Sunday, December 7, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంరాజ్యాంగాన్ని చదవండి

రాజ్యాంగాన్ని చదవండి

- Advertisement -

మనం ఎటువెళ్తున్నామో అర్థమవుతుంది : ఎస్వీకే వెబినార్‌లో
కర్నాటక హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ హెచ్‌ఎన్‌ నాగమోహన్‌దాస్‌

నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
భారతదేశ ప్రజలు రాజ్యాంగాన్ని క్షుణ్ణంగా చదవాలని కర్నాటక హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ హెచ్‌ఎన్‌ నాగమోహన్‌దాస్‌ విజ్ఞప్తి చేశారు. అప్పుడే పాలకులు దేశాన్ని ఎటుతీసుకెళ్తున్నారో అర్థమవుతుందని విశ్లేషించారు. శనివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో ‘రాజ్యాంగాన్ని రక్షించుకుందాం’ అంశంపై జరిగిన వెబినార్‌లో కర్ణాటక హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ హెచ్‌ఎన్‌ నాగమోహన్‌దాస్‌ ప్రధాన వక్తగా మాట్లాడారు. రాజ్యాంగం వల్లే దళితులు దేశంలో కొంతమేరకైనా ఉన్నత స్థితిలోకి వెళ్లగలిగారని తెలిపారు. రాష్ట్రపతి మొదలు మంత్రులు, ఐఏఎస్‌, ఐపీఎస్‌ సహా అనేక ఉన్నతస్థానాలను పొంది, దేశాభివృద్ధిలో వారి స్థాయిలో భాగస్వాములు అయ్యారని వివరించారు. అయినా దేశంలో ఇంకా పేదరికం, నిరుద్యోగం, వ్యవసాయ సంక్షోభం, పారిశ్రామిక సంక్షోభం వంటివి ఉన్నాయనీ, దీనికి రాజ్యాంగమే కారణమని కొందరు వక్రీకరణ వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు.

ఈ సంక్షోభాలకు వ్యక్తులు కారణమే తప్ప, రాజ్యాంగం కాదనే విషయాన్ని గుర్తించాలన్నారు. రాజ్యాంగం వద్దు అనేవాళ్లు దానికి ప్రత్యామ్నాయాన్ని సూచించట్లేదనీ, అనుబంధ ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వట్లేదని అన్నారు. దేశంలో అరాచకత్వం పెచ్చరిల్లినప్పుడు ప్రజలు నోటికి తాళాలు వేసుకొని బతికే రోజులు వచ్చాయని ఆవేదన వ్యక్తంచేశారు. రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలందరిపై ఉన్నదనీ, దానికోసం ఎదురయ్యే సవాళ్లను స్వీకరిం చేందుకు సిద్ధంగా ఉండాలని దిశానిర్దేశం చేశారు. రాజ్యాంగం అసలు ప్రతిని పదిసార్లు చదివినా సులభంగా అర్థంకాదనీ, అది కథ కాదని చెప్పారు. 75 ఏండ్ల స్వాతం త్య్ర భారతంలో ప్రభుత్వాలు మన రాజ్యాంగంలో ఏముందో ప్రజలకు చెప్పే ప్రయత్నమే చేయలేదని ఆక్షేపించారు. అందువల్లే దేశ ప్రజలు స్వయం ప్రేరేపితంగా రాజ్యాంగ అధ్యయనానికి సిద్ధం కావాలన్నారు. భారత దేశంలోని భిన్న భాషలు, సంస్కృతులు, విలువలు, జీవన ప్రమాణాలు, ఆర్థిక స్థితిగతులు, సామాజిక పరిస్థితులు వంటి అనేక విషయాలు తెలిసి ఉంటేనే, రాజ్యాంగ మూల తత్వాన్ని పసిగట్టలేమని విశ్లేషించారు.

భారతీయ ఆంథ్రోపాలజీ విభాగం అధికారిక గణాంకాల ప్రకారం దేశంలో 4,635 జాతులు, ఉప జాతులు ఉన్నాయన్నారు. భారత రాజ్యాంగం ప్రకారం చట్టం దృష్టిలో వీరంతా సమానమేననీ, అందరికీ సమాన అవకాశాలు కల్పిస్తుందనీ, అదే భారతీయ రాజ్యాంగం గొప్పతనమని అన్నారు. దేశంలో 6 లక్షల 50వేల గ్రామాలు ఉన్నాయనీ, ప్రతి గ్రామంలోనూ స్థానిక పరిపాలన, కులవృత్తులతో పాటు క్షురకులు, పురోహితులు, చాకలి వంటి సేవారంగం కూడా ఉండేదని తెలిపారు. భారతీయ గ్రామీణంలో మొఘల్స్‌ కాలంలో కొన్ని మార్పులు చేశారనీ, రాజులు, జమీందారులు, ఆ తర్వాత రైతులు ఉండేవారని విశ్లేషించారు. స్వాతంత్య్రం వచ్చాక మిశ్రమ ఆర్థిక పరిపాలనను ఎంచుకున్నామనీ, 1947 నుంచి 1990 వరకు ఇదే పద్ధతి అమల్లో ఉందన్నారు. 1991లో సరళీకరణ ఆర్థిక విధానాలు అమల్లోకి వచ్చాక అన్నిరంగాలు పూర్తిగా ప్రయివేటీకరణకు దగ్గరయ్యాయనీ, పాలకులు విద్య, వైద్యం వంటివి కూడా తమ బాద్యతలు కావని వదిలేసే ప్రయత్నాలు చేశారని విమర్శించారు. రాజ్యాంగంలోని సంక్షేమ రాజ్యం అనే పదాన్ని విడనాడారని చెప్పారు.

దేశంలోని 4,635 కులాల్లో ఎవరూ పుట్టుకతో తమ కులాన్ని మార్చుకోలేరనీ, సమాజ సమాన జీవనం లేదనీ, మరణం కూడా సమానం కాదని ఆందోళన వ్యక్తం చేశారు. కులాల వారీగా ఎవరి శ్మశానవాటికలు వారికి ఏర్పడ్డాయనీ, కులం సమానత్వాన్ని కాలరాస్తుందనడానికి ఇంతకంటే ఉదాహరణ ఏం కావాలని ప్రశ్నించారు. పార్లమెంటులో 48 శాతం మంది నేరచరి తులు, 54 శాతం మంది పారిశ్రామిక, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు, 98 శాతం కోటీశ్వరులు ఉన్నారనీ, ఇది సమానత్వం ఎలా అవుతుందని ప్రశ్నించారు. మతోన్మాద శక్తులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటున్నాయనీ, ప్రజలు ఏం తినాలి…ఏం చేయాలో కూడా వారే నిర్ణయిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మైనార్టీలకు స్వేచ్ఛ, భద్రత లేదనీ, వాక్‌స్వాతంత్య్రం హరించబడుతోందనీ, పాలకులకు వ్యతిరేకంగా మాట్లాడితే అరెస్టులు చేస్తున్నారనీ, ఎన్‌కౌంటర్ల పేరుతో హత్యలు చేస్తున్నారని అన్నారు.

సెక్యూలరిజం భారతీయ ఆత్మ అనీ, దాన్ని మతాల మధ్య చిచ్చు పెట్టేలా చేస్తున్నారంటూ భారత పౌరసత్వ చట్ట సవరణల్లో ముస్లింలను మినహాయించి, అందరికీ పౌరసత్వం ఇస్తున్నామని చెప్పడాన్ని ఉదహరించారు. రిజర్వేషన్ల ద్వారా సామాజిక న్యాయాన్ని అందించే ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ జరగట్లేదనీ, అన్నింటినీ ప్రయివేటుపరం చేసి, పోటీతత్వాన్నే ముందుకు తెస్తున్నారని విశ్లేషించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలనీ, భారత రాజ్యాంగంలోని అన్ని చాప్టర్లు ప్రమాదంలోనే ఉన్నాయని విశ్లేషించారు. దాన్ని కాపాడుకోవడానికి ప్రజాచైతన్యమే పరిష్కారమని సూచించారు. కార్యక్రమానికి సుందరయ్య విజ్ఞానకేంద్రం మేనేజింగ్‌ కమిటీ కార్యదర్శి ఎస్‌ వినయకుమార్‌ సమన్వయకర్తగా వ్యవహరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -