Saturday, August 2, 2025
E-PAPER
Homeఎడిట్ పేజిఎర్రపొద్దు

ఎర్రపొద్దు

- Advertisement -

కరుడుగట్టిన కష్టాలను పెకిలించి
మరిగే రక్తంతో సమాజాన్ని కడిగి
ఎర్రటి ధారల దారుల్లోనే అడుగేసి
విప్లవ శంఖమై ధ్వనించిన వీరులెందరో..

ఎర్రబడిన కండ్లు అగ్నిని వర్షిస్తుంటే
తిరగబడిన పౌరుషం తెగబడుతుంటే
అంటరానితనమంటూ గెంటేస్తుంటే
తూరుపు పొద్దులా ఎరుపు కిరణాలై
రణరంగపు మైదానంలో నిలబడి
తారతమ్యాలను నరికిన త్యాగులెందరో..

కల్మషాల పొదిలో హాహాకారాలు చేస్తుంటే
ఆకలి పేగుల్ని తెంచే దౌర్జన్యం ఎగస్తుంటే
ఆర్తనాదాలను గీతాలుగా విని వదిలేస్తుంటే
ఏకరువులన్నీ గుదిబండలై పడిపోతుంటే
నరాల్లో నెత్తుటిని మరిగిస్తూ
గొంతెత్తి నలుదిక్కుల్ని పిక్కటిల్లేలా చేసి
బడుగు బతుకులకై
గతుకుల్ని పూడ్చిన విప్లవకారులెందరో..

బానిసత్వం నాగుపడగై ఆడుతుంటే
చిన్నచూపు నిప్పురవ్వై రగులుతుంటే
వెక్కిరింతలు వెనకమాలే నడుస్తుంటే
గతితప్పిన జీవనాల వలలో ఇరుక్కుంటూ
రంగును సైతం ఎత్తిచూపే తంతు
అణువణువునా పరిణమిస్తుంటే
వ్యవస్థలోని కుళ్లును చీపురుతో తుడిచి
రక్తంతో మనిషిలోని మలినాన్ని కడిగి
సమాజహితానికి సమానత్వం కోసం
ఎర్రజెండాను ఎర్రపొద్దులో రెపరెపలాడించి
పేరుకున్న భేదాన్ని కడిగిన
విప్లవకారులెందరో ఇంకెందరో..ఎందరో…
– నరెద్దుల రాజారెడ్డి,
9666016636

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -