మిత్రుడి కుటుంబానికి అండగా బాల్య మిత్రులు
రూ. 19,500 ఆర్థిక సాయం అందజేత
నవతెలంగాణ -పెద్దవంగర
వారంతా బాల్య మిత్రులు, కలిసే చదువుకున్నారు. వారిలో ఎవరికి.. ఏ ఆపద వచ్చినా, మేమున్నామని.. భరోసా కల్పిస్తున్నారు. కష్టకాలంలో ఉన్న స్నేహితులకు తమకు తోచిన సహాయం అందిస్తూ.. పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. కొడకండ్ల ఉన్నత పాఠశాలలో 2003-04 లో పదో తరగతి చదువుకున్న పూర్వం విద్యార్థులు.. గత కొంతకాలంగా తమ మిత్రులు ఎవరు ఏ ఆపదలో ఉన్న ఆదుకోవాడానికి ముందుకు వస్తున్నారు. వారు ఇప్పటికే ఆపదలో ఉన్న పది మంది తోటి మిత్రులకు ఆర్థిక సాయం అందించి, మైత్రి అన్న మాటకు సరైన నిర్వచనాన్ని అందించారు. కాగా మండలంలోని గంట్లకుంట గ్రామానికి చెందిన జిన్న రామానుజం (38) ఇటీవల జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.
విషయం తెలుసుకున్న బాల్య మిత్రులు తమవంతుగా మిత్రుని కుటుంబానికి అండగా నిలవాలని సంకల్పించారు. రూ. 19,500 సేకరించిన నగదు ను మిత్రుడి కుటుంబానికి అందజేశారు. అనంతరం బాల్య మిత్రులు మహేందర్, షన్న మాట్లాడుతూ.. ఈ లోకంలో స్నేహానికి మించిన బంధం మరొకటి లేదని అందరితో మమేకమై కలివిడిగా కష్టసుఖాలను పాలుపంచుకునే ఆప్త మిత్రుడు దూరం కావడం చాలా బాధాకరమన్నారు. భౌతికంగా మా మధ్య లేకపోయినా అతని భావాలు మాపై చూపించిన ఆదరాభిమానాలు, ఏనాటికి చెరగని స్మృతులుగా మా మధ్య మెదలాడుతూనే ఉంటాయన్నారు. కార్యక్రమంలో బాల్య మిత్రులు మహేందర్, ఎండీ షన్న, శ్రావణ్, నాగరాజు, కృష్ణ, పూలమ్మ, రాము, సమ్మయ్య, జంపయ్య, మల్లయ్య, అశోక్, శైలజ, అనసూయ తదితరులు పాల్గొన్నారు.



