– సీఐటీయూ నేతలతో చర్చలు సఫలం
– 22న తుది ఒప్పందానికి అంగీకారం
– ముసురులోనూ వీడని పోరాటం
– ఏడు గంటల పాటు కార్మిక శాఖ కార్యాలయం ఎదుట ధర్నా
– ఒప్పందం జరిగేదాక కదలబోమంటూ భీష్మించిన కార్మికులు
– యాజమాన్యాన్ని పిలిపించిన కార్మికశాఖ
– సమ్మె విరమిస్తున్నట్టు ప్రకటించిన సీఐటీయూ
– 22న పరిష్కారం కాకపోతే మరోసారి పోరుబాట అంటూ హెచ్చరిక
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
హైదరాబాద్ కార్పొరేషన్ పరిధిలో రాంకీ సంస్థలో పనిచేస్తున్న కార్మికులకు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని గత కొంత కాలంగా హెచ్‌ఐఎంఎస్ ఎంప్లాయీస్ యూనియన్ (సీఐటీయూ) యాజమాన్యానికి విజ్ఞప్తి చేస్తున్న విషయం తెలిసిందే. ఆ సంస్థ యాజమాన్యం మొండిగా వ్యవహ రించటంతో చట్టబద్దంగానే సోమవారం నుంచి కార్మి కులు సమ్మెలోకి వెళ్లారు. ఈ నేపథ్యంలో మంగళవారం హైదరాబాద్‌లోని కార్మిక శాఖ కమిషనర్ కార్యాలయం ముందు ఏడు గంటల పాటు వేలాది మంది కార్మికులతో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ముసురులోనూ వీడని పట్టుదలతో కార్మికులు ధర్నాలో పాల్గొన్నారు. ‘యాజమాన్యం అనుసరిస్తున్న మొండి వైఖరి నశించాలి’.. ‘పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలి’.. ‘రోగాలు రొప్పులతో మేము..సుఖ, సంతోషాలతో మీరు’..’కుళ్లిన చెత్తలో మేము..ఏసీ బంగ్లాలో మీరు’అంటూ పెద్దపెట్టున నినదించారు. ఒప్పందం జరిగే వరకు కదలబోమంటూ కార్మికులు భీష్మించుకు కూర్చున్నారు. దీంతో కార్మిక శాఖ అధికారులు యాజమాన్యాన్ని పిలిపించి, యూనియన్ నేతలతో చర్చలు జరిపేందుకు కృషి చేశారు. వేతన ఒప్పందం చేసుకోకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామంటూ హెచ్చరించారు.
దిగొచ్చిన యాజమాన్యం
ఈ నేపథ్యంలో ఎట్టకేలకు రాంకీ సంస్థ యాజ మాన్యం దిగొచ్చింది. జేసీఎల్ సమక్షంలో యూనియన్ నేతలతో చర్చలు జరిపింది. అయితే ఈ చర్చలు సానుకూలంగా జరిగాయి. దీంతో ప్రస్తుతం పొందుతున్న వేతనంపై అదనంగా గ్రేడ్ కార్మికులకు రూ. 6,500, గ్రేడ్ 2 కార్మికులకు రూ.6,300, అన్‌స్కిల్డ్ కార్మికులకు రూ.ఐదువేలు చొప్పున పెంచేందుకు యాజమాన్యం అంగీకరించింది. తుది చర్చలు జేసీఎల్ సమక్షంలో ఈ నెల 22న నిర్వహించి, ఒప్పందంపై సంతకాలు చేయనున్నట్టు యూనియన్ అధ్యక్షులు పాలడుగు భాస్కర్ వెల్లడించారు. చర్చల్లో భాస్కర్‌తో పాటు ఏఐఆర్‌టీడబ్ల్యూఎఫ్ కార్యదర్శి వీఎస్‌రావు, సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి జె వెంకటేశ్, సీఐటీయూ మేడ్చల్ జిల్లా కార్యదర్శి జె చంద్రశేఖర్, అధ్యక్షులు ఎ అశోక్, యూనియన్ ప్రధాన కార్యదర్శి ఐ రమేష్, నాయకులు కుమారస్వామి, ఎన్ సతీష్, డి శ్యాంరాజ్, జి మస్తాన్, బి రవీందర్, వై వెంకటేశ్వర్లు, బి శ్రీనివాస్, జె భాస్కర్, వి రాజేశ్, ఎస్ యాదగిరి పాల్గొన్నారు.
పెద్ద ఎత్తున కదిలిన కార్మికులు..
అంతకు ముందు కార్మిక శాఖ కార్యాలయం ముందు నిర్వహించ తలపెట్టిన ధర్నాకు కార్మికులు పెద్ద ఎత్తున కదిలారు. నాయకుల ఉపన్యాసాలు సాగినంత సేపు..శ్రద్ధగా విన్నారు. మధ్య, మధ్యలో చప్పట్లు, నినాదాలు చేశారు. ధర్నాను ఉద్దేశించి హెచ్‌ఐఎంఎస్ డబ్ల్యూ సీ అండ్ టీ ఎంప్లాయీస్ యూనియన్ (సీఐటీయూ) అధ్యక్షుడు పాలడుగు భాస్కర్ మాట్లాడుతూ కార్మికుల రెక్కల కష్టంతోనే ఏ యాజమాన్యమైనా లాభాలను దండుకుంటుం దని చెప్పారు. రాంకీ సంస్థలో పనిచేసే డ్రైవర్లకు హెల్పర్లకు వేతన ఒప్పందం చేయాలని యాజమాన్యానికి విజ్ఞప్తి చేస్తే నిర్లక్ష్యంగా వ్యవహరించిందని గుర్తు చేశారు. 18 నెలల క్రితమే యజమాన్యానికి సీఓడీ ఇచ్చామని తెలిపారు. అయినా కార్మికుల డిమాండ్లను పరిష్కరించకుండా యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని విమర్శించారు. ఇలాంటి మొండి వైఖరికి నిరసనగానే చట్టబద్దంగా సమ్మెకు పోవాల్సి వచ్చిందని తెలిపారు. డంపింగ్ యార్డ్‌లలో 42సైట్లలో ఎక్కడ కూడా కార్మికులకు మౌలిక సదుపాయాలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం మంచినీళ్లు, మూత్రశాలలు కూడా లేవన్నారు. కుళ్లిన చెత్తతో నిరంతరం పనిచేయటం మూలంగా రోగాల భారిన పడుతున్నారనీ, కొందరు మృత్యువాతకు గురయ్యా రని ఆందోళన వ్యక్తం చేశారు. మరణించిన కార్మికుల కుటుంబాలను యాజ మాన్యం పట్టించుకోవటం లేదని వాపోయారు. యాజమాన్యానికి తొత్తుగా బీఎంఎస్ వ్యవహరిస్తున్నదనీ, కార్మికుల ఐక్యతకు విఘాతం కలిగిస్తున్నదని చెప్పారు. బీజేపీకి సంబంధించిన ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా బీఎంఎస్‌లాగా వ్యవహరించకుండా జోక్యం చేసుకోవాలని సూచించారు. సీఎం రేవంత్‌రెడ్డి, కార్మిక శాఖ స్పందించి కార్మికులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఏఐఆర్‌టీడబ్ల్యూఎఫ్ కార్యదర్శి వీఎస్ రావు మాట్లాడుతూ కార్మికులు కోరేవి గొంతెమ్మ కోర్కెలు కావన్నారు. కార్మికుల కనీస అవసరాలు తీర్చాల్సిన బాధ్యత యాజమాన్యానిదేనన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రవాణా రంగాన్ని ప్రయివేటు పరం చేస్తున్నదని చెప్పారు. రవాణా రంగంలో పనిచేస్తున్న వారికి సామాజిక భద్రతా పథకాన్ని కల్పించాలని డిమాండ్ చేశారు. సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి జె వెంకటేశ్ మాట్లాడుతూ పెరుగుతున్న ధరలకనుగుణంగా వేతనాలు పెరగకపోతే వారు ఎలా బతకాలని ప్రశ్నించారు. ఈ మాత్రం ఆలోచన యాజమాన్యం చేయకపోవటం వల్లనే కార్మికులు ఆందోళనలకు దిగాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.
దిగొచ్చిన రాంకీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES