– నాలుగు రోజులకు ఆరెంజ్, ఎల్లో హెచ్చరికలు
– రేపు బంగాళాఖాతంలో అల్పపీడనం!
– చురుగ్గా కొనసాగుతున్న నైరుతి రుతుపవనాలు
– సోమవారం రాత్రి పది గంటల వరకు 407 ప్రాంతాల్లో వర్షం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో వచ్చే నాలుగు రోజుల పాటు పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, ఎక్కువ ప్రాంతాల్లో మోస్తరు వానలు పడే సూచనలు బలంగా ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రధాన అధికారి డాక్టర్ కె.నాగరత్న హెచ్చరించారు. ఈ మేరకు పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో హెచ్చరికలు జారీ చేశారు. బుధవారం నాడు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని తెలిపారు. నైరుతి రుతుపవనాలు చురుగ్గా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. 12న ఎక్కువ ప్రాంతాల్లో మోస్తరు వానలు, 13 జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. ఈ మేరకు ఎల్లో హెచ్చరిక జారీ చేశారు.13న భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, జయశంకర్‌భూపాలపల్లి, కొమ్రంభీమ్ అసిఫాబాద్, మహబూబాబాబాద్, మంచిర్యాల, ములుగు, పెద్దపల్లి, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో అక్కడక్కడా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశాలు బలంగా ఉన్నాయని తెలిపారు. ఈ మేరకు ఆ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరిక జారీ చేశారు.
మిగతా అన్ని జిల్లాల్లోనూ పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే సూచనలుండటంతో ఎల్లో హెచ్చరిక విడుదల చేశారు. 14వ తేదీకి సంబంధించి 24 జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేశారు. జయశంకర్ భూపాలపల్లి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, ఆదిలాబాద్, హైదరాబాద్, జగిత్యాల, కామారెడ్డి, కొమ్రంభీమ్ అసిఫాబాద్, మహబూబాబాద్, మహబూబ్‌నగర్, మంచిర్యాల, మేడ్చల్ మల్కాజిగిరి, ములుగు, నల్లగొండ, నారాయణపేట, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, రంగారెడ్డి, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలున్నాయని తెలిపారు. ఆ జిల్లాల్లో 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయనీ, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతాయని హెచ్చరించారు. సోమవారం ఉదయం 8:30 గంటల నుంచి రాత్రి పది గంటల వరకు రాష్ట్రంలో 407 ప్రాంతాల్లో వర్షపాతం నమోదైందని తెలంగాణ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ ప్రకటించింది. నల్లగొండ జిల్లా గుడిపల్లి మండలం కోదండపురంలో అత్యధికంగా 7 సెంటీమీటర్ల వర్షం కురిసింది. నల్లగొండ, సంగారెడ్డి, రంగారెడ్డి, వికారాబాద్, యాదాద్రి భువనగిరి, జనగాం జిల్లాల్లో పలు చోట్ల భారీ వర్షం పడింది.
రాష్ట్రానికి వర్షసూచన
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES