Tuesday, July 22, 2025
E-PAPER
Homeజాతీయంఆగస్టు 13న క్విట్‌ ఇండియా డే

ఆగస్టు 13న క్విట్‌ ఇండియా డే

- Advertisement -

– కార్పొరేట్లకు వ్యతిరేకంగా… ట్రాక్టర్‌/మోటార్‌ వెహికల్‌ పరేడ్‌
– ఆగస్టు 15 నుంచి జాతీయ ప్రచారం
– ట్రంప్‌, మోడీ దిష్టిబొమ్మల దహనం
– నవంబర్‌ 26న భారీ కార్మిక, రైతు నిరసన : సంయుక్త కిసాన్‌ మోర్చా పిలుపు
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో

ఆగస్టు 13న ”కార్పొరేట్లు క్విట్‌ ఇండియా డే”గా నిర్వహించనున్నట్టు సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్కేఎం) పిలుపు ఇచ్చారు. రైతులు ట్రాక్టర్‌/ మోటారు వాహన కవాతులు, నిరసన ప్రదర్శనలు నిర్వహించాలని, అలాగే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌, ప్రధాని మోడీ దిష్టిబొమ్మలను దహనం చేస్తూ ‘కార్పొరేషన్లు క్విట్‌ ఇండియా’ నినాదాన్ని మార్మోగించాలని పిలుపు ఇచ్చింది. ఢిల్లీలో ఎస్కేఎం జనరల్‌ బాడీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి 12 రాష్ట్రాలు.. 37 రైతు సంఘాల నుంచి106 మంది ప్రతినిధులు హాజరయ్యారు. అధ్యక్షతన వర్గంగా అశోక్‌ ధావలే, దర్శన్‌ పాల్‌, యుధ్వీర్‌ సింగ్‌, ఆశిష్‌ మిటల్‌, బడగలపుర నాగేంద్ర, సునీలం, రావుల వెంకయ్య, పురుషోత్తం శర్మ, సత్యవాన్‌ వ్యవహరించారు. ఏఐకేఎస్‌ సీనియర్‌ నేత హన్నన్‌ మొల్లా స్వాగతం పలికారు. రాజన్‌ క్షీరసాగర్‌ ఎజెండాను వివరించారు. అశోక్‌ ధావలే ముగింపు ప్రసంగం చేశారు. 9న కార్మిక సమ్మె విజయవంతం కావడంతో కార్మిక సంఘాల ఉద్యమ నాయకత్వాన్ని, కార్మిక వర్గాన్ని ఎస్కేఎం జనరల్‌ బాడీ అభినందించింది. ఈ విజయం పాలక వర్గాల ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టడానికి మొత్తం శ్రామిక ప్రజలు సిద్ధంగా ఉన్నారనే విశ్వాసాన్ని సమాజంలోని ప్రజాస్వామ్య వర్గాల్లో నింపిందని పేర్కొంది. మోడీ ప్రభుత్వం విదేశీ వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ)పై సంతకం చేయడానికి అమెరికా సామ్రాజ్యవాద ఆదేశాలకు లొంగిపోతోందని అశోక్‌ ధావలే విమర్శించారు. ముఖ్యంగా వ్యవసాయం, పాడి, ఆహార మార్కెట్‌ రంగాలను తెరవడంతో ఇది మొత్తం ప్రజల, దేశం ప్రయోజనాలను దెబ్బతీస్తుందని విమర్శించారు. ఎఫ్‌టీఏ 2025 ఆగస్టు 1 నాటికి అమల్లోకి రానుందని, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం అమెరికా ఒత్తిళ్లను అంగీకరించి, జీఎం ఆహారాలు, ఆహార మార్కెట్లలో ఎంఎన్సీ చొరబాటుతో సహా ఆహారం, పాల వస్తువుల దిగుమతులను పెంచడానికి తీసుకున్న చర్యలను నిరసిస్తూ సామూహిక ఆందోళనలు చేపట్టాలని సూచించారు.

ఎస్కేఎం నిర్ణయాలు
– పంజాబ్‌లో జులై 30న అన్ని జిల్లాల్లో ట్రాక్టర్‌ ర్యాలీలు, ఆగస్టు 24న భారీ మహాపంచాయత్‌ నిర్వహించనున్నాయి.
– అదానీ గ్రూప్‌ బొగ్గు గనుల కోసం తమ భూమిని బలవంతంగా సేకరించడాన్ని నిరసిస్తున్న సింగ్రౌలి గిరిజన రైతుల రైతులకు ఎస్కేఎం జనరల్‌ బాడీ పూర్తి సంఘీభావం తెలిపింది.
– 2020-21 చారిత్రాత్మక రైతుల పోరాటం 5వ వార్షికోత్సవం సందర్భంగా న్యూఢిల్లీతో పాటు రాష్ట్ర రాజధానులలో భారీ కార్మిక, రైతు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఎస్కేఎం ట్రేడ్‌ యూనియన్‌ ఉద్యమం, వ్యవసాయ కార్మికుల ఉద్యమంతో సమన్వయం చేసుకుంటుంది.
– ఆగస్టు 15 నుంచి నవంబర్‌ 26 వరకు కార్పొరేట్‌-మత శక్తులకు వ్యతిరేకంగా జాతీయ ప్రచారం. కార్మిక-రైతు ఐక్యత, హిందూ-ముస్లిం ఐక్యత అనే రెండు స్తంభాల ఆధారంగా వివిధ మతాలు, విశ్వాసాల లౌకిక ఐక్యతకు, మొత్తం శ్రామిక ప్రజల వర్గ ఐక్యతకు దారితీస్తుంది.

డిమాండ్లు
1. వ్యవసాయ రంగాన్ని/ఆహార ధాన్యాల ఉత్పత్తిని, పాడి రంగాన్ని దెబ్బతీసే ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం, చౌక దిగుమతులను తిరస్కరించడం.
2. సమాఖ్య హక్కులను బలహీనపరిచే, ప్రభుత్వ వ్యవసాయ మార్కెట్లను కార్పొరేట్‌ స్వాధీనం చేసుకోవడాన్ని ప్రోత్సహించే కార్పొరేట్‌ అనుకూల ఎన్‌ పీఎఫ్‌ఏఎంను రద్దు చేయాలి.
3. అన్ని పంటలకు సీ2ం50 శాతం కనీస మద్దతు ధర ఇవ్వాలి.
4. రైతు ఆత్మహత్యలను నివారించడానికి రైతులు, వ్యవసాయ కార్మికులకు సమగ్ర రుణమాఫీ చేయాలి.
5. విచక్షణారహితంగా భూసేకరణ, భూ సమీకరణ పథకాలు, పారిశ్రామిక నమూనా టౌన్‌షిప్‌లు ఆపాలి. భూసేకరణ చట్టం 2013ను అమలు చేయాలి.
6. విద్యుత్తును ప్రయివేటీకరించకూడదు. స్మార్ట్‌ మీటర్లను బిగించొద్దు. అన్ని గ్రామీణ గృహాలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తును అందించాలి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -