Monday, August 18, 2025
E-PAPER
spot_img
Homeజాతీయంఏడ్రోజుల్లో రాహుల్‌ అఫిడవిట్‌ సమర్పించాలి

ఏడ్రోజుల్లో రాహుల్‌ అఫిడవిట్‌ సమర్పించాలి

- Advertisement -

లేకుంటే దేశానికి క్షమాపణలు చెప్పాలి
ఎన్నికల కమిషన్‌ ఎవరికీ భయపడదు : సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌
బీజేపీని కాదని నన్నే ఎందుకు అడుగుతున్నారు?: రాహుల్‌ గాంధీ
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో

ప్రతిపక్షనేత రాహుల్‌ గాంధీ ‘ఓట్‌ చోరీ’ ఆరోపణలపై ఏడ్రోజుల్లోగా అఫిడవిట్‌ సమర్పించాలని ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (సీఈసీ) జ్ఞానేశ్‌ కుమార్‌ తెలిపారు. లేదంటే క్షమాపణ చెప్పాలన్నారు. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తే ఆ ఆరోపణల్లో నిజం లేనట్టేనని వివరించారు. ఓటర్ల మోసం ఆరోపణలు నిరాధారమైనవనీ, రాజకీయ ప్రేరేపితమైనవని చెప్పారు. ”మీ ఆరోపణలపై అఫిడవిట్‌ సమర్పించాలి. లేదా దేశానికి క్షమాపణ చెప్పాలి. మూడో ఆప్షన్‌ లేదు. ఏడు రోజుల్లోగా అఫిడవిట్‌ మాకు అందకుంటే దాని అర్థం ఆ ఆరోపణల్లో నిజం లేనట్టే” అని జ్ఞానేశ్‌ కుమార్‌ అన్నారు. ఎన్నికల కమిషన్‌(ఈసీ) ఎవరికీ భయపడదని జ్ఞానేశ్‌ కుమార్‌ తెలిపారు. ఎన్నికల సమగ్రతకు కమిషన్‌ నిబద్ధతతో ఉందని చెప్పారు. ఈసీ రాజకీయ పార్టీలకు, ప్రచారాలకు, నిరాధారమైన ఆరోపణలకు భయపడదని అన్నారు. తమపై వచ్చిన ఆరోపణలు రాజకీయ ప్రేరేపితమై నవని చెప్పారు. తమపై అపవాదు వేస్తే సహించ బోమని తెలిపారు. ఎన్నికల కమిషన్‌ రాజ్యాంగానికి తలవంచుతుంది కానీ రాజకీయ ప్రతీకార చర్యలకు కాదని ఆయన స్పష్టం చేశారు. ఈసీ భుజంపై తుపాకీ పెట్టే రాజకీయాలు చోటు చేసుకున్నాయని చెప్పారు.

ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగాయంటూ ప్రతిపక్షాల నుంచి విమర్శలు వినిపి స్తున్న నేపథ్యంలో ఆదివారంనాడిక్కడ నేషనల్‌ మీడియా సెంటర్‌ (ఎన్‌ఎంసీ)లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎన్నికల కమిషనర్లు వివేక్‌ జోషి, సుఖ్బీర్‌ సింగ్‌ సంధు, సీనియర్‌ డిప్యూటీ ఎన్నికల కమిషన్‌ మనీశ్‌ గర్గ్‌, డిప్యూటీ ఎన్నికల కమిషనర్‌ సంజరు కుమార్‌, డైరెక్టర్‌ జనరల్‌ ఆశిష్‌ గోయల్‌, డిప్యూటీ డైరెక్టర్‌ జనరల్‌ విజరు కుమార్‌ పాండేలతో కలిసి జ్ఞానేశ్‌ కుమార్‌ మాట్లాడారు.

ఎన్నికల కమిషన్‌ ఎలాంటి వివక్షకు తావివ్వదనీ, తమకు అన్ని పార్టీలూ సమానమేనని సీఈసీ అన్నారు. ఈసీ తటస్థంగా ఉంటూ రాజ్యాంగ బాధ్యతలకు కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు. రాజ్యాంగం నిర్దేశించిన ప్రకారం ఎన్నికల కమిషన్‌ వద్ద రిజిస్ట్రేషన్‌ చేసుకున్న తర్వాతే ఏ పార్టీ అయినా పుడుతుందనీ, అలాం టప్పుడు రాజకీయ పార్టీలపై ఎన్నికల కమిషన్‌ ఎలా వివక్ష చూపిస్తుందని ఆయన ప్రశ్నించారు. ఈసీకి ఏ పార్టీ పట్ల విముఖత ఉండదని చెప్పారు. ఎవరు ఏ రాజకీయ పార్టీకి చెందినవారైనా రాజ్యాంగ బాధ్యతల నుంచి ఈసీ వెనక్కు మళ్లే ప్రసక్తే లేదన్నారు. 18 ఏండ్లు నిండిన ప్రతి పౌరుడూ ఓటు నమోదు చేసుకోవాలని రాజ్యాంగం నిర్దేశిస్తోందని సీఈసీ చెప్పారు. పార్టీల సిద్ధాంతాలు, అఫిలియేషన్‌తో తమకెలాంటి సంబం ధమూ ఉండదనీ, చట్టప్రకారం అందరినీ సమా నంగా చూస్తామని జ్ఞానేశ్‌ కుమార్‌ వివరించారు.

తప్పుడు ఆరోపణలకు భయపడం
బీహార్‌ ఎస్‌ఐఆర్‌పై జ్ఞానేశ్‌ కుమార్‌ మాట్లాడుతూ డబుల్‌ ఓటింగ్‌ ఆరోపణలను తోసిపుచ్చారు. ఆరోపణలు చేసేటప్పుడు ప్రూఫ్‌ ఉండాలనీ, అవి లేకుండా ఆరోపణలు చేయడం సరికాదని అన్నారు. ”కొందరు డబుల్‌ ఓటింగ్‌ అంటూ ఆరోపణలు చేస్తున్నారు. ప్రూఫ్‌ అడిగితే జవాబు ఇవ్వడం లేదు. ఇలాంటి తప్పుడు ఆరోపణలకు ఎన్నికల కమిషన్‌ కానీ, ఓటర్లు కానీ భయపడరు. దేశ ఓటర్లను లక్ష్యంగా పెట్టుకుని ఈసీ భుజంపై తుపాకీ పెట్టే రాజకీయాలు చోటుచే సుకుంటున్నాయి” అని ఆయన స్పష్టం చేశారు. రాజ్యాంగం ప్రకారం ఎంపీ, ఎమ్మెల్యే ఎన్నికల్లో దేశ పౌరులు మాత్రమే ఓటు వేసేందుకు అర్హులని చెప్పారు. స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియలో విదేశీయులు ఎవరైనా దరఖాస్తులు సమర్పిస్తే వారు తమ జాతీయతను తగిన డాక్యుమెంట్లతో సహా రుజువు చేసుకోవాలనీ, వెరిఫికేషన్‌ తర్వాత నాన్‌ సిటిజన్ల పేర్లు ఓటర్ల జాబితా నుంచి తొలగిస్తామని తెలిపారు. బీహార్‌ ఎస్‌ఐఆర్‌ను విజయవంతం చేసేందుకు ఈ ప్రక్రియలో భాగస్వాములైన ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉన్నారని ఆయన చెప్పారు. ఎన్ని ఆరోపణలు వచ్చినా తాము పని చేసుకుంటూ వెళ్తామనీ, ఈసీ పారదర్శకంగా వ్యవహరిస్తోందని అన్నారు. ఓటర్ల జాబితాపై 28,370 మంది అభ్యంతరాలు వ్యక్తం చేశారని తెలిపారు. ఓటరు జాబితాను బూత్‌ లెవల్‌ అధికారులు(బీఎల్‌ఓలు), పార్టీలు, ఏజెంట్లు కలిసి పరిశీలిస్తారన్నారు.

మరో 15 రోజులు మాత్రమే
బీహార్‌ ముసాయిదా ఎన్నికల జాబితాలో సవరణలకు మరో 15 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయని సీఈసీ తెలిపారు. అన్ని పార్టీలకూ సమానంగా ఈసీ తలుపులు తెరిచి ఉన్నాయని చెప్పారు. బీహార్‌ ఎస్‌ఐఆర్‌ కింద ముసాయిదా ఎన్నికల జాబితాపై ఏ రాజకీయ పార్టీకి ఎలాంటి అనుమానాలు ఉన్నా తమను సంప్రదించవచ్చని ఆయన తెలిపారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో సీసీటీవీ ఫుటేజ్‌ను షేర్‌ చేయకపోవడానికి ఓటర్ల ప్రయి వసీని కాపాడాలన్నదే కారణమని అన్నారు. మెషీన్‌-రీడబుల్‌ ఎలక్టోరల్‌ రోల్స్‌కు సంబంధించి సుప్రీంకోర్టు 2019లో చాలా స్పష్టంగా చెప్పిందనీ, ఇందువల్ల ఓటర్ల ప్రయివసీకి భంగం కలుగుతుందని అత్యున్నత న్యాయస్థానం పేర్కొందని గుర్తు చేశారు. గత కొద్ది రోజులుగా పలువురు ఓటర్ల ఫోటోలు వాడుకుంటూ వాటిని మీడియాకు ఫార్వర్డ్‌ చేస్తుండటం చూస్తున్నామనీ, అలాంటప్పుడు మన తల్లులు, ఆడకూతుళ్ల ఫోటోలతో కూడిన సీసీటీవీ ఫుటేజ్‌ను కమిషన్‌ షేర్‌ చేయాలా? అని ఆయన ప్రశ్నించారు.

ఇతర రాష్ట్రాల్లో ఎస్‌ఐఆర్‌పై..
పశ్చిమబెంగాల్‌, ఇతర రాష్ట్రాల్లో ఎస్‌ఐఆర్‌ ఎప్పుడు నిర్వహించాలనేది ఈసీ నిర్ణయిస్తుందనీ, తగిన సమయంలో నిర్ణయాన్ని ప్రకటిస్తామని ఆయన తెలిపారు. ఎన్నికల ముందు ఎన్నికల జాబితాను సవరించడం ఈసీ పని అని ఒక ప్రశ్నకు జ్ఞానేశ్‌ కుమార్‌ బదులిచ్చారు.

నన్నే అడుగుతున్నారెందుకు?: రాహుల్‌ గాంధీ
రాహుల్‌ గాంధీ బీహార్‌లో ప్రారంభించిన ‘ఓటర్‌ అధికార్‌ యాత్ర’లో ఈసీపై విమర్శలు గుప్పించారు. తనను మాత్రమే ఈసీ అఫిడవిట్‌ సమర్పించాలని డిమాండ్‌ చేస్తోందని, బీజేపీ నేతలు కొద్దిరోజుల క్రితం ప్రెస్‌మీట్‌ పెట్టినప్పుడు వాళ్లను అఫిడవిట్‌ ఎందుకు అడగలేదని ఆయన ప్రశ్నించారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad