప్రతీకాత్మకంగానూ, కవితాత్మకంగానూ శోభిల్లిన శీర్షికలు. ఇంకా అభివ్యక్తులనూ రుచిచూద్దాం.
1. ”నాగేలిపాదాలతో దారుల్ని దున్నుకుంటూ/కొడవళ్ల చేతులతో దుఃఖాన్ని కోసుకుంటూ”
ఇందులో నాగేలిపాదాలు, కొడవళ్ల చేతులు మెటాఫర్లు. రైతు కవితలో వస్తువు గనక మెటాఫర్లూ వాటికి సంబంధించినవే తెచ్చాడు.
2. ”బోదెబోదెకు కన్నీళ్లు పారగట్టిన”
ఈ వాక్యం సాగుసంబంధమైనదే. చేనుకు నీళ్లుబెట్టే రైతు దుఃఖానికి అద్దం పట్టాడు. దుఃఖాన్ని పారగట్టడమే కొత్తదనం.
3. ఇది వానకు అంటరాని నేల/చుట్టూ నదులు పారుతున్నా/ఇక్కడ కరువు ప్రవహిస్తుంటది”
సీమలో వానలు లేక కరువు తాండవించే దుస్థితిని నవనవంగా రాశాడు.
కవితల్నిండా ప్రకతిని కూడా విస్తతంగా కూర్చోబెట్టాడు. పూలను, తూనీగల్ని, చేపల్ని, ఆవుల్ని, పిట్టలు, మళ్లీ ఆ పిట్టల్లో పిలిచేపిట్ట, అరిచే పిట్ట, కోప్పడే పిట్ట, ముదిగారపు పిట్టలంటూ పక్షికాలువను మనపై పారిస్తాడు. కుళ్లుబోతుచేపలు, నీళ్లబుగ్గలు, నీటిబాల ,చెరువు అద్దం, తూనీగతల్లులు, నీసుబోతుగాలి, వానమనసు వంటి ప్రాకతిక బొమ్మలు, దశ్యాలు అతడిలోని లలితమైన చూపుకి దాఖలాగా వున్నాయి.

వర్థమాన కవిగా పల్లిపట్టు, ఎందరో సీనియర్లు రాయలేని రాజకీయ పంథాను అనుసరిస్తున్నాడు. ప్రేమ పాటలు పాడుకునే పచ్చి యవ్వనంలో, కులమతభేదాలతో పుచ్చుపోయిన సమాజానికి కవితావైద్యం చేస్తున్నాడు. అతడు ”యాలై పూడ్చింది” సాక్షిగా బహుజనుల సానుభూతి స్వరంగానూ, నూటికి నూరుపాళ్లు దళిత చైతన్య స్వరంగానూ, వెరసి మానవీయత అతడి పద్యాలకు జీవనాడి. పల్లిపట్టు కోరుకున్నట్టు ప్రేమరంగు లోకం సాకారం కావాలి. అతడి సజనశక్తికి, కవితాయుక్తికి మనసారా అభినందనలు.
– మెట్టానాగేశ్వరరావు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -