ఆరు గ్యారంటీల అమలు చట్టబద్ధత కోసం ప్రయివేటు బిల్లు పెడతాం
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్
నవతెలంగాణ – రాజన్న సిరిసిల్ల
తెలంగాణ రైతులకివ్వాల్సిన సొమ్మును ‘రాహుల్ బంధు’ పేరుతో ఏడాదికి రూ.వెయ్యి కోట్లు తమ పార్టీకి సీఎం రేవంత్‌రెడ్డి దోచిపెడుతున్నారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ ఆరోపించారు. ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తూ రానున్న అసెంబ్లీ సమావేశాల్లో ప్రయివేటు మెంబర్ బిల్లును తీసుకొచ్చే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని అన్నారు. రాజన్నసిరిసిల్ల జిల్లా కేంద్రంలో సోమవారం మున్సిపల్ కౌన్సిలర్ల ఆత్మీయ సన్మాన కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడారు. ఆరు గ్యారంటీల అమలు చట్టబద్ధత కోసం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా ప్రయివేటు మెంబర్ బిల్లుకు ఓటు వేయాల్సి వస్తుందని, ఎందుకంటే కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ చెప్పిన మాటనే తాము అసెంబ్లీలో చెప్తామని అన్నారు. ఈ బిల్లుకు కాంగ్రెస్ పార్టీ ముందుకు వచ్చి మద్దతు ఇచ్చి ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ‘రాహుల్ బంధు’ అనే కొత్త పథకాన్ని ప్రవేశపెట్టినట్టు కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఈ ‘రాహుల్ బంధు’ పథకాన్ని రైతులకు ఇచ్చే రైతు బంధు నిధులతో మొదలుపెట్టారని, ఏడాదికి రూ.వెయ్యి కోట్లు రాహుల్ గాంధీకి ఇచ్చేలా పక్కాగా అమలు చేస్తున్నారని ఆరోపించారు. రాహుల్ గాంధీ కుటుంబానికి ఎప్పుడు ఇబ్బంది అయినా రూ.వేల కోట్లు పంపించేందుకు రేవంత్‌రెడ్డి ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఇప్పటికే మూడుసార్లు రైతు బంధును ఎగ్గొట్టి.. ఈసారి కూడా ఎగనామం పెడుతున్నారని విమర్శించారు. ఇంకోవైపు సామంత రాజుగా వ్యవహరిస్తూ రాహుల్ గాంధీనికి కప్పం కట్టేందుకు పేదల భూములు లాక్కుని, వారి ఇండ్లు కూలగొట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని అన్నారు. అందుకే హైదరాబాద్ నుంచి మొదలుకొని ఖమ్మం దాకా అన్ని చోట్ల పేదల ఇండ్లను కూలగొట్టి వ్యాపారం చేసి డబ్బులు సంపాదిస్తున్నారన్నారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య, జిల్లా పార్టీ ఇన్‌చార్జీ తుల ఉమ, మున్సిపల్ చైర్‌పర్సన్ జిందం కళ, మున్సిపల్ వైస్ చైర్మెన్ దార్ల సందీప్, పట్టణ అధ్యక్షులు జిందం చక్రపాణి, జిల్లానాయకులు చల్మెడ లక్ష్మీనరసింహారావు, చీటి నర్సింగరావు పాల్గొన్నారు.
రైతుల సొమ్ముతో ‘రాహుల్ బంధు’ పథకం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



