– పాఠశాల ప్రాంగణంలో నిలిచిన వర్షపు నీరు
– ఇక్కట్లకు గురౌతున్న విద్యార్ధులు
నవతెలంగాణ – అశ్వారావుపేట : ప్రభుత్వ పాఠశాలల్లో పారిశుధ్యం మెరుగు పరచాలని,పరిసరాలు శుభ్రంగా ఉంచాలని ఉన్నతాధికారులు నెత్తి నోరు బాదుకున్నా క్షేత్రస్థాయిలో మాత్రం అవి కనిపించడం లేదు. నియోజక వర్గం కేంద్రం అయిన అశ్వారావుపేట లోని ఏకైక జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో గత రెండు రోజులు ఎడతెరిపిలేని వానలకు ప్రాంగణం మొత్తం నీటితో నిండిపోయింది. సోమవారం ఆ పాఠశాలను నవతెలంగాణ సందర్శించిన సమయంలో ఈ దృశ్యాలు కనిపించాయి.విద్యార్ధినులు,ఉపాద్యాయులు కనీసం నడవడానికి సైతం భయపడుతున్నారు.
ఈ పాఠశాల పై భాగంలో ఉన్న బాలురు ఉన్నత పాఠశాల,మైనార్టీ బాలికల గురుకుల పాఠశాలలు ప్రాంగణాలు ఎత్తుగా ఉండటంతో లోతట్టు లో ఉన్న బాలికల పాఠశాల ప్రాంగణంలో నీరు నిలిచి చెరువును తలపిస్తుంది.ఈ పాఠశాల చుట్టూ ప్రహరీ ఉండటం వర్షపు నీరు వెళ్ళే మార్గం సరిగా లేకపోవడం కూడా మరో కారణం. ఈ పాఠశాల ప్రాంగణం లో నీరు నిలవకుండా మట్టి తో నింపితే పరిష్కారం అవుతుందని ప్రధానోపాధ్యాయుడు నల్లపు కొండలరావు తెలిపారు.