Saturday, October 11, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంరాజస్థాన్‌ టూ చెన్నై వయా హైదరాబాద్‌ డ్రగ్స్‌ సప్లయ్

రాజస్థాన్‌ టూ చెన్నై వయా హైదరాబాద్‌ డ్రగ్స్‌ సప్లయ్

- Advertisement -

ప్రత్యేక నిఘావేసి నిందితుడిని అరెస్టు చేసిన ఎస్‌వోటీ, కీసర పోలీసులు
నిందితుడి నుంచి కోటి విలువగల ఓపియం, పాపిస్ట్రా స్వాధీనం
403 మంది డ్రగ్‌ పెడ్లర్లు, సరఫరాదారులు, విక్రయదారులను అరెస్టు చేశాం : రాచకొండ సీపీ జి. సుధీర్‌బాబు

నవతెలంగాణ-సిటీబ్యూరో
గుట్టుచప్పుడు కాకుండా రాజస్థాన్‌ టూ చెన్నైకు హైదరాబాద్‌ మీదుగా డ్రగ్స్‌ సప్లయ్ చేస్తున్న ఇద్దరు నిందితుల్లో ఒకరిని మల్కాజ్‌గిరి ఎస్‌వోటీ బృందంతోపాటు కీసర పోలీసులు అరెస్టు చేశారు. నిందితుని నుంచి కోటి రూపాయలు విలువ చేసే 7 కేజీల ఓపీయం, 2 కేజీల పాపిస్ట్రా స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం ఎల్బీనగర్‌లోని సీపీ క్యాంప్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్‌వోటీ డీసీపీ ఏ.రమణారెడ్డితో కలిసి రాచకొండ సీపీ జీ. సుధీర్‌బాబు వివరాలను వెల్లడించారు. రాష్ట్రాన్ని డ్రగ్‌ ఫ్రీ తెలంగాణగా చేయాలని ప్రభుత్వం పోలీస్‌ శాఖకు సూచించిందని, అందులో భాగంగా మాదక ద్రవ్యాల సరఫరా, వినియోగం, విక్రయాలపై ప్రత్యేక నిఘా వేశామన్నారు.

ఇప్పటివరకు రాచకొండ కమిషనరేట్‌లో 403 మంది డ్రగ్‌ పెడ్లర్లు, సరఫరాదారులు, విక్రయదారులను అరెస్టు చేశామని తెలిపారు. అందులో 148 మంది ఇతర రాష్ట్రాలకు చెందిన వారున్నారని వివరించారు. ఇతర రాష్ట్రాల్లో ఉండి డ్రగ్‌ ముఠాలను నడిపించే కొంత మంది నేరస్తులను పట్టుకునేందుకు ఇక్కడి నుంచి ప్రత్యేక బృందాలను పంపించి అరెస్టు చేశామని అన్నారు. ఈ క్రమంలో రాజస్థాన్‌కు చెందిన ఇద్దరి ముఠా నడిపిస్తున్న డ్రగ్‌ రాకెట్‌ వెలుగు చూసిందని తెలిపారు. రాజస్థాన్‌కు చెందిన లోకేష్‌ భరత్‌.. హౌటేల్‌ మేనేజ్‌మెంట్‌ చేశాడు. ఆ తర్వాత టెక్స్‌టైల్స్‌తోపాటు పిజ్జాహట్‌ వివిధ ప్రాంతాల్లో పనిచేశాడు. కొన్నాళ్లపాటు ఉదయ్ పూర్‌ లోని గోల్డెన్‌ హౌటల్‌లో మేనేజర్‌గానూ పని చేశాడు. అతను పని చేసే హౌటల్‌ మూసివేయడంతో ఉద్యోగం పోయింది.

ఈ క్రమంలో సులువుగా డబ్బులు సంపాదించాలని నిర్ణయించుకున్నాడు. రాజస్థాన్‌కు చెందిన డ్రగ్స్‌ సప్లయర్‌ జగదీష్‌ గుజ్జర్‌తో చేతులు కలిపాడు. ఇద్దరూ కలిసి రాజస్థాన్‌ నుంచి చెన్నైకు డ్రగ్స్‌ సప్లయ్ చేయడం ప్రారంభించారు. హైదరాబాద్‌ మీదుగా సప్లయ్ చేస్తున్న నిందితుల్లో ఒకడైన లోకేష్‌ భరత్‌ ఆగస్టులో 2 కేజీల ఓపియం కాచిగూడ రైల్వే స్టేషన్‌ దగ్గర విక్రయించాడు. తిరిగి 7 కేజీల ఓపియం, పాపిస్ట్రా తీసుకుని హైదరాబాద్‌కు వచ్చినట్టు సమాచారం అందుకున్న మల్కాజిగిరి ఎస్‌వోటీ బృందం, కీసర పోలీసులతో కలిసి ప్రత్యేక నిఘా వేశారు. నగరశివారులోని కుందన్‌పల్లి ఓఆర్‌ఆర్‌ వద్ద నిందితుడిని అరెస్టు చేశారు. పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం గాలిస్తున్నామని సీపీ తెలిపారు.

రాచకొండ కమిషనరేట్‌ పరిధిలో డ్రగ్స్‌ నివారణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని, డ్రగ్స్‌ వాడటంతో మానసికంగా, భౌతికంగా తీవ్రంగా నష్టపోతారని, నాడీ వ్యవస్థ పూర్తిగా దెబ్బతింటుందని సీపీ తెలిపారు. డబ్బులిచ్చి జీవితాన్ని పాడుచేసుకుంటున్నారని, తమ పిల్లలపై తల్లిదండ్రులు దృష్టి సారించాలన్నారు. మాదక ద్రవ్యాలు విక్రయించినా, వినియోగించినా, సేవించినా దాదాపు 10ఏండ్ల జైలు శిక్షలు పడుతుందని తెలిపారు. ఈ సమావేశంలో అదనపు డీసీపీ నంద్యాల్‌ నర్సింహారెడ్డి, ఏసీపీ సీ.అంజయ్య, ఇన్‌స్పెక్టర్లు జీ.జానయ్య, ఏం.సాయికుమార్‌, కీసర ఇన్‌స్పెక్టర్‌ అంజనేయులుతోపాటు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -