నవతెలంగాణ – భూపాలపల్లి: స్ట్రక్చర్ మీటింగ్లో యాజమాన్యం అంగీకరించిన సమస్యలను పరిష్కరించకుంటే సమ్మె కైనా సిద్ధమేనని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్ యాజమాన్యాన్ని హెచ్చరించారు. శనివారం భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఏఐటీయూసీ కొమురయ్య భవన్ లో బ్రాంచ్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో రాజ్ కుమార్ మాట్లాడుతూ.. సింగరేణిలో 2014 నుండి 2023 వరకు కార్మికుల సమస్యలపై స్ట్రక్చర్ మీటింగులు జరగలేదని, రాజకీయ జోక్యంతోనే కార్మికులకు సంబంధించిన ప్రకటనలు చేసేవారని అన్నారు. ఏఐటీయూసీ గుర్తింపు సంఘంగా గెలిచిన అనంతరం వివిధ స్థాయిలో స్ట్రక్చర్ మీటింగులు నిర్వహించడం జరిగిందని అందులో కొన్ని యాజమాన్యం పరిష్కరించిన పూర్తిస్థాయిలో అమలు పరచడంలో యాజమాన్యం విఫలమైందన్నారు.
కార్మికుల సొంతింటి పథకం అమలు చేస్తామని హామీ ఇచ్చి దానికి కమిటీ వేసి కూడా ఇప్పటివరకు అమలు చేయలేదని అన్నారు. కోల్ ఇండియా మాదిరిగానే పెరిక్స్ పై ఇన్కమ్ టాక్స్ యాజమాన్యం చెల్లించాలని కోరడం జరిగిందన్నారు. ప్రస్తుతం సింగరేణిలో మెడికల్ బోర్డు సమస్య తీవ్రంగా ఉందని 9 నెలలుగా మెడికల్ బోర్డు నిర్వహించడంలో యాజమాన్యం విఫలమైందన్నారు. సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఈనెల 6న అన్ని డిపార్ట్మెంట్లలో మెమోరండాలు నిరసన, ధర్నా వివిధ రూపాల్లో కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. అదేవిధంగా 8న జిఎం కార్యాలయాల ముందు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహించబోతున్నామని తెలిపారు. కార్మిక సమస్యల పరిష్కారం కోసం అన్ని సంఘాలను కలుపుకొని దశలవారీగా పోరాటాలు ఉధృతం చేస్తామన్నారు. 8 తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కను కలవడం జరుగుతుందని సమస్యలను వారికి వివరించి పరిష్కరించకుంటే కార్మిక సంఘాలు ఐక్యంగా ఏర్పాటు చేసి సమ్మెకు పిలుపు నివ్వటం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ నెల 6, 8న జరిగే ధర్నా, నిరసనలను కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో బ్రాంచ్ కార్యదర్శి మోటపలుకుల రమేష్, బ్రాంచి సహాయ కార్యదర్శి గురుజపల్లి సుధాకర్ రెడ్డి, బ్రాంచ్ కమిటీ నాయకులు నూకల చంద్రమౌళి, సిపిఐ పట్టణ కార్యదర్శి ప్రవీణ్ కుమార్, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి సతీష్, లతో పాటు నాయకులు పాల్గొన్నారు.



