జనజీవనం అస్తవ్యస్తం
పత్తి, వరి పంటలకు తీవ్ర నష్టం
బోరుమంటున్న అన్నదాతలు
రాష్ట్రాన్ని వణికించిన ‘మొంథా’ తుపాన్
తెగిన చెరువులు, జలమయమైన రోడ్లు
నిలిచిన రైళ్లు-ప్రయాణికుల గగ్గోలు
నీట మునిగిన వరంగల్ రైల్వే స్టేషన్
పలు జిల్లాల్లో రెడ్ అలర్ట్, నేడు స్కూళ్లకు సెలవు
మొంథా తుపాన్ తెలుగు రాష్ట్రాలను వణికించింది. జనజీవనాన్ని స్తంభింపచేసింది. భారీ వర్షాలతో వాగులు వంకలు పొంగిపొర్లాయి. పంటలు నీట మునిగాయి. పత్తిరైతులు బోరుమన్నారు. వరి పంట నీటమునిగి నేలకొరిగింది. కాంటా కోసం కొనుగోలు కేంద్రాలకు తెచ్చిన ధాన్యం నీటిపాలైంది. రైతులు నీటిలో కొట్టుకుపోతున్న ధాన్యాన్ని కాపాడుకొనేందుకు శాయశక్తులా ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. టార్పాలిన్ల కొరత స్పష్టంగా కనిపించింది. అన్నదాత ఆక్రందనలు గుండెల్ని పిండేశాయి. పలుచోట్ల భారీ వర్షాలతో రైల్వే ట్రాక్‌ల మీదినుంచి వరద నీళ్లు ప్రవహించడంతో పలు రైళ్లు రద్దయ్యాయి. మరికొన్ని ఆలస్యంగా నడిచాయి. వరంగల్ రైల్వే స్టేషన్ నీట మునిగింది. కొన్ని చోట్ల రహదారులు కొట్టుకుపోయాయి. వాతావరణ శాఖ తెలంగాణలో ఎనిమిది జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఆ అంచనాలను మించి రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిశాయి.
రాజధాని హైదరాబాద్‌లో రోడ్లు చెరువుల్ని తలపించాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వందల వాహనాలు ట్రాఫిక్ పద్మవ్యూహంలో చిక్కుకున్నాయి. రాయదుర్గంలో అరకిలోమీటరు దూరం దాటడానికి నాలుగు గంటలకు పైగా సమయం పట్టిందంటే ట్రాఫిక్ తీవ్రత తెలుస్తోంది. ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్లగొండ, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదైంది. వరుణడి దెబ్బకు ప్రభుత్వం పలు జిల్లాల్లో విద్యాసంస్థలకు గురువారం సెలవు ప్రకటించింది. పాలేరు రిజర్వాయర్ అన్ని గేట్లూ ఎత్తేశారు. నిమ్మవాగు వంతెనపై వరదలో డీసీఎం కొట్టుకుపోయింది. డ్రైవర్ గల్లంతయ్యాడు. నల్లగొండ జిల్లా దేవరకొండ మండలం కొమ్మేపల్లిలో గిరిజన బాలుర గురుకుల పాఠశాల జలదిగ్బంధంలో చిక్కుకుంది. హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్ గేట్లు ఎత్తడంతో మూసీకి వరద పోటెత్తింది.
నవతెలంగాణ- విలేకరులు
మొంథా తుఫాను తీరం దాటింది. వెళ్తూ వెళ్తూ రాష్ట్రంలో భీభత్సాన్ని సృష్టించింది. భారీ వర్షాలతో ప్రజలు అనేక అవస్థలు పడ్డారు. రైతులు పంటలు నష్టపోయి బోరుమంటున్నారు. రోడ్లు కొట్టుకుపోయి ప్రజా రవాణాకు ఆటంకం ఏర్పడింది. హైదరాబాద్ వాతావరణ కేంద్రం రాష్ట్రంలో 8 జిల్ల్లాల్లో రెడ్ అలెర్ట్ ప్రకటించింది. కానీ రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయి.
ఉమ్మడి ఖమ్మం..
ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా బుధవారం తెల్లవారుజాము నుంచి మధ్యాహ్నం వరకూ ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. ఖమ్మం నగరంలోని రాపర్తినగర్ ప్రాంతంలో వర్షపు నీరు రోడ్డుపై చేరింది. రఘునాథపాలెం మండలం పాపటపల్లి నుండి వీఆర్ బంజార మార్గంలోని బుగ్గవాగు వరద నీరు ప్రవహిస్తుండటంలో వాహనాల రాకపోకలు నిలిపివేశారు. చింతకాని మండలం నాగులవంచ – పాతర్లపాడు మార్గంలో వరద నీరు చేరడంతో రాకపోకలు నిలిపివేశారు. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో విద్యాసంస్థలకు గురువారం సెలవు ప్రకటించారు.
కూసుమంచి మండలం పాలేరు రిజర్వాయర్ అన్ని గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. వైరా రిజర్వాయర్ పూర్తి స్థాయి నీటి మట్టం 18.3 అడుగులు కాగా.. 19.5 అడుగులకు చేరింది. ఖమ్మం వద్ద మున్నేరు వాగు 22 అడుగులకు చేరింది. ఏన్కూరు నుంచి పల్లిపాడు వైపు వెళ్లేందుకు ఓ డీసీఎం వ్యాన్ వంతెనపై వస్తుండగా వరద ఉధృతికి వాగులోకి కొట్టుకుపోయింది. డ్రైవర్ గల్లంతయ్యాడు. డ్రైవర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. మోతే నగర్, బొక్కల గడ్డ, ప్రాంతాల్లోని వరద బాధితులను పునరావాస కేంద్రాలకు ఖమ్మం మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య సురక్షితంగా తరలించారు.
వరంగల్, హన్మకొండ, జనగామకు రెడ్ అలర్ట్
‘మొంథా’ తుపాను ఉమ్మడి వరంగల్ జిల్లాపై తీవ్ర ప్రభావం చూపింది. రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వాతావరణ శాఖ మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో రెడ్ అలెర్ట్ ప్రకటించింది. జనగామ, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. మహబూబాబాద్ జిల్లాలో డోర్నకల్ జంక్షన్‌లో పట్టాలపైకి వరద నీరు చేరడంతో గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌ను ఉదయం నిలిపివేశారు. మమబూబాబాద్ రైల్వే స్టేషన్‌లో కృష్ణా ఎక్స్‌ప్రెస్, తాడ్లపూసపల్లిలో కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌లు నిలిచిపోయాయి.
పలువురు ప్రయాణీకులను డోర్నకల్ నుంచి బస్సుల్లో వరంగల్, ఖమ్మంకు తరలించారు. డోర్నకల్, మహబూబాబాద్ రైల్వే స్టేషన్‌లలో పట్టాలపైకి చేరిన వరద నీటిని జేసీబీల సహాయంతో ఆకేరు వాగుకు మళ్లించారు. దీంతో డోర్నకల్‌లో నిలిచిపోయిన గోల్కొండ ఎక్స్‌ప్రెస్, మహబూ బాబాద్ గుండ్రాతిమడుగులో కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌లను మధ్యాహ్నం తరువాత పునరుద్ధరించారు. వరంగల్ రైల్వే స్టేషన్‌ను వరద ముంచెత్తింది. వరంగల్, హన్మకొండ, కాజీపేట నగరాల్లో భారీ వరదతో నగరవాసులు సతమతమవుతున్నారు. హన్మకొండ బస్టాండ్ వరద నీటిలో మునిగింది.
వరంగల్‌లో మంత్రి సురేఖ సమీక్ష
తుపాన్ నేపథ్యంలో వరంగల్‌లో కురుస్తున్న భారీ వర్షాలతో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దేవాదాయ, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ బల్దియా అధికారులతో ఆర్ అండ్ బి గెస్ట్ హౌజ్‌లో సమీక్షా సమావేశం నిర్వహించారు. తుపాను నేపథ్యంలో ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని సూచించారు. ముంపు ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేసి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లా..
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ముసురుతో కూడిన వర్షం పడుతుండటంతో జనం ఇండ్లు వదిలి బయటకెళ్లే పరిస్థితి లేకుండా పోయింది. వరంగల్ జిల్లాలో అతిభారీ వర్షాలు కురుస్తుండగా.. దాన్ని ఆనుకుని ఉన్న కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో బుధవారం సాయంత్రం 7గంటలవరకు 21.15సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. శ్రీపాద ఎల్లంపల్లి, మధ్యమానేరు, లోయర్‌మానేరు జలాశయాల గేట్ల అధికారులు ఎత్తి దిగువకు నీరు వదులుతున్నారు. ఎగువనున్న ఎస్సారెస్పీ డ్యామ్‌లోకి పెద్దఎత్తున వరద నీరు వచ్చి చేరుతుండటంతో ప్రాజెక్టు 20గేట్లు ఎత్తి గోదావరిలోకి వదులుతున్నారు. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు 62గేట్లకుగాను 13 గేట్లు ఎత్తి లక్షా 5వేల క్యూసెక్కుల వరదను దిగువకు వదులుతున్నారు. మధ్యమానేరు జలాశయం 5గేట్లు ఎత్తి దిగువకు 10వేల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు.
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా
మహబూబ్‌నగర్ జిల్లాలో పలు చోట్ల వాగులు, చెరువులు, కుంటలు అలుగుపారాయి. తాడూరు మండల పరిధిలో భారీ వర్షానికి గొర్రెలు మృత్యు వాతపడ్డాయి. మండల కేంద్రంలో వర్షం నీరు ఇండ్లలోకి వచ్చింది. నాగర్‌కర్నూల్ జిల్లా ఉప్పు నుంతల మండలంలో గేదెలు, దూడలు నీటిలో కొట్టుకుపోయి చనిపోయాయి. లతిపూర్ సమీపంలో డిండి జలాశయం మత్తడి పోస్తుండటంతో జాతీయ రహదారి కోతకు గురైంది. దాంతో బుధవారం సాయంత్రం నుంచి అధికారులు రాకపోకలను నిలిపేశారు. శ్రీశైలం నుంచి హైదరాబాద్ వెళ్లాల్సిన వాహనాలను అచ్చంపేట మండలంలోని హాజీపూర్ నుంచి వంగూరు మండలం చింతపల్లి కొండారెడ్డిపల్లి మీదుగా మళ్లించారు. జాతీయ రహదారిని ఎస్పీ పరిశీలించారు. నల్లమల్లలో కొండచరియలు విరిగిపడ్డాయి.
నేలవాలిన కోతకొచ్చిన వరి, తడిసిన ధాన్యం కుప్పలు
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కోతకొచ్చిన వరి పైరు ఈదురుగాలులకు నేలవాలింది. ధాన్యం ఆరబోసిన కేంద్రాల్లో తడిసిపోయింది. జూలపల్లి, సైదాపూర్, చందుర్తి మండల కేంద్రాల్లో సుమారు 100క్వింటాళ్ల వరకు ధాన్యం కుప్పలు తడిసి ముద్దయ్యాయి. కోనరావుపేట మండల కేంద్రంలోని కొనుగోలు కేంద్రంలోకి వరదనీరు చేరడంతో వరిధాన్యం కుప్పలు తడిసిముద్దయ్యాయి. జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణంలోని మార్కెట్‌యార్డ్‌లో మొక్కజొన్న కుప్పలు తడిసి ముద్దయ్యాయి. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన, కుప్పలుగా ఉన్న ధాన్యం కుప్పలు తడిసిపోయాయి. హుజూరాబాద్ పట్టణంలోని ఎస్సీకాలనీ, బుడగజంగాల కాలనీ, విద్యానగర్, కాకతీయ కాలనీ ఇండ్లలోకి మోకాలిలోతు వర్షం నీరు చేరింది.
నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో మంగళవారం రాత్రి నుంచి బుధవారం వరకు కురిసిన వర్షం రైతులకు భారీ నష్టాన్ని చేకూర్చింది. కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చిన ధాన్యం తడిసి ముద్దయింది. నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలంలోని సుద్దపల్లి, మెంట్రాజ్‌పల్లి, ఇందల్‌వాయి సహకార సొసైటీ పరిధిలోని ఆయా గ్రామాల్లో ధాన్యం పూర్తిగా తడిసి ముద్దయింది. ఇందల్‌వాయి సహకార సొసైటీ పరిధిలోని గిరిజన తండాల్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో వర్షంతో వడ్లు తడిసి కొట్టుకుపోయినట్టు గిరిజనులు వాపోయారు. ఎడపల్లి మండలంలో రోడ్లపై ఆరబెట్టిన ధాన్యం తడిసిపోయింది. లింగంపేట్ మండలంలో కల్లాల్లోని ధాన్యం తడిసింది. నల్లగొండ జిల్లా పెద్దవూర మండలంలో వరి, పత్తి పైర్లు నేలకొరిగాయి.
మూసీ 8 గేట్ల ద్వారా నీటి విడుదల
మూసీ ప్రాజెక్టుకు పై నుంచి వరద పెరగడంతో నీటిపారుదల శాఖ అధికారులు ఎనిమిది క్రస్ట్ గేట్లను ఎత్తి దిగువకు 20,980 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 645 అడుగులు కాగా, ప్రస్తుతం 644.01 ఆడుగుల వద్ద స్థిరంగా ఉంది. ప్రాజెక్టు నీటి నిలువ సామర్థ్యం 4.46 టీఎంసీలు కాగా ప్రస్తుతం 4.20 టీఎంసీల
నీరు నిల్వ ఉంది.
ఉమ్మడి నల్లగొండ జిల్లా..
సూర్యాపేట జిల్లాలోని మద్దిరాల మండలంలో భారీ గాలులకు చెట్టుకూలి వ్యక్తి మృతిచెందాడు. పాలకీడు మండలంలో రహదారిపై చెట్లు పడిపోయాయి. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లిలో భారీ వర్షాల కారణంగా జూలూరు- రుద్రవెల్లిలో లెవల్ బ్రిడ్జి వద్ద మూసీనది ఉధృతంగా ప్రవహిస్తోంది. పోచంపల్లి-బీబీనగర్ మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. నల్లగొండ జిల్లా పెద్దవూర మండలం పులిచర్ల గ్రామంలో విద్యుత్ సబ్‌స్టేషన్‌లో వరద నీరు చేరింది. దీంతో రాత్రి నుంచి విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. తిరుమలగిరిసాగర్ మండలంలో బర్లబంధం ప్రవాహంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
తాటికోల్ వాగు బ్రిడ్జి పైనుంచి పొంగిపోవడంతో దేవరకొండ తాటికోల్ గ్రామానికి రాకపోకలు బంద్ అయ్యాయి. చందంపేట మండలం ఛత్రియాల గ్రామంలో భారీ వర్షాల వల్ల తుమ్మల పాపయ్యకు చెందిన 30 గొర్రెలు మృత్యువాతపడ్డాయి. దేవరకొండ మండలం కొమ్మేపల్లిలో గిరిజన బాలుర గురుకుల పాఠశాల జలదిగ్బంధంలో చిక్కుకుంది. విషయం తెలిసిన వెంటనే జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ శరత్ చంద్రపవార్ పాఠశాలకు వచ్చి విద్యార్థులను తాడు సహాయంతో పాఠశాల భవనం నుంచి రోడ్డు వరకు తీసుకొచ్చారు. వారిని కొండ భీమనపల్లి సమీపంలో బీసీ గురుకుల పాఠశాల, పక్కనే ఉన్న సోగ్ర బిఈడి కళాశాలకు తరలించారు.
సింగూరుకు వరద ప్రవాహం
ఉమ్మడి మెదక్ జిల్లాలో రెండ్రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కాలనీలను వరద ముంచెత్తడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. సంగారెడ్డి జిల్లాలోని సింగూరు ప్రాజెక్టుకు వరద ఉధృతి రోజు రోజుకూ పెరుగుతున్నది. ఒక గేట్‌ను ఎత్తి 12082 క్యూసెక్కుల నీటిని దిగవకు విడుదల చేస్తున్నారు. సింగూరు నుంచి నీటిని కిందకు వదలడంతో మంజీర బ్యారేజీ నుంచి ఎప్పటికప్పుడు దిగువకు విడుదల చేస్తున్నారు. సింగూరు నుంచి పాపన్నపేట మండలంలోని ఘనపూర్‌కు నీళ్లు వస్తుండటంతో మెదక్ జిల్లాలోని ఏడుపాయల దుర్గభవాని ఆలయం జలదిగ్బంధంలో చిక్కుకుంది.



