నవతెలంగాణ-హైదరాబాద్ : ఢిల్లీ పాలకులు దిగివచ్చేలా రైల్ రోకో నిర్వహిస్తామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తేల్చిచెప్పారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం చేపట్టిన ఈ ఉద్యమంలో పౌర సమాజం కలిసి రావాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ జాగృతి, యూపీఎఫ్ ఆధ్వర్యంలో ఈనెల 17న తలపెట్టిన రైల్ రోకోకు భీం ఆర్మీ నాయకులు సంఘీభావం ప్రకటించారు. భీం ఆర్మీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సయ్యద్ అలీ ఆయాజ్ ఆధ్వర్యంలో నాయకులు బంజారాహిల్స్ లోని నివాసంలో ఎమ్మెల్సీ కవితతో సమావేశమయ్యారు. రైల్ రోకోకు భీం ఆర్మీ చీఫ్, ఎంపీ చంద్రశేఖర్ ఆజాద్ మద్దతు ప్రకటించారని తెలిపారు. రైల్ రోకోలో తమ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొంటారని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ, స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రాజకీయ రిజర్వేషన్లు సాధించడంతో పాటు విద్య, ఉద్యోగాల్లోనూ 42 శాతం రిజర్వేషన్లు సాధించుకోవాలంటే కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెట్టడం ఒక్కటే మార్గమన్నారు. రిజర్వేషన్ల పెంపు బిల్లులను రాష్ట్ర శాసనసభ, శాసన మండలి ఆమోదించి కేంద్ర ప్రభుత్వ ఆమోదం కోసం పెంపినా నెలల తరబడి పెండింగ్ లో పెట్టారని తెలిపారు. బీసీ రిజర్వేషన్లు ఇవ్వకుండానే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే ప్రయత్నాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఉందన్నారు. రిజర్వేషన్లు కల్పించకుంటే కాంగ్రెస్ పార్టీకి తగిన రీతిలో బుద్ధి చెప్తామన్నారు. కార్యక్రమంలో భీం ఆర్మీ రాష్ట్ర కార్యదర్శి సత్యనారాయణ, హన్మంతరావు, సురేశ్ కుమార్, యూపీఎఫ్ కో ఆర్డినేటర్ ఆలకుంట హరి తదితరులు పాల్గొన్నారు.
రేషన్ కార్డుల రద్దు చేసేందుకు కాంగ్రెస్ సర్కారు కుట్ర
రాష్ట్రంలో రేషన్ కార్డులను రద్దు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు చేస్తోందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ‘ఎక్స్’ వేదికగా ఆందోళన వ్యక్తం చేశారు. వర్షాకాలం నేపథ్యంలో ప్రభుత్వం జూన్ లో ఒకేసారి మూడు నెలల రేషన్ పంపిణీ చేసిందన్నారు. జూన్ లో పంపిణీ చేసిన రేషన్ ను అనివార్య కారణాలతో 7.24 లక్షల కుటుంబాలు తీసుకోలేదని తెలిపారు. రేషన్ తీసుకోకపోవడాన్ని సాకుగా చూపుతూ ఏడు లక్షలకు పైగా కుటుంబాల రేషన్ కార్డులను తొలగించే ప్రయత్నాల్లో ప్రభుత్వం ఉందన్నారు. రాష్ట్రంలో అర్హులైన వారందరికీ కార్డులు ఇస్తామని, అవసరమైతే 30 లక్షల నుంచి 40 లక్షల కార్డులు ఇస్తామని ప్రకటనలు చేయడం తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు కొత్తగా ఒక్క కార్డు కూడా ఇవ్వలేదన్నారు. రేషన్ తీసుకోలేదనే కారణంతో రేషన్ కార్డులను తొలగించే ప్రయత్నాలు మానుకోవాలన్నారు. వారికి మరోసారి రేషన్ బియ్యం పంపిణీకి చర్యలు తీసుకోవాలన్నారు. రేషన్ కార్డులు తొలగించే ప్రయత్నాలు చేస్తే ప్రజా ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు.