నవతెలంగాణ – హైదరాబాద్: లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) లక్ష్యంగా తన విమర్శల దాడిని మరింత తీవ్రతరం చేశారు. డిజిటల్ ఓటర్ల జాబితాను విడుదల చేయాలన్న తన డిమాండ్‌కు ప్రజల మద్దతు కూడగట్టేందుకు ‘ఓట్ చోరీ’ పేరుతో నేడు ఒక వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. దేశంలో ఓట్ల దొంగతనం జరుగుతోందని, దానిని అడ్డుకోవడానికి ప్రతి ఒక్కరూ మద్దతివ్వాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ ప్రచారానికి సంబంధించి రాహుల్ గాంధీ ‘ఎక్స్’ వేదికగా ఒక వీడియోను పంచుకున్నారు. “వోట్ చోరీని బహిర్గతం చేయడం చాలా కీలకం” అని ఆయన పేర్కొన్నారు. “దేశంలో జరుగుతున్న ఓట్ల దొంగతనాన్ని ఆపేందుకు ప్రారంభించిన ఈ ప్రచారానికి మనస్ఫూర్తిగా మద్దతివ్వండి. ఇది ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం చేస్తున్న పోరాటం” అని ఆయన అన్నారు. స్వేచ్ఛాయుతమైన, నిష్పక్షపాతమైన ఎన్నికలకు స్వచ్ఛమైన ఓటర్ల జాబితా అత్యంత ఆవశ్యకమని ఆయన అభిప్రాయపడ్డారు.
ప్రజలు, పార్టీలు ఓటర్ల జాబితాను తనిఖీ చేసేందుకు వీలుగా ఈసీఐ పారదర్శకంగా వ్యవహరించి డిజిటల్ ఓటర్ల జాబితాను విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ ప్రచారానికి మద్దతుగా votechori.in వెబ్‌సైట్‌ను సందర్శించాలని లేదా 9650003420 నంబర్‌కు మిస్డ్ కాల్ ఇవ్వాలని ఆయన కోరారు.