2025లో తరలిపోయిన రూ.2 లక్షల కోట్లు
దలాల్ స్ట్రీట్‌పై సన్నగిల్లిన విశ్వాసం
న్యూఢిల్లీ : భారత స్టాక్ మార్కెట్లపై విదేశీ సంస్థాగత మదుపర్లు మొఖం చాటేస్తోన్నారు. ఈ ఏడాది 2025లో కేవలం ఆరు కీలక రంగాల నుంచే విదేశీ సంస్థాగత మదుపర్లు (ఎఫ్‌ఐఐ) దాదాపు రూ.2 లక్షల కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. ఇది భారత మార్కెట్ చరిత్రలో అత్యంత దారుణ స్థితుల్లో ఒక్కటి. 2025 ముగిసే సమయానికి ఈ అమ్మకాల నష్టం మరింత పెరగొచ్చని ట్రేడర్లలో ఆందోళన నెలకొంది. ఎన్‌ఎస్‌డిఎల్ సమాచారం మేరకు.. ప్రధానంగా ఆరు రంగాలపై ఎఫ్‌ఐఐల ప్రభావం తీవ్రంగా చూపింది. ఐటి, ఎఫ్‌ఎంసిజి రంగాల నుంచి అత్యధికంగా విదేశీ ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు.మొత్తంగా 2025లో ఇప్పటివరకు భారత ఈక్విటీల నుండి రూ.1.6 లక్షల కోట్ల ఎఫ్‌ఐఐలు తరలిపోయాయి. ”2025 క్యాలెండర్ ఇయర్‌లో ఎఫ్‌ఐఐలు 17.8 బిలియన్ డాలర్ల (రూ.1.6 లక్షల కోట్లు) విలువైన భారతీయ షేర్లను విక్రయించారు.
ఈ నిధులు చైనా, జపాన్, యూరప్, అమెరికా వంటి ఇతర గ్లోబల్ మార్కెట్లకు తరలిపోయాయి” అని ఐసీఐసీఐ సెక్యూరిటీస్ తెలిపింది. భారత మార్కెట్లు స్వల్ప లాభాలను మాత్రమే ఇవ్వగా.. ఇదే సమయంలో అంతర్జాతీయ మార్కెట్లు 12-61 శాతం మధ్య లాభాలను అందించాయి. రియాల్టీ (రూ. 12,364 కోట్లు), ఫైనాన్షియల్ సర్వీసెస్ (రూ. 10,894 కోట్లు), ఆటో (రూ. 9,242 కోట్లు) రంగాల్లో కూడా అమ్మకాలు కొనసాగాయి. మరోవైపు టెలికాం (రూ.47,109 కోట్లు), ఆయిల్ అండ్ గ్యాస్ (రూ. 9,076 కోట్లు), సర్వీసెస్ (రూ. 8,112 కోట్లు) రంగాల్లో నికర పెట్టుబడులు నమోదయ్యాయి. ” వచ్చే ఏడాది 2026లో ్టబడుల ఉపసంహరణ ఆగిపోయే అవకాశం ఉంది. నిఫ్టీ నుండి 12 శాతం రిటర్న్స్ వచ్చే అవకాశం ఉండటం, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల తగ్గింపు వంటి అంశాలు తిరిగి పెట్టుబడులు రావడానికి దోహదపడవచ్చు” అని బ్యాంక్ ఆఫ్ అమెరికా ఇండియా రీసెర్చ్ హెడ్ అమిష్ షా పేర్కొన్నారు.



