చిన్నప్పుడు చరిత్ర పాఠాల్లో అలెగ్జాండర్ – పురుషోత్తమ్ (పోరస్)ల యుద్ధం గురించి చదివాం. ఆ యుద్ధం జీలం- చీనాబ్ నదుల మధ్య జరిగిందని తెలుసుకున్నాం. అంతవరకే -ఆయుద్ధానికి సంబంధించిన నేపథ్యం ఏమిటన్నది మనకు ఎవరూ చెప్పలేదు. గొప్ప హదయ సంస్కారానికి, మానవీయ విలువలకు, నైతికతకు ప్రాధాన్యమున్న ఆ సంఘటనలు చరిత్రలో నమోదయ్యే ఉన్నాయి. తాము రాసిన గ్రంథాల్లో చరిత్రకారులు నమోదు చేశారు. కానీ, ఆ వివరాలు సామాన్యులకు అందలేదు. వాటిని పాఠ్య గ్రంథాల్లోకి తెచ్చి చిన్నపిల్లల్ని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే ప్రయత్నం జరగలేదు. బౌద్ధాన్ని నాశనం చేసి, వైదిక మతం బలపడుతూ వచ్చిన విషయం మనం అప్పుడప్పుడు చర్చించుకుంటూనే ఉన్నాం. ‘రక్షాబంధన్ కూడా బౌద్ధం నుండి జన జీవితంలోకి వచ్చిన ఒక ముఖ్యమైన ఘటనే !అది ఎలాగా? అంటే – మనం సాధారణ శకానికి ముందు 326వ సంవత్సరం జూన్‌మాసంలో అలెగ్జాండర్‌కు పోరస్‌కు మధ్య జరిగిన యుద్ధ కాలానికి వెళ్లాలి.
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తత్త్వవేత్త అరిస్టాటిల్‌కు శిష్యుడైన అలెగ్జాండర్ సాధారణ శకానికి ముందు తన ఇరవయ్యవ యేట మాసిడోనియాకు రాజయ్యాడు. సామ్రాజ్య విస్తరణ చేసుకుంటూ పదేండ్లలో గ్రీస్‌నుండి వాయువ్య భారత దేశానికి చేరుకున్నాడు. ఆసి యా ఖండంలో దండయాత్రలు చేస్తూ బాక్ట్రియాను(అప్ఘాన్ ప్రాంతం) పాలిస్తున్న బౌద్ధరాజు ఆక్సీయార్జెస్‌ను బౌద్ధరాను ఓడించాడు. అక్కడే అతణ్ణి తనరాజ ప్రతినిధిగా నియమించి, అతని కూతురైన రొక్జానా అందానికి, నమ్రతకు ఆకర్షింపబడ్డాడు. ఆమెను తన రెండో భార్యగా స్వీకరించి, జైత్రయాత్రలో ముందుకు కదిలాడు. తక్షశిలను పాలిస్తున్న బ్రాహ్మణరాజు అంబి ఉరఫ్ ఓంఫిస్, అలెగ్జాండర్ భారతదేశం మీద దండెత్తబోతున్నాడని తెలుసుకుని, తన రాజకీయ చతురతను ప్రదర్శించాడు. తమ దేశానికి రావల్సిందిగా వర్తమానం పంపాడు. అయితే ఆప్రాంతపు గిరిజనతెగలు లొంగిపోవడానికి నిరాకరించాయి. పరిస్థితులు గమనించిన అంబి, అలెగ్జాండర్ పక్షాన నిలిచి గిరిజనతెగల్ని అణిచి వేయడంలో సహకరించాడు. అంతేకాదు, జీలం-చీనాబ్ నదుల గల పురుషోత్తమ్ (పోరస్)పై దాడి చేయవల్సిందిగా పురమాయిం చాడు. ఎందుకంటే, పోరస్‌తో అంబికి శత్రుత్వముంది. అతణ్ణి హతమార్చడానికి అలెగ్జాండర్‌ను ఉపయోగించుకున్నాడు. అది ఒక పన్నాగం. తన సైన్యంలోంచి ఐదువేల మంది సైనికుల్ని ఆలెగ్జాండర్ వైపున యుద్ధం చేయడానికి పంపించాడు. అలాగే జీలం నది దాటడానికి తాత్కాలికంగా ఒక వంతెనను నిర్మించాడు. ఆ విధంగా అంబి అన్ని విధాలా అలెగ్జాండర్‌కు సహకరించాడు. బ్రాహ్మణ రాజులు ఈ దేశ మూలవాసుల రక్షణ ఎప్పుడూ కోరుకోలేదు. ఈ విషయం మనకు అనేక సందర్భాలలో, అనేకసార్లు చరిత్ర పుటల్లో కనిపిస్తూనే ఉంది. ఆర్య బ్రాహ్మణ మూలాలున్న ఆరెస్సెస్ స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొనకుండా బ్రిటీష్ వారికి క్షమాపణలు కోరుతూ, తమ బాగోగులు తాము చూసుకున్నారు కదా? గతంలోనైనా, ఆధునిక యుగంలోనైనా, ఇప్పుడైనా వారి ప్రవర్తన మారలేదు.మార్చుకోరు!
326 బిసిఇలో అలెగ్జాండర్ -పోరస్ (పురుషోత్తమ్)ల మధ్య జరిగిన హైడాస్పస్ చారిత్రక యుద్ధం ఆనాటి స్థితిగతులను పూర్తిగా మార్చేసింది. పంజాబ్ ప్రాంతంలో హైడాస్పస్ నదిఒడ్డున ఆ యుద్ధం ఆ జరిగింది. దానినే ఇప్పుడు జీలం నది అని అంటు న్నాం. అప్పుడు జీలమ్ – చీనాబ్ నదుల మధ్య పౌరవ వంశ రాజ్య పాలకుడు పురుషోత్తమ్ పాలిస్తూ ఉండేవాడు. అలసిపోయి ఉన్న మాసిడోనియా అలెగ్జాండర్ సైన్యం పోరస్ సైన్యాన్ని ఎదుర్కోలేక పోయింది. యుద్ధంలో రక్తసిక్తమైన ఇరుపక్షాల సైనికులకు కట్లు గట్టి, బౌద్ధభిక్షులు వైద్యసేవలందిస్తూ ఉండటం అలెగ్జాండర్ ప్రత్యక్షంగా చూశాడు. క్రమంగా మానసిక పరివర్తనకు గురయ్యాడు. జాతి, దయ, కరుణల ముందు ఈ హింస, రక్తపాతం, రాజ్య విస్తరణ చిన్నవిగా తోచసాగాయి.
అలెగ్జాండర్‌కు, అతని గుర్రానికీ తీవ్రంగా దెబ్బలు తగిలి, ఓ మూలపడి మూలుగుతున్నప్పుడు – లాచి అనే యువతి వచ్చి వైద్యసేవలు అందించింది. తను మాసిడోనియాకు మహారాజుననీ, అలెగ్జాండర్‌నని ఆయన తనను తాను ఆ యువతికి పరిచయం చేసుకున్నాడు.
”ఆ.. నీ వెవరైతే నాకేమిటీ? దెబ్బలుతిని, రక్తం కారుతూ లేవలేక పడిఉన్నావు – నీకు వైద్యం చేసి ప్రాణాలు నిలపడం మనిషిగా నా కర్తవ్యం! ప్రాణాలు తీయడం చాలా సుళువు. ప్రాణాలు నిలపడమే చాలా కష్టం! నేను మనిషిని కాబట్టి, మనిషిగా నీకు సేవచేశాను. అంతే!! ” అని చెప్పింది లాచి.
ఆమె మాటలకు ప్రపంచ విజేత అలెగ్జాండర్ తలదించుకున్నాడు. ఆమెలోని మానవత్వాన్నీ ఆ మానవత్వపు విలువనీ గ్రహిం చుకున్నాడు. ఇంత సహనం, ఓర్పు, తాత్త్వికచింతన ఎలా అబ్బాయీ? అని అలెగ్జాండర్ ఆ అమ్మాయి లాచిని అడిగాడు. ఆమె, తను బౌద్ధభిక్షు తంతిమాస్ శిష్యురాలిననీ.. ఇక్కడి క్షతగాత్రులకు సేవలు చేస్తున్న వారంతా ఆ బౌద్ధభిక్షు శిష్యులేనని చెప్పింది. అంతే – ఆయన వెంటనే బౌద్ధభిక్షు తంతిమాస్‌ను కలవాలనీ, ఆయనకు కతజ్ఞతలు చెప్పుకోవాలనీ అనుకున్నాడు.
అప్పటికి బౌద్ధం దేశంలో బాగా స్థాపించి ఉంది – యుద్ధం జరుగుతున్న సమయంలోనే శ్రావణ పౌర్ణమి వచ్చింది. ఉపాసికా, ఉపాసకులు ధమ్మ శ్రవణం చేసి, ఉత్సాహంగా ఒకరికొకరు ధమ్మరక్షలు (రక్షాబంధన్) కట్టుకున్నారు. అంటే మనమంతా కలిసి ధమ్మా న్ని రక్షించుకుందాం – అని ప్రతిన బూనడమన్నమాట! ఆ సంప్రదాయాన్ని ఆనాటి నుండి నేటిదాకా బౌద్ధ విహారాల్లో ఆచరిస్తూనే ఉన్నారు. యుద్ధభూమిలో లాచి తనకు చేసిన సేవల గూర్చి, బౌద్ధ సంప్రదాయం గూర్చి అలెగ్జాండర్ తన సతీమణి రొగ్జానాకు వివరిం చాడు. బలంగా ఉన్న పోరస్‌ను గెలవడం కష్టంగానే ఉందన్న విషయం, తన సైన్యం బలహీనపడిన విషయం కూడా ఆయన తన భార్యకు చెప్పు కున్నాడు. అప్పుడు రొగ్జానా ఒక నిర్ణయం తీసుకుంది. పురుషోత్తమ్ (పోరస్)కు ఒక రాఖీ పంపించింది. దానితో పాటు ఒక కోర్కె కూడా కోరింది. నిరాయుధుడైన తనభర్త అలెగ్జాండర్ గనక ఆయనకు (పోరస్‌కు) చేజిక్కినట్లయితే దయదలిచి ప్రాణభిక్ష పెట్టమని అర్ధించింది. తనను చెల్లెలిగా భావించి తనకు పతిభిక్ష పెట్టాలని వేడుకుంది. విషయం అర్ధం చేసుకున్న పురుషోత్తమ్ విశాల హదయుడై – అలాగే జరుగుతుందని రొగ్జానాకు మాట ఇచ్చాడు.
మరునాడు మళ్లీ భీకర యుద్ధం ప్రారంభమైంది. రొగ్జానా ఊహించిన విధంగానే అలెగ్జాండర్ నిరాయుధుడై పురుషోత్తమ్ చేతికి చిక్కాడు. పురుషోత్తమ్ అలెగ్జాండర్ పై వేటు వేయడానికి కత్తి ఎత్తాడు. కానీ, చేతికి ఉన్న రక్షాబంధన్ కనబడగానే తను ఇచ్చిన మాటను తన కర్తవ్యాన్నీ గుర్తు చేసుకున్నాడు. కత్తిదించాడు. పురుషోత్తమ్ ఔదార్యాన్ని అలెగ్జాండర్ మనసులోనే అభినందించుకున్నాడు. అంతే- వారిరువురూ శత్రువులుగా కాకుండా మిత్రులుగా కలిసి సంధి కుదుర్చుకున్నారు. పురుషోత్తమ్ ధైర్య సాహసాలను అలెగ్జాండర్ ప్రశంసించాడు. గెలుపు అలెగ్జాండర్ పక్షానిదే అయినా, రాజ్యాన్ని పురుషోత్తమ్‌కు అప్పగించి యధావిధిగా పరిపాలించుకోమన్నాడు. తన సైన్యంతో ముందుకు సాగిపోతూ అలెగ్జాండర్ పురుషోత్తమ్‌ని ఒక కోరిక కోరాడు. యుద్ధరంగంలో తనకు సేవలందించి, ప్రాణం కాపాడిన లాచిని భార్యగా స్వీకరించి రాణిని చేయమన్నాడు. పురుషోత్తమ్ అంగీకరించి లాచిని భార్యగా స్వీకరించాడు. అంబి కుట్రలు పనిచేయలేదు. అతను కురిపించిన విషం-శీలం త్యాగనిరతి, హదయ వైశాల్యాలతో అమతమై పోయింది. సోదరభావం వెల్లి విరిసింది.
రాజ్యకాంక్షతో దేశాల్ని జయిస్తూ వచ్చిన అలెగ్జాండర్ భారత దేశంలో బౌద్ధ సంప్రదాయాలకు తలవంచాడు. సోదర భావాన్ని నిలుపుకునే ధమ్మదీక్షకు ప్రాధాన్యమిచ్చాడు. బౌద్ధ సంసతిని ఖండాంతరాలకు తీసుకుపోయాడు. తాత్వికుడైన బౌద్ధభిక్షు తంతిమాస్ బోధనలు విని ప్రభావితుడై, ఆయన బోధనల సారాంశాన్ని అప్పటికి అందుబాటులో ఉన్న ఒక రకమైన కాగితాలపై రాయించుకుని, కూజాలలో భద్రపరిచి వాటిని గుర్రాలపై, ఏనుగులపై తరలించాడు. వెళ్లేప్పుడు తన వెంట కొంతమంది బౌద్ధ భిక్షులను కూడా తీసుకుని వెళ్లాడు. ఆరకంగా బౌద్ధ-గ్రీకు సంస్కతుల ‘సంగమం ఏర్పడింది. తర్వాత కాలంలో జరిగిన కళింగయుద్ధంలో (261 బిసిఇ) చండాశోకుడు మనసు మార్చుకుని, ఆయుధాల్నీ, హింసనూ వదిలి ఎలా బౌద్ధం స్వీకరించాడో మనకు తెలుసు. మానవీయ విలువల్ని నిలుపడానికి, విస్తతంగా బౌద్ధాన్ని అశోక చక్రవర్తి ఎలా ప్రచారం చేయించాడో కూడా మనకు తెలుసు. 323 బిసిఇలో అంటే అలెగ్జాండర్ తన 32వ యేట బాబిలోన్ (ప్రస్తుత ఇరాక్ ప్రాంతం) ఒక అంతు తెలియని వ్యాధికి గురై మరణించాడు. అంతకుముందు ఆయన తన అనుచరులతో ఒక వీలునామా పత్రం వంటిది రాయించాడు. అందులో ముఖ్యంగా మూడు విషయాలున్నాయి. 1. తన శవపేటికను వైద్యులే ఖననం చేయాలి. 2. తన సంపదను దారి వెంట వెదజల్లుకుంటూ వెళ్లాలి. 3. తన ఖాళీ చేతులు బయటకు పైకి సాచి ఉంచి, తీసుకుపోవాలి. వీటి అర్థం ఏమిటంటే, మరణాన్ని ధవీకరించిన వారే ఖననం చేయాలి – అన్నది ఆయన కోరిక. తను ఏ సంపదను తీసుకుపోవడం లేదనీ, అది ఈ ప్రజలదేనని – అందుకే దారి పొడవునా ధనాన్ని వెదజల్లుకుంటూ వెళ్లాలన్నది ఆయన ఆలోచన. తను ఈ ప్రపంచం నుంచి ఏమీ తీసుకుపోవడం లేదని ప్రజలకు ఒక సందేశం ఇచ్చే విధంగా, ఖాళీ చేతులు బయటికి కన బడాలన్నాడు- ఇన్ని శతాబ్దాలు గడిచినా, ఇప్పటికీ శవయాత్రల్లో దారి పొడవునా డబ్బులు చల్లుతూ వెళ్లడం జరుగుతూ ఉంది. ఇది ఇంకా కొనసాగుతున్న ఆనాటి ఆచారమే!
ధమ్మరక్ష – అంటే ధర్మాన్ని రక్షించడం! ధర్మం అంటే ఇక్కడ మతం అని కాదు. న్యాయాన్నీ, సత్యాన్ని రక్షించడం. సహో దరత్వాన్ని, మైత్రీ బంధాన్ని రక్షించడం. బౌద్ధం చెప్పిన జాతి, దయ, కరుణలను కాపాడుకోవడం. ఇవి ఒక ప్రాంతానికి, ఒక దేశానికి సంబంధించినవి కూడా కాదు. విశ్వజనుల శ్రేయస్సును ఉద్దేశించి ఏర్పర్చుకున్నవి. బౌద్ధంలో సత్యానికి, అహింసకి శీలానికి, శాంతికి ఎల్లలే లేవు. ఇవి చాటిచెప్పడానికి బౌద్ధారామాలలో ధమ్మరక్షలు (రక్షాబంధనలు) కట్టుకుంటారు. దాన్ని ఉపయోగించి రొగ్జానా తన భర్త పాణాల్ని కాపాడుకుంది. అప్పటినుండి అది అన్నా చెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక అయ్యింది. కాలక్రమంలో దాని చుట్టూ వచ్చిన ఇతర ఆచారాలన్నీ వైదిక మతస్తులు కల్పించినవి. ఇతర పర్వదినాలను, ఇతర అంశాలను వక్రీకరించినట్లు – ఈ విషయం పెద్దగా వక్రీకరణకు గురికాలేదు. అయితే, ఇది దేశప్రజల జీవితాల్లోకి ఎలా వచ్చింది? ఎలా స్థిరపడింది? అన్నది మాత్రం కప్పిపుచ్చారు. మనం దాన్ని వెలుగులోకి తేవాలి! నిజాన్ని నిలబెట్టాలి!!
– డాక్టర్ దేవరాజు మహారాజు
వ్యాసకర్త: కవిరాజు త్రిపురనేని రామస్వామి
జాతీయ పురస్కార తొలిగ్రహీత
బౌద్ధుల ధమ్మరక్ష నుండి ‘రక్షాబంధన్’ వచ్చింది
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES