Saturday, April 4, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలువేగంగా రైళ్ల అనుసంధానం

వేగంగా రైళ్ల అనుసంధానం

- Advertisement -

మెరుగుపడనున్న సదుపాయాలు
రద్దీ, సమయమూ తగ్గే అవకాశం
దక్షిణ మధ్య రైల్వే ప్రణాళికలు

నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌
దక్షిణ మధ్య రైల్వే సరికొత్త ప్రణాళికలతో ముందుకు వెళుతున్నది. రైళ్ల అనుసంధానంతోపాటు మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యమిస్తున్నది. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా కొత్త రైళ్లతో పాటు లైన్లనూ విస్తరిస్తున్నది. అంతేగాక సమాయాన్ని ఆదా చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నది. రైల్వేల నెట్‌వర్క్‌ పరిధిని సైతం పెంచేందుకు వేగంగా అడుగులు వేస్తున్నది. గూడూరు నుంచి బల్హర్షా వరకు రైలు మార్గం వేయనున్నది. సరుకు రవాణాను మరింత సులభతరం చేయనున్నది. రెండు కోచింగ్‌ రైళ్ల నిరంతర ప్రయాణంతో వినియోగదారుల అవసరాలను తీర్చనుంది.

కాజీపేట నుంచి సికింద్రాబాద్‌ మీదుగా వాడికి వెళ్లే రైలు మార్గం కూడా అధిక సాంద్రత గల నెట్‌వర్క్‌ కానుంది. ఈ జోన్‌లోని ప్రధాన రైల్వే నెట్‌వర్క్‌ అత్యంత రద్దీగా ఉంది. ఈ రద్దీని ఎదుర్కోవడానికి, రాకపోకలను సులభతరం చేసేందుకు, 2025-26 ఆర్థిక సంవత్సరంలో మౌలిక సదుపాయాలను అధికం చేయడంపై రైల్వే శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. ఈనేపథ్యంలో ఈ జోన్‌ పరిధిలో 194.57 కిలోమీటర్ల మేర ట్రాక్‌ పెంచేందుకు ప్రణాళికలు రూపొందించింది. వీటిలో కొత్త రైలు మార్గాలు , రైల్వే లైన్ల డబ్లింగ్‌తోపాటు ట్రిపుల్లింగ్‌ నిర్మాణాలు సైతం చోటుచేసుకోనున్నాయి.

కొత్త మార్గం..ట్రాక్‌ల విస్తరణ
మల్లవరం-కనిగిరి మధ్య కొత్త రైలు మార్గం రానుంది. 35.93 కిలోమీటర్ల మేర నిర్మాణం చేయనున్నారు. అలాగే రైల్వే లైన్ల డబ్లింగ్‌ సైతం చేపట్టనున్నారు. ఇది 78.768 కిలోమీటర్ల మేర చేపట్టనున్నారు. పాణ్యం – నంద్యాల (13.488 కి.మీ), బాసర – నవీపేట (17 కి.మీ), కాజీపేట వద్ద బైపాస్‌ లైన్‌ (21.46 కి.మీ), వాడి వద్ద బైపాస్‌ లైన్‌ (22.70 కి.మీ), తాండూరు వద్ద (‘వై’) అనుసంధానం (1.95 కిమీ) పెద్దపల్లి వద్ద బైపాస్‌ లైన్‌ (2.17 కి.మీ). ఇకపోతే ట్రాక్‌ల ట్రిప్లింగ్‌ 79.872 కిలోమీటర్ల వరకు నిర్మాణం చేయనున్నారు. బల్హర్షా – మాణిక్‌ఘర్‌ (6.91 కి.మీ. ), రెచ్ని రోడ్‌ – బెల్లంపల్లి ( 9.636 కి.మీ. ), బెల్లంపల్లి – మందమర్రి (7.52 కి.మీ), మోటుమర్రి – మధిర (5.80 కి.మీ), మహబూబాబాద్‌ – నెక్కొండ ( 30.416 కి.మీ) , ఖమ్మం – డోర్నకల్‌ (19.59 కి.మీ.) వరకు నిర్మాణం జరగనుంది.

విద్యుద్దీకరణ
2025-26 సంవత్సరంలో 325 కిలోమీటర్ల మేర ట్రాక్‌ విద్యుద్దీకరణను దక్షిణమధ్య రైల్వే పూర్తి చేసింది. జోన్‌ చేసిన నిరంతర కృషి ఫలితంగా, గూడూరు నుంచి విజయవాడ, కాజీపేట మీదుగా బల్హర్షా వరకు విస్తరించి ఉన్న కీలకమైన ‘గ్రాండ్‌ ట్రంక్‌ మార్గం’లో మూడవ లైను పనులు దాదాపుగా పూర్తయినట్టు అధికారులు చెబుతున్నారు. సుమారు 700 కిలోమీటర్ల మేర ఈ పనులు పూర్తి కాగా, కేవలం పెదవడ్లపూడి – కృష్ణా కెనాల్‌ మధ్య 7 కి.మీ, డోర్నకల్‌ – మహబూబాబాద్‌ మధ్య 20 కి.మీ., సిర్పూర్‌ కాగజ్‌నగర్‌ -ఆసిఫాబాద్‌ మధ్య 11 కి.మీ. వరకు పనులు జరుగుతున్నాయి. చిన్న చిన్న పనులు మాత్రమే పెండింగ్‌ లో ఉన్నాయి.

ఇది దక్షిణం నుంచి ఉత్తరానికి ప్రయాణికులు, సరుకు రవాణా సాఫీగా సాగడానికి సహాయ పడుతుందని రైల్వే అధికారుల సమాచారం. అంతే కాకుండా, ఈ జోన్‌లో ప్రధాన కూడళ్లయిన కాజీపేట, వాడి, పెద్దపల్లి వద్ద బైపాస్‌ లైన్ల నిర్మాణం సైతం ఎలాంటి ఆలస్యం లేకుండా రైలు రాకపోకలను నిరంతరాయంగా కొనసాగించడానికి ఎంతగానో దోహదపడుతుంది. తాండూరు వద్ద నిర్మించిన అనుసంధానం, తాండూరు పరిసర ప్రాంతాల నుంచి ప్రారంభమయ్యే సరుకు రవాణాను, అలాగే ముంబై మార్గంలో ప్రయాణికుల రైళ్ల రాకపోకలను మెరుగు పరచనుంది. మల్లవరం, కనిగిరి మధ్య కొత్త రైలు మార్గాన్ని ఏర్పాటు చేయడం ద్వారా, ఆ మార్గంలో ఉన్న మారుమూల గ్రామాలు రైలు నెట్‌వర్క్‌లోకి రావడంతోపాటు అవి అభివృద్ధి చెందడానికి ఉపయోగపడనుంది.

పెరిగిన కేటాయింపులు
మౌలిక సదుపాయాల వద్ధిలో ఇదే వేగాన్ని కొనసాగించేందుకు, గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 2026-27లో ఎక్కువ నిధులు బడ్జెట్‌లో ప్రతిపాదించారు. గత ఏడాదిలో రూ .11,012 కోట్లుగా ఉన్న మూలధన వ్యయం 18.3శాతం పెరుగుదలతో రూ . 13,026 కోట్లకు పెరిగాయి. కొత్త లైన్ల కోసం రూ .1315 కోట్లు , డబ్లింగ్‌ కోసం రూ . 5083 కోట్లు, ట్రాక్‌ పునరుద్ధరణల కోసం రూ . 1908 కోట్లు, ట్రాఫిక్‌ సౌకర్యాల కోసం రూ . 403 కోట్లు, రోడ్డు భద్రతా పనుల కోసం రూ. 683 కోట్లు కేటాయించారు. దక్షిణ మధ్య రైల్వేలోని ఇంజినీరింగ్‌, ఎలక్ట్రికల్‌, సిగల్‌, టెలికాంతోపాటు ఆపరేటింగ్‌ విభాగాల పనితీరుతోనే రైల్వేలు ముందుకు వెళుతున్నాయని జనరల్‌ మేనేజర్‌ ఎస్‌కె శ్రీవాస్తవ తెలిపారు. జోన్‌వ్యాప్తంగా రైల్వేల్లో మౌలిక సదుపాయాలను మరింత మెరుగుపరుస్తామని చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -