Thursday, January 8, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంపెండింగ్‌ సమస్యలపై ఐక్య ఉద్యమానికి సిద్ధం

పెండింగ్‌ సమస్యలపై ఐక్య ఉద్యమానికి సిద్ధం

- Advertisement -

– యూయస్పీసీ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

పెండింగ్‌లో ఉన్న విద్యారంగం, ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం మరోసారి ఐక్య ఉద్యమానికి సిద్ధమవుతున్నట్టు ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యూయస్పీసీ) స్టీరింగ్‌ కమిటీ ప్రకటించింది. యూఎస్పీసీ రాష్ట్ర స్టీరింగ్‌ కమిటీ సమావేశం మంగళవారం హైదరాబాద్‌లోని టీఎస్‌యూటీఎఫ్‌ రాష్ట్ర కార్యాలయంలో సిహెచ్‌.అనిల్‌ కుమార్‌ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా వివిధ ఉపాధ్యాయ సంఘాల రాష్ట్ర నాయకులు మాట్లాడారు. ”రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్‌లో ఉన్న 5 డీఏల గురించి మాట్లాడటం లేదు. డిసెంబర్‌లో ఇస్తానన్న డీఏ ఇవ్వలేదు. వారంలో ఇస్తామన్న నగదు రహిత వైద్య పథకం మూడు నెలలు గడిచినా కార్యరూపం దాల్చలేదు. 30 నెలలు గడిచినా పీఆర్సీ నివేదికను తెప్పించుకోలేదు. రిటైరైన ఉద్యోగుల పెన్షనరీ బెనిఫిట్స్‌ విడుదల చేయడం లేదు. విద్యారంగంలో సమస్యలన్నీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉన్నాయి” అని వారు అసంతృప్తి వ్యక్తం చేశారు. ”ఎనిమిదేండ్లయినా నూతన జిల్లాలు, మండలాలకు పర్యవేక్షణ అధికారుల పోస్టులు మంజూరు చేయలేదు. సర్వీసు నిబంధనలు రూపొందించడంలో జాప్యం జరుగుతోంది. జీఓ 317 బాధితులకు న్యాయం చేస్తామని మాటిచ్చి పట్టించుకోలేదు. రెండేళ్ళుగా అనేక ప్రాతినిధ్యాలు చేస్తున్నా ఫలితం లేకపోయింది” అని విమర్శించారు. ఉపాధ్యాయులు, పెన్షనర్లు తీవ్రమైన ఆవేదనతో ఉన్నారని వారు తెలిపారు. ఉపాధ్యాయులు, పెన్షనర్ల ఆందోళనను దృష్టిలో ఉంచుకుని తక్షణమే ఉద్యమ కార్యాచరణ ప్రకటించాలని ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, కార్మికుల ఐక్య వేదిక(జేఏసీ)ని కోరాలని యూయస్పీసీ నిర్ణయించినట్టు స్టీరింగ్‌ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ సమావేశంలో చావ రవి, ఎ.వెంకట్‌ (టీఎస్‌యూటీఎఫ్‌), ఎన్‌.తిరుపతి (టీపీటీఎఫ్‌), ఎం సోమయ్య, టి.లింగారెడ్డి (డీటీఎఫ్‌), జాడి రాజన్న (ఎస్సీఎస్టీటీఎఫ్‌), ఎస్‌.హరికృష్ణ, వి.శ్రీను నాయక్‌ (టీటీఏ), వై.విజయ కుమార్‌, రవీందర్‌ (ఎస్సీఎస్టీటీయు), ఎం.మహేష్‌ (ఎంఎస్టీఎఫ్‌), ఎం.సైదులు (బీటీఎఫ్‌)లు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -