డ్యాం కూలి ముగ్గురు, కొండచరియలు విరిగి ఆరుగురు మృతి
ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలి : రాహుల్ గాంధీ డిమాండ్
మండి : ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఆకస్మిక వరదల కారణంగా పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. హిమాచల్‌ప్రదేశ్‌లో అకస్మాత్తుగా కొండచరియలు విరిగిపడి ఆరుగురు మృతి చెందారు. ఛత్తీస్‌గఢ్‌లోనూ ఆకస్మిక వరదలు కారణంగా నలుగురు మరణించారు. ముగ్గురు గల్లంతయ్యారు. ఇక జమ్మూకాశ్మీర్‌లోనూ భారీ వర్షాల కారణంగా నదులు పొంగిపొర్లుతున్నాయి. నీటి మట్టాలు పెరగడం వల్ల అనేక ఇండ్లు నీట మునిగా యి. ఢిల్లీలోని యమునా నది ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తుండటంతో సమీపంలోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మరోవైపు వరద బాధిత రాష్ట్రాలకు ప్రత్యేక సహాయ ప్యాకేజీని ప్రకటించాలని లోక్‌సభ విపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
హిమాచల్‌లో విరిగిపడిన కొండచరియలు
కుండపోత వర్షాల కారణంగా మండి జిల్లా సుందర్‌నగర్ పట్టణంలో మంగళవారం సాయంత్రం కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో రెండిండ్లు పూర్తిగా నేలమట్టమయ్యాయి. ఈ ఘటనలో ఇప్పటివరకు ఆరుగురు మృతి చెందారు. ఈ విషయం గురించి సమాచారం అందుకున్న భారత్ సైన్యం, ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్ సహాయక చర్యలు చేపట్టాయి. శిథిలాల కింద చిక్కుకున్న ఒక మహిళ, ఓ బాలికను రక్షించి ఆస్పత్రికి తరలించాయి. అయితే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారు చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మరణించారు. శిథిలాల కిందే ఇంకా కొంతమంది ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సమీపంలోని 15 ఇండ్లను ఖాళీ చేయించినట్టు పోలీసులు తెలిపారు.
ఛత్తీస్‌గఢ్‌లో నలుగురు మృతి
మరోవైపు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బలరాంపూర్‌లో మంగళవారం రాత్రి ఆనకట్ట కూలిపోవడంతో ఆకస్మిక వరదలు సంభవించాయి. దీంతో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ముగ్గురు గల్లంతయ్యారు. 1980లో నిర్మించిన ఈ ఆనకట్ట కూలడంతో వరద నీరు సమీపంలోని ఇండ్లు, పంటల పొలాల్లోకి ప్రవేశిం చాయి. మిగిలిన వారి కోసం రెస్క్యూ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు.
ఉప్పొంగుతున్న నదులు
జమ్మూకాశ్మీర్‌లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. నదుల నీటి మట్టం కూడా గణనీయంగా పెరిగింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు పలు జిల్లాలను వరదలు ముంచెత్తాయి. ఈ వర్షాలు కారణంగా కొండ చరియలు, క్లౌడ్ బరస్ట్ సంభవించే ఆవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఇంటిలో నుంచి ఎవరు బయటకు రావొద్దని సూచించారు.
ప్రభావిత ప్రాంతాల్లో పాఠశాలకు సెలవు ప్రకటించారు. ప్రస్తుతం పరిస్థితులపై సమీక్షించేందుకు సీఎం ఒమర్ అబ్దుల్లా అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. తక్షణ సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు. అధికారుల సలహాలను పాటిస్తూ సురక్షితంగా ఉండాలని ప్రజలకు సూచించారు.
ఉత్తరాదిన వర్ష బీభత్సం
- Advertisement -
- Advertisement -