సరికొత్త డిజైన్లు…తక్కువ ఖర్చు…పనిలో వేగంతో ముందంజ
టెస్లా సహా చతికిలపడిన అనేక వాహనాల అమ్మకాలు
వేగంగా మార్కెట్‌లోకి చైనా ఆటో మొబైల్ ఉత్పత్తులు
అత్యంత తక్కువ సమయంలోనే వాహనాలను ఉత్పత్తి
అంతర్జాతీయ మార్కెట్‌పై ఆధిపత్యం
చైనా ఆటో ఉత్పత్తిదారులు ప్రపంచ మార్కెట్‌లోకి వేగంగా దూసుకుపోతున్నారు. అత్యంత తక్కువ సమయంలోనే వాహనాలను ఉత్పత్తి చేస్తూ అంతర్జాతీయ మార్కెట్‌పై ఆధిపత్యం ప్రదర్శిస్తున్నారు. ముఖ్యంగా చెరీ, బీవైడీ వంటి కంపెనీలు దూకుడుగా విస్తరిస్తున్నాయి. వ్యాపార పోరులో సంప్రదాయ ఆటో ఉత్పత్తిదారులను దాటుకుంటూ ముందుకు సాగిపోతున్నాయి. వేగం, సానుకూల వైఖరి వారి వ్యాపారాభివృద్ధికి దోహదపడుతున్నాయి. మార్కెట్ డిమాండ్‌కు అనుగుణంగా వారు వేగవంతంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. తద్వారా ఇప్పటికే వేళ్లూనుకుపోయిన ఆటో ఉత్పత్తిదారులకు సవాళ్లు విసురుతున్నారు. నిన్న మొన్నటి వరకూ ఆటో ఉత్పత్తిలో ప్రసిద్ధిగాంచిన వ్యాపార దిగ్గజాలు ఇప్పుడు వారితో పోటీ పడేందుకు ప్రయత్నిస్తున్నాయి.
షాంఘై : చైనాకు చెందిన ఆటో ఉత్పత్తిదారు చెరీ సంస్థ వాహనాల డిజైన్‌ను పూర్తిగా మార్చేయడంలో పూర్తి సమర్ధత చాటుకుంది. కేవలం ఆరు వారాల వ్యవధిలోనే ఒమేడా 5 ఎస్‌యూవీకి మార్పులు చేసి యూరోపియన్ మార్కెట్‌లో ప్రవేశ పెట్టింది. దీంతో చైనా ఉత్పతిదారులు పశ్చిమ దేశాల కంపెనీలపై పైచేయి సాధించారు. సంవత్సరంన్నర సమయంలో చైనా ఆటో ఉత్పత్తిదారులు…ముఖ్యంగా చెరీ, బీవైడీ కొత్త కొత్త మోడల్స్‌ను అభివృద్ధి చేసి మార్కెట్‌కు అందిస్తున్నాయి. ఇదే పని చేయడానికి సంప్రదాయ ఆటో ఉత్పత్తిదారులకు సంవత్సరాల కాలం పడుతోంది.
దూకుడుగా ముందుకు…
చెరీ సంస్థ చైనాకు చెందిన అతి పెద్ద ఆటో ఉత్పత్తిదారు. ఇప్పుడు ఈ సంస్థ యూరప్‌లో కాలు పెట్టేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. కొత్త ఫ్యాక్టరీలను ఏర్పాటు చేసే ఆలోచనలో ఉంది. ఇంటర్నల్ కంబస్టన్ ఇంజిన్ వాహనాలు, ఎలక్ట్రిక్ మోడల్స్ సహా వైవిధ్యంతో కూడిన ఉత్పత్తులను అందించే పనిలో పడింది. ఫలితంగా ఇప్పటికే పేరొందిన అంతర్జాతీయ ఆటో ఉత్పత్తిదారులతో దూకుడుగా పోటీ పడే స్థాయికి చేరుకుంది. ఒకప్పుడు చైనా ఆటో మార్కెట్‌లో విదేశీ కంపెనీల ఆధిపత్యమే నడిచింది. అలాంటిది చెరీ కంపెనీ తయారు చేసిన ఒమోడా వాహనం దేశీయ మార్కెట్‌లో ప్రవేశించగానే సీన్ రివర్స్ అయింది. విదేశీ ఆటో ఉత్పత్తిదారులందరూ తోక ముడవాల్సి వచ్చింది. ఇప్పుడు స్వదేశంలోనే కాదు…అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా తమ ప్రభావం చూపాలని చైనా ఆటో దిగ్గజ సంస్థలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇతర కంపెనీలతో పోలిస్తే చెరీ వాహనాలే ఎక్కువగా విదేశాలకు ఎగుమతి అవుతున్నాయి. మరోవైపు చైనాలో పెద్ద ఆటో ఉత్పత్తిదారుగా నిలుస్తూ, ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తిలో దూసుకుపోతున్న బీవైడీ ప్రత్యర్థి సంస్థలకు దీర్ఘకాల సవాలు విసురుతోంది. బీవైడీ దూకుడుతో ఆ కంపెనీలకు భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని పరిశ్రమ ఎగ్జిక్యూటివ్‌లు అభిప్రాయపడ్డారు.
అమ్మకాలలో దేశీయ కంపెనీల జోరు
చైనా ఆటో సంస్థల ఉద్యోగులు వారంలో ఆరు రోజులు…రోజుకు 12 గంటలు పనిచేస్తారు. గత సంవత్సరం చెరీ, బీవైడీ కంపెనీల అంతర్జాతీయ అమ్మకాలు 40 శాతం పెరిగాయి. అదే సమయంలో అమెరికాకు చెందిన ఎలక్ట్రిక్ వాహన సంస్థ టెస్లా అమ్మకాలు తొలిసారిగా పడిపోయాయి. టెస్లా తయారీ వాహనాల మోడల్స్ అన్నీ పాతబడిపోవడమే దీనికి ప్రధాన కారణం. చైనాలో 2020-2024 మధ్యకాలంలో వోక్స్‌వ్యాగన్, టొయోటా, హోండా, జనరల్ మోటార్స్, నిస్సాన్ వంటి విదేశీ ఆటో దిగ్గజ కంపెనీలకు చెందిన ప్యాసింజర్ కార్ల అమ్మకాలు ఏడాదికి సగటున 9.4 మిలియన్ల నుండి 6.4 మిలియన్లకు పడిపోయాయి. అదే సమయంలో దేశీయ కంపెనీల అమ్మకాలు 4.6 మిలియన్ల నుండి 9.5 మిలియన్లకు…అంటే దాదాపు రెట్టింపయ్యాయి. వాహన అమ్మకాలు పడిపోతుండంతో కలవరపడిన విదేశీ కంపెనీలు ఇప్పుడు చైనా సంస్థలతో చేతులు కలిపి వాహనాలను అభివృద్ధి చేస్తున్నాయి. చైనా కార్ల తయారీలో నమోదవుతున్న వేగాన్ని విదేశీ సంస్థల యజమానులు సైతం కొనియాడడం విశేషం.
వెనుకబడిపోతున్న టెస్లా
దశాబ్దం క్రితం వరకూ చైనా ఆటో ఉత్పత్తిదారులు విదేశీ ప్రత్యర్థులను అనుసరించే వారు. ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. సొంతంగా రూపొందించుకున్న సాంకేతిక పరిజ్ఞానంతో, తక్కువ ఖర్చుతో, సరికొత్త డిజైన్లతో, వేగంగా వాహనాలను ఉత్పత్తి చేస్తున్నారు. ప్రపంచంలోని ప్రతి మార్కెట్‌లోనూ, ప్రతి విభాగంలోనూ పోటీ పడాలని బీవైడీ కోరుకుంటోంది. ఈ సంస్థ చైనాలో 2020లో నాలుగు లక్షల కార్లను విక్రయించగా ఆ సంఖ్య గత సంవత్సరంలో 37 లక్షలకు చేరింది. ఈ కంపెనీ ఇటీవలే రెండు లక్షల మంది సిబ్బందిని నియమించుకుంది. జనరల్ మోటార్స్‌లో పనిచేస్తున్న మొత్తం సిబ్బంది కంటే ఈ సంఖ్య ఎక్కువ. బీవైడీతో పోలిస్తే టెస్లా బాగా వెనుకబడి పోయింది. బీవైడీ ప్రతి సంవత్సరం కార్ల అమ్మకాలను రెట్టింపు చేసుకుంటూ ముందుకు పోతోంది. టెస్లా 2020లో తన అత్యుత్తమ అమ్మకపు మోడల్ ‘వై’ని విడుదల చేయగా బీవైడీ 40కి పైగా కొత్త వాహనాలను, 139 కొత్త మోడల్స్‌ను మార్కెట్‌లో ఉంచింది. పైగా బీవైడీలో పని పరిస్థితులు చాలా బాగుంటాయి. యాజమాన్యం, సిబ్బంది మధ్య సత్సంబంధాలు ఉండడంతో ఉత్పత్తి వేగం పుంజుకుంటోంది.
దిగుమతి సుంకాలతో అడ్డుకుంటున్నా…
చైనా ఆటో ఉత్పత్తిదారులు కేవలం సంవత్సరంన్నర వ్యవధిలోనే సరికొత్త డిజైన్‌తో కూడిన వాహనాన్ని ఉత్పత్తి చేస్తున్నారు. చైనా కంపెనీల నుండి ఎదురవుతున్న పోటీతో బెంబేలెత్తిపోతున్న అమెరికా, యూరప్ దేశాలు తమ కార్ల పరిశ్రమను కాపాడుకునేందుకు దిగుమతి సుంకాలు విధిస్తున్నాయి. అయితే విదేశీ పోటీదారులతో పోలిస్తే చైనా వ్యాపారులు అతి తక్కువ ధరకే వాహనాలను ఉత్పత్తి చేస్తున్నారు. సాంకేతికంగా కూడా వారిదే పైచేయిగా ఉంది. కాబట్టి అమెరికా, యూరప్ బెదిరింపులను వారు ఏ మాత్రం ఖాతరు చేయడం లేదు. పైగా ఎప్పటికప్పుడు తాజా మోడల్స్‌తో మార్కెట్లను కుదిపేస్తున్నారు. బీవైడీలో తొమ్మిది లక్షల మంది ఉద్యోగులు, కార్మికులు పనిచేస్తున్నారు. ఇది టోయోటా, వోక్స్‌వ్యాగన్ కంపెనీల మొత్తం సిబ్బందికి సమానం. బీవైడీ కంపెనీ తన సిబ్బందికి అనేక రకాల సౌకర్యాలు కల్పిస్తోంది. ఇతర సరఫరాదారులపై పెద్దగా ఆధారపడకుండా సొంతగానే అనేక విడిభాగాలను తయారు చేసుకుంటోంది. దీంతో పనిలో వేగం పెరుగుతోంది. ఖర్చు తగ్గుతోంది.