Sunday, December 14, 2025
E-PAPER
Homeప్రత్యేకంపుస్తకం చదివితే జ్ఞానం వికసిస్తుంది

పుస్తకం చదివితే జ్ఞానం వికసిస్తుంది

- Advertisement -

‘చిరిగిన చొక్కా అయినా తొడుక్కో.. ఓ మంచి పుస్తకం కొనుక్కో..’ అంటారు కందుకూరి. మరి పుస్తకానికి అంతటి ప్రాధాన్యం ఉంది. పుస్తకం చదవడం వల్ల ఎన్నో ప్రజయోజనాలున్నాయి. పుస్తక పఠనం వల్ల విజ్ఞానంతో పాటు మంచి నడవడిక కూడా అలవడుతుంది. అందుకే పుస్తకాన్ని నేస్తంతో పోల్చుతారు. అలాంటి పుస్తకాలన్నీ ఒక చోటకు చేరితే… లక్షలాదిగా పుస్తక ప్రియులు ఒక దగ్గర గుమ్మిగూడితే అదే చారిత్రాత్మకమైన హైదరాబాద్‌ బుక్‌ ఫెయిర్‌. ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా ఆ పుస్తకాల సంబరానికై ఎన్‌టీఆర్‌ స్టేడియం ముస్తాబవుతోంది. రారమ్మంటూ మనల్ని ఆహ్వానిస్తుంది. డిసెంబర్‌ 19 నుండి 29 వరకు జరిగే ఆ పుస్తకాల జాతర గురించి బుక్‌ఫెయిర్‌ అధ్యక్షులు కవి యాకుబ్‌, ప్రధాన కార్యదర్శి ఆర్‌.వాసు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం…

హైదరాబాద్‌ బుక్‌ఫెయిర్‌ ప్రాధాన్యత గురించి చెబుతారా?
ఇది 38వ హైదరాబాద్‌ బుక్‌ఫెయిర్‌. అంటే దీనికి 37 ఏండ్ల కిందటే బీజం పడింది. అప్పుడు కొంత మంది వ్యక్తులు కలిసి చిక్కడపల్లి లైబ్రరీ ప్రాంతంలో చిన్నగా దీన్ని మొదలుపెట్టారు. తర్వాత నాలుగు షాపులు పెట్టుకొని బుక్‌ఫెయిర్‌ నడిపారు. ఇలా అంచెలవారిగా ఎదుగుతూ ఇప్పుడు ఇది 350 స్టాల్స్‌ పెట్టే వరకు ఎదిగింది. హైదరాబాద్‌ బుక్‌ఫెయిర్‌ ఒక సొసైటీగా ఏర్పడి ప్రతి రెండేండ్లకు ఒకసారి కమిటీ సభ్యులను ఎన్నుకుంటుంది. ఈ కమిటీ ఆధ్వర్యంలో బుక్‌ఫెయిర్‌ నిర్వహిస్తారు. ఈ బుక్‌ఫెయిర్‌ ద్వారా పుస్తకాలన్నీ ఒక దగ్గరకు చేరతాయి. పది రోజుల పాటు ఒకే చోట 350 స్టాల్స్‌ ఉండి, అన్ని రకాల పుస్తకాలు అందుబాటులో ఉంటాయి. వాటి కోసం వచ్చే లక్షల మంది ప్రజలను ఒక చోటకు చేర్చే మంచి ఉత్సాహకరమైన, స్ఫూర్తిదాయకమైన ప్రయోగంగా దీన్ని భావించవచ్చు. ఏడాదికేడాది స్టాల్స్‌ సంఖ్య కూడా పెరిగిపోతుంది. ఒక విధంగా చెప్పాలంటే అసలు నిర్వహించడానికే వీలులేనంతలా స్టాల్స్‌ బుక్‌ చేసుకుంటున్నారు. బుక్‌ఫెయిర్‌లో అన్ని ప్రక్రియలకు సంబంధించిన పుస్తకాలన్నీ కలగలిపి ఉంటాయి. ఇంకా ప్రయత్నిస్తే అంతర్జాతీయ స్థాయి పుస్తకాలు కూడా పెట్టొచ్చు. అవి కూడా తెచ్చుకోగలిగితే ఇంకా బాగుంటుంది. ఏదిఏమైనా ఇప్పటి వరకు చేస్తున్న పద్దతి వల్ల మంచి ఫలితాలే వస్తున్నాయి.
పుస్తక పఠనం వల్ల మనిషిలో వచ్చే మార్పు?
వ్యక్తిత్వ వికాసం పెంపొందించే శక్తి పుస్తకానికి వుంది. పుస్తకాలున్న ఇళ్లు జ్ఞానానికి తెరిచిన వాకిళ్లు అంటారు. పుస్తకాలుంటే ఆ సమాజ స్థితి గతులను ప్రజలు ఎప్పటికప్పుడు తెలుసుకోగలుగుతారు. పుస్తకాలు చదివే అలవాటున్న కుటుంబాలు మిగిలిన కుటుంబాల కంటే భిన్నంగా, ఉన్నత స్థాయిలో ఉంటాయి. చదువు అనేది కేవలం కొలువుల సంపాదించుకోవడానికో, డిగ్రీల కోసమే అనుకుంటారు చాలా మంది. కానీ పుస్తకం ఎంత చదివితే ప్రపంచం గురించి అంతగా తెలుసుకోవచ్చు. జ్ఞానం వికసిస్తుంది. ఒక మనిషిలో జ్ఞానం వికసిస్తే అది వారికి మాత్రమే పరిమితం కాదు. మరింత మంది దగ్గరకు విస్తరిస్తుంది. అందుకే టెక్నాలజీ ఎంత పెరిగినా పుస్తకం ప్రాధాన్యత మాత్రం తగ్గడం లేదు. పుస్తక ప్రాధాన్యత పెరిగే విధంగా హైదరాబాద్‌ బుక్‌ఫెయిర్‌ కృషి చేస్తుంది.
ఈసారి బుక్‌ఫెయిర్‌లో సాహిత్య కార్యక్రమాలు ఎలా ఉండబోతున్నాయి?
బుక్‌ఫెయిర్‌ అంటే ఎక్కడెక్కడి నుండో సందర్శకులు, పాఠకులు, రచయితలు వస్తారు. వారి కోసం గత ఏడాది నుండి భిన్నమైన కార్యక్రమాలు కొన్ని నిర్వహిస్తున్నాము. వాటిలో ఒకటి ‘నచ్చిన పుస్తకం – ప్రభావితం చేసిన పుస్తకం’ అనే అంశాన్ని ఎంచుకున్నాము. ఈ ఏడాది కూడా దీన్నే నడిపించాలనుకున్నాము. ఎందుకంటే సాహిత్య ప్రక్రియల గురించి గతం నుండి ఏవో కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. అయితే బుక్‌ఫెయిర్‌లో నిర్వహించే కార్యక్రమాలు ప్రజలకు మరింత దగ్గర చేసేవిగా ఉండాలని భావించాము. అలాగే ఇటీవల కాలంలో పుస్తకాలు చదివేవారి సంఖ్య బాగా తగ్గిపోతుంది అనే భావన ఉంది. పుస్తకాలు ఎవ్వరూ కొనడం లేదు అని కూడా అనుకుంటున్నారు. అందుకే పాత తరం కానీ, నేటి తరం కానీ ఎలాంటి పుస్తకాలు కొంటున్నారు, చదువుతున్నారు పుస్తకాలు వాళ్లను ఎలా ప్రభావితం చేస్తున్నాయి, ఎలాంటి స్ఫూర్తిని పొందుతున్నారు ఇవన్నీ అందరికీ తెలియాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం పెడుతున్నాం. దీని వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి. పాత పుస్తకాలు చదివిన పెద్దలు పుస్తకాల వల్ల వారిలో వచ్చిన మార్పును చెబుతుంటే విన్న ప్రేక్షకులు కూడా ప్రభావితం చెందుతారు. వారికి కూడా చదవాలనే ఆలోచన కలుగుతుంది. గత ఏడాది ఈ చర్చా వేదికలో కానీ, కవిసమ్మేళనాల రూపంలో కానీ సుమారు 350 మంది భాగస్వాములయ్యారు. ప్రతి రోజు మూడు సెషన్లుగా నిర్వహించాం. ఇందులో కూడా వివిధ రంగాల వారిని ఆహ్వానించాము. మరో వేదిక పుస్తకావిష్కరణకు సంబంధించింది. మూడు గంటల నుండి తొమ్మిది గంటల వరకు రోజుకు ఆరు పుస్తకాలు ఆవిష్కరణలు జరుగుతాయి. అంటే సుమారు 60 పుస్తకాలు ఆవిష్కరణ జరుగుతాయి. ఆ పది రోజుల పాటు పుస్తకాల ప్రాముఖ్యతను ఇలా ప్రణాళిక ప్రకారం తెలియజేయగలిగితే యువతకు బాగా ఉపయోగపడుతుంది. ఏ కార్యక్రమం చేసినా పుస్తక ప్రాధాన్యం వివరించేదిగా ఉండాలనేదే మా ఆలోచన. ముఖ్యంగా ఫోన్లకు అలవాటు పడిన వారు పుస్తకాల వైపు మళ్లగలగాలి. అయితే ఇంకా వినూత్నంగా చేసే అవకాశం ఉంది. ఇతర రాష్ట్రాల నుండి కూడా రచయితలను ఇందులో భాగస్వామ్యం చేయవచ్చు. కేరళ, ఢిల్లీలో బుక్‌ఫెయిర్స్‌ వారు ఇలాగే చేస్తున్నారు. కానీ మనకున్న ఆర్థిక వనరుల వల్ల కొన్ని పరిమితులు పెట్టుకోవలసి వస్తుంది. అయితే కాస్త ప్లాన్‌ చేసుకుంటే చేయగలిగినవే.
సోషల్‌ మీడియా ప్రభావం పుస్తక పఠనంపై ఎలా వుందంటారు?
సోషల్‌ మీడియా ఎంత అభివృద్ధి చెందినా చదివే అలవాటు ఉంటే ఫోన్లోనో, కంప్యూటర్‌లోనే చదవొచ్చు. రాసే వాళ్లు కూడా సోషల్‌ మీడియాలో రాస్తున్నారు అలాగే పుస్తకాలు కూడా ముద్రిస్తున్నారు. కానీ పుస్తకం చేతుల్లో పట్టుకొని చదవడంలో ఉన్న ఆనందం వేరు. ఫోన్లలో, కంప్యూటర్లలో ఎక్కువ సేపు చదవలేము. ఆరోగ్యానికి కూడా మంచిది కాదు. ముఖ్యంగా కండ్లకు అస్సలు మంచిది కాదు. ఒక్క విషయం మాత్రం కచ్చితంగా చెప్పగలను.. సోషల్‌ మీడియా ఎంత అభివృద్ధి చెందినా పుస్తకాలు ముద్రించడం, అమ్మకాలు ఏ మాత్రం తగ్గలేదు.
పిల్లలు, యువతలో పఠనా ఆసక్తి పెంచేందుకు మీరిచ్చే సూచనలు?
పుస్తకాల అధ్యయనం పెంచేందుకే బుక్‌ఫెయిర్‌లో నచ్చిన పుస్తకంపై చర్చ పెడుతున్నాం. అలాగే పిల్లల్ని కూడా ఆకర్షించేందుకు ఈ ఏడాది మధ్యాహ్నం రెండు గంటల నుండి తెలంగాణ బాలోత్సవ్‌ వాళ్ల సహకారంతో కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఇందులో పిల్లలు డ్రాయింగ్‌, కథలు రాయడం, కవితలు, డ్రామాలు ఇలా రకరకాల కార్యక్రమాల్లో భాగస్వాములవుతారు. అయితే పిల్లలో పుస్తకాలు చదివే అలవాటు పెరగాలంటే తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, అధ్యాపకులు అందరూ దీనికి పూనుకోవాలి. పార్కులకు, సినిమాలకు, నాటకాలకు ఎలా మీ పిల్లల్ని తీసుకెళుతున్నారో అలాగే బుక్‌ఫెయిర్‌లకు కూడా తీసుకురావాలి. ఈ వాతావరణంలో పిల్లలు గడపడం వల్ల పుస్తకాల వైపు మళ్లుతారు. చదివే పిల్లల్ని మనం చాలా మందిని చూస్తున్నాం. కొంత మంది పిల్లలు గ్రంథాలయాలను కూడా నడుపుతున్నారు. పుస్తకాలను సేకరిస్తున్నారు. అయితే పిల్లల్ని ఆ వైపుగా మళ్లించే బాధ్యత పెద్దలదే. పాఠ్యపుస్తకాలే కాకుండా జనరల్‌ పుస్తకాలు చదివేలా పిల్లల్ని ప్రోత్సహించాలి. ప్రతి పాఠశాలలో ఒక జనరల్‌ లైబ్రరీ ఉండేలా చూడాలి. అక్కడకు వెళ్లి పుస్తకాలు చదివేలా చూడాలి. అలాగే బయట ఉండే లైబ్రరీలకు తీసుకెళ్లాలి. అక్కడి వాతావరణం వాళ్లకు అలవాటు చేయాలి. ఇది సమాజంలో అందరం కలిసి చేయాల్సిన పని.

– సలీమ
94900 99083

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -