క్యాడర్లను కుదించండి
వైద్య విధానపరిషత్ వైద్యారోగ్యశాఖలో విలీనం
ఆరోగ్యశాఖ సంస్కరణపై ఆస్కీ నివేదిక
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
మూలిగే నక్కపై తాటిపండు పడటం అంటే ఇదే! రాష్ట్రంలో ప్రజావసరాలకు సరిపడా వైద్య సౌకర్యాలు లేవనేది జగమెరిగిన సత్యం. కానీ ఆరోగ్యశాఖలో సంస్కరణల పేరుతో ఆడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ఆస్కీ) దీనికి భిన్నంగా రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. వైద్యారోగ్యశాఖలో ఇప్పుడీ రిపోర్టు చర్చనీయాంశంగా మారింది. ఆస్కీ ప్రతిపాదనలపై ఉద్యోగులు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగుల సంఖ్యను తగ్గించి, క్యాడర్ పోస్టుల్ని కూడా కుదించాలనే ప్రతిపాదనల్ని వారు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వైద్యారోగ్య సేవల్లో సరైన ప్రమాణాలు అమలయ్యేందుకు ప్రపంచ ఆరోగ్యసంస్థ, నేషనల్ హెల్త్ మిషన్, ఇండియన్ హెల్త్ పబ్లిక్ హెల్త్ స్టాండర్ట్స్ వంటివి క్యాడర్ స్ట్రెంత్‌కు సంబంధించి అనేక సూచనలు చేశాయి. జనాభా ఆధారంగా బెడ్‌ల సంఖ్య, డాక్టర్లు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది నిష్పత్తిని ఆయా సంస్థలు ధృవీకరించాయి.
మెరుగైన వైద్య సేవలందించేందుకు అభివృద్ధి చెందిన దేశాలు ఈ సిఫారసుల్నే ప్రామాణికంగా పాటిస్తున్నాయి. కానీ ‘ఆస్కీ’ దీనికి భిన్నంగా నివేదికలో పేర్కొంది. ప్రస్తుతం ఉన్న 117 క్యాడర్లను 81కు కుదించాలని సిఫారసు చేసింది. డీఈవో, డైటీషియన్, ఈసీజీ టెక్నీషియన్లు, నర్సింగ్ ఆఫీసర్ల సంఖ్యను తగ్గించింది. ఆయా కేడర్ పోస్టుల్ని కుదించుకోవాలని సూచించింది. అలాగే కొన్ని ఉద్యోగాలను కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్‌లోనే కొనసాగించాలని ప్రతిపాదించింది. ప్రస్తుతం ఉన్న 12,589 మంది ఉద్యోగుల సంఖ్యను 11,662కు తగ్గించాలని సిఫారసు చేసింది. దీనిపై వైద్యారోగ్యశాఖ ఉద్యోగులు భగ్గుమంటున్నారు. ఇప్పటికే ఉన్న ఉద్యోగులపై తీవ్రమైన పనిఒత్తిళ్లు పెరుగుతున్నాయనీ, పెరిగిన జనాభాకు అనుగుణంగా వైద్యసౌకర్యాలు లేని సమయంలో ‘ఆస్కీ’ ఈ తరహా సిఫారసులు ఏంటని ప్రశ్నిస్తున్నారు. అయితే తెలంగాణ వైద్య విధాన పరిషత్ (టీవీవీపీ)ని డైరెక్టర్ ఆఫ్ సెకెండరీ హెల్త్‌గా మార్చే ప్రతిపాదనను స్వాగతించారు.
దీనికి సంబంధించిన విధివిధానాలు రూపొందించాలని ‘ఆస్కీ’ ప్రతిపాదించింది. ఈ నివేదికపై ఇప్పటికే వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహా సమీక్ష నిర్వహించారు. నివేదికలో పేర్కొన్న అంశాల ఆధారంగా ఆయా విభాగాలవారీగా నివేదికలు ఇవ్వాలని కోరారు. అదే సమయంలో తెలంగాణ వైద్య విధాన పరిషత్ పరిధిలోని వివిధ క్యాడర్లకు సంబంధించిన దాదాపు 11వేల మంది సిబ్బంది ప్రభుత్వాస్పత్రుల్లో పని చేస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆయా ఆస్పత్రుల్లో వసూలు చేసే యూజర్ చార్జీల ద్వారా వేతనాలు ఇచ్చేవారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అప్పటి సీఎం డాక్టర్ వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి యూజర్ చార్జీలను రద్దు చేసి, ఉద్యోగులకు గ్రాంట్ ఇన్ ఎయిడ్ ద్వారా జీతాలు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు.
అప్పటి నుంచి వీరందరికీ గ్రాంట్ ఇన్ ఎయిడ్ ద్వారానే జీతాలు అందుతున్నాయి. అయితే తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని వారు చాలాకాలంగా కోరుతున్నారు. టీవీవీపీ పరిధిలో జిల్లా ఆస్పత్రులు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ఏరియా ఆస్పత్రులు, మెటర్నల్ చైల్డ్ హెల్త్ సెంటర్ల ద్వారా వీరంతా వైద్య సేవలందిస్తున్నారు. అయితే వీరిని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ సెకండరీ హెల్త్‌గా మార్చాలనే ప్రతిపాదనల పట్ల ఉద్యోగులు సీఎం రేవంత్‌రెడ్డి, వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
అందర్నీ రెగ్యులరైజ్ చేయాలి : బైరిపాక శ్రీనివాస్
వైద్య విధాన పరిషత్‌లో దాదాపు 20 ఏండ్లకుపైగా కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన సేవలందిస్తున్న వారందరిని బేషరతుగా రెగ్యులరైజ్ చేయాలని తెలంగాణ యునైటెడ్ మెడికల్, హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ (సీఐటీయూ) అనుబంధ వైద్య విధాన పరిషత్ విభాగం రాష్ట్ర కార్యదర్శి బైరిపాక శ్రీనివాస్ డిమాండ్ చేశారు. టీవీవీపీని సెకెండరీ హెల్త్ సర్వీసెస్‌గా అప్‌గ్రేడ్ చేస్తుండటం పట్ల హర్షం వ్యక్తం చేశారు. అయితే ఆస్కీ నివేదికలో కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు అదే హౌదాలో రిటైర్ అయ్యేలా సిఫారసు చేయడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. క్యాడర్ స్ట్రెంత్‌ను తగ్గించొద్దనీ, ఇండియన్ పబ్లిక్ హెల్త్ స్టాండర్డ్ ప్రకారమే విధాన నిర్ణయాలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఉద్యోగుల్ని తగ్గించండి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES