No menu items!
Monday, September 1, 2025
E-PAPER
spot_img
No menu items!
Homeజాతీయం'ఎడ్యుకేట్‌ గర్ల్స్‌'కు రామన్‌ మెగసెసే అవార్డు

‘ఎడ్యుకేట్‌ గర్ల్స్‌’కు రామన్‌ మెగసెసే అవార్డు

- Advertisement -

– తొలి భారత సంస్థగా రికార్డు
– మరో ఇద్దరికి కూడా
– నవంబర్‌ 7న మనీలాలో ప్రధానం
న్యూఢిల్లీ :
ప్రతిష్టాత్మక రామన్‌ మెగసెసే అవార్డు 2025ను భారత్‌కు చెందిన ఎన్‌జీఓ ఎడ్యుకేట్‌ గర్ల్స్‌ గెలుచుకుంది. దీంతో ఈ అవార్డు సాధించిన తొలి భారత ఎన్‌జీఓగా నిలిచింది. ఈ విషయాన్ని రామన్‌ మెగసెసే అవార్డు ఫౌండేషన్‌ (ఆర్‌ఎంఎఎఫ్‌) ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. ‘బాలికలు, యువతులు ఎదుర్కొంటున్న సామాజిక సమస్యలు పరిష్కరించడం, నిరక్షరాసత్య బానిసత్వం నుంచి వారి విముక్తి చేయడం, వారు తమ పూర్తి సామర్థ్యాన్ని అందుకోవడానికి వారిలో నైపుణ్యాలు, ధైర్యం, స్వచ్ఛందతను నింపడం వంటి వాటిలో నిబద్ధతకు గా గుర్తింపు’గా అవార్డుకు ఎంపిక చేసినట్టు ప్రకటనలో వెల్లడించింది. భారత్‌ నుంచి ఇప్పటి వరకూ వ్యక్తిగతంగానే అవార్డును అందుకున్నారు. తొలిసారిగా ఈ ఏడాది ఒక ఎన్‌జీఓకు లభించింది.
అలాగే, ఈ ఏడాది అవార్డు ఎడ్యుకేట్‌ గర్ల్స్‌తో పాటు మరో ఇద్దరు వ్యక్తులకు కూడా ప్రకటించారు. పర్యావరణకు కృషి చేస్తున్న మాల్దీవులకు చెందిన షాహినా అలీ, పేదలు-అణగారిన వర్గాల అభివృద్ధికి పాటుపడుతున్న ఫిలిఫ్పీన్స్‌కు చెందిన ప్లావియానో ఆంటోనియో ఎల్‌ విల్లానుయేవాలకు ఈ ఏడాది అవార్డు లభించింది. ఈ 67వ రామన్‌ మెగసెసే అవార్డు ప్రదానోత్సవం నవంబర్‌ 7న మనీలాలోని మెట్రోపాలిటిన్‌ థియేటర్‌లో జరగనుంది. ఈ అవార్డు కింద ఒక పతకం, ప్రశంసా పత్రం, నగదు బహుమతిని అందుకుంటారు. ఈ అవార్డును అసాధారణమైన ధైర్యం, న్విస్వార్థ సేవను ప్రదర్శించ ఆసియాకు చెందిన వ్యక్తులకు, సంస్థలకు ఇస్తారు. ఈ అవార్డును అసియా నోబెల్‌ బహుమతిగా భావిస్తుంటారు.

ఎడ్యుకేట్‌ గర్ల్స్‌ గురించి క్లుప్తంగా…
ఎడ్యుకేట్‌ గర్ల్స్‌ను 2007లో సఫీనా హుస్సేన్‌ రాజస్థాన్‌లో స్థాపించారు. లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌ గ్రాడ్యుయేట్‌ అయిన హుస్సేన్‌ మహిళా నిరక్షరాస్యతను ఎదుర్కొవడానికి ఈ ఎన్‌జీఓను నెలకొల్పారు. ప్రస్తుతం దేశంలోని 30 వేలకు పైగా గ్రామాల్లో సేవలను అందిస్తోంది. దాదాపు 20 లక్షల మందికి ఈ సంస్థ విద్యను అందిస్తోంది. 2015లో ఈ సంస్థ ప్రపంచంలోనే మొదటిసారిగా డెవలప్‌మెంట్‌ ఇంపాక్ట్‌ బాండ్‌(డీఐబీ)ను ప్రారంభించింది. అలాగే ప్రగతి అనే ఓపెన్‌-స్కూలింగ్‌ కార్యక్రమాన్ని కూడా ఈ సంస్థ ప్రవేశపెట్టింది. దీని ద్వారా 15 నుంచి 29 ఏండ్ల వయస్సు కలిగి యువతులు తమ విద్యను పూర్తి చేయడానికి, జీవితాంతం అవకాశాలను పొందేందుకు వీలు కల్పిస్తోంది. 300 మంది అభ్యాసకులతో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో ప్రస్తుతం 31,500 మందికి పైగా యువతులు ఉన్నారు.

భారత్‌కు చారిత్రాత్మక క్షణం: సఫీనా హుస్సేన్‌
ఎడ్యుకేట్‌ గర్ల్స్‌కు రామన్‌ మెగసెసే అవార్డు లభించడం భారత్‌కు ఒక చారిత్రాత్మక క్షణమని ఆ సంస్థ వ్యవస్థాపకురాలు సఫీనా హుస్సేన్‌ తెలిపారు. అలాగే, ఈ అవార్డు దక్కడం దేశంలోని ఒక మారుమూల గ్రామంలో ప్రారంభమైన ప్రజాశక్తితో కూడిన ఉద్యమంపై ప్రపంచదృష్టి పడే విధంగానూ చేస్తుందని అన్నారు. అంకితభావంతో పనిచేసే టీం వాలంటీర్లు, విలువైన భాగస్వాములు, లింగవివక్ష విజేతలు, మద్దతుదారులకు ఈ అవార్డు దక్కుందని తెలిపారు. ‘విద్య అనేది మానవ అభివృద్ధికి దోహదపడే అంశాల్లో ఒకటని మేం నమ్ముతున్నాం. అయితే అన్నింటికంటే విద్య అనేది ప్రతీ అమ్మాయి యొక్క ప్రాథమిక, స్వాభావిక హక్కు. ఈ హక్కును అందుకోవడంలో సామాజిక, వ్యవస్థాగత అడ్డంకులను పరిష్కరించడానికి, బాలికలకు సమాన, అందుబాటులో విద్యను ప్రోత్సహించానికి తమ సంస్థ పని చేస్తోంది’ అని తెలిపారు. వచ్చే 10 ఏండ్లలో కోటి మంది అభ్యాసకులను చేరుకోవడానికి, భారత్‌ వెలుపల కూడా ఈ సేవలను అందించడానికి కృషి చేస్తున్నట్లు ఆమె తెలిపారు. అలాగే, తోటి అవార్డు గ్రహీతలు షాహినా అలీ, ఫాదర్‌ ఫ్లావియానో విల్లానుయేవాకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. వారు చేస్తున్న కృషి మనందరికీ స్ఫూర్తినిస్తుందని అన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad