-హైకోర్టు ఆదేశం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
కాంట్రాక్ట్ ప్రాతిపదికపై పారా మెడికల్ సర్వీసులో ఉన్న ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని బీహెచ్‌ఈఎల్‌ను ఆదేశిస్తూ హైకోర్టు ఇటీవల తీర్పు చెప్పింది. దశాబ్ధానికిపైగా పిటిషనర్ల సేవలను పొందుతూ పర్మినెంట్ చేయకపోవడాన్ని తప్పుపట్టింది. వాళ్లను తాత్కాలిక ఉద్యోగులుగానే కొనసాగించడం చెల్లదంటూ బీహెచ్‌ఈఎల్‌ను తప్పుబట్టింది. చట్టబద్ధంగా రూల్స్‌కు అనుగుణంగా కాంట్రాక్ట్ పద్ధతిన నియమితులైన వారిని క్రమబద్ధీకరించాలని తీర్పు చెప్పింది. సుప్రీం కోర్టు ఉమాదేవి వర్సెస్ కర్ణాటక కేసులోని మార్గదర్శకాల మేరకు పర్మినెంట్ చేయాలని జస్టిస్ నగేష్ భీమపాక ఇటీవల తీర్పు చెప్పారు.
తాత్కాలిక పద్ధతిన నియమితులైనప్పటికీ వాళ్ల సర్వీసులకు మధ్యమధ్యలో గ్యాప్ ఇస్తూ కొనసాగింపు చేయడాన్ని తప్పుపట్టారు. వాళ్ల సేవలు అవసరమని తెలిసే కాంట్రాక్ట్ పద్ధతిలో చాకిరీ చేయించుకోవడం చెల్లదన్నారు. పిటిషనర్లు శాశ్వత నియామకానికి అర్హులేనని, వారి సర్వీసును క్రమబద్ధీకరించాలని ఆదేశించారు. పారామెడికల్ తాత్కాలిక ఉద్యోగులుగా పనిచేస్తున్న తమను శాశ్వత ఉద్యోగులుగా నియామకం చేపట్టకపోవడం చట్ట వ్యతిరేకమంటూ దుర్గాప్రసాద్ సహా 30 మంది వేసిన పిటిషన్‌లో తీర్పు చెప్పారు. పిటిషనర్లను తాత్కాలిక పద్ధతిన 2012-2016 మధ్య ఎంప్లారుమెంట్ ఎక్స్ఛేంజ్, క్యాంపస్ సెలెక్షన్స్ ద్వారా బీహెచ్‌ఈఎల్ ఎంపిక చేసింది. మొదట ఆరు నెలలకు సర్వీసు తీసుకుని ఆ తర్వాత క్రమంగా పొడిగిస్తూ వచ్చింది. ఎప్పటికప్పుడు సర్వీసును పొడిగించడానికి అధికారులు సిఫారసు చేశారు. ఈఎస్‌ఐ, ఈపీఎఫ్, బోనస్, ఎస్‌ఐపీ, రూ. రెండు లక్షల బీమా సౌకర్యం, వసతి సౌకర్యాల కల్పనకు బీహెచ్‌ఈఎల్ అంగీకరించింది. శాశ్వత నియమాకాలకు ఒప్పుకోవడం లేదు.. అని పిటిషనర్ లాయర్ చిక్కుడు ప్రభాకర్ చెప్పారు.
బీహెచ్‌ఈఎల్‌లో 150 పడకల ఆస్పత్రి ఉందని, పిటిషనర్లను తాత్కాలిక పద్ధతిపై నియామకం జరిగింది. షరతులకు లోబడే సర్వీసులో చేరారు. ఇప్పుడు పర్మినెంట్ చేయాలని కోరడం చెల్లదు.. అని బిహెచ్‌ఈఎల్ అడ్వకేట్ చెప్పారు. దీనిపై హైకోర్టు, బీహెచ్‌ఈఎల్ వాదనను తోసిపుచ్చింది. పిటిషనర్లు శాశ్వత ఉద్యోగులుగా నియామానికి అర్హులని తేల్చింది. వాళ్ల సర్వీస్‌లను పరిగణనలోకి తీసుకుని పర్మినెంట్ ఉద్యోగులుగా తీసుకోవాలి. అన్ని వేతన ప్రయోజనాలను కల్పించాలి.. అని తీర్పు వెలువరించింది.
ఇండ్ల సమాచారం ఇవ్వండి : హైకోర్టు
సమాచార హక్కు చట్టం కింద జనం కోరితే ఇందిరమ్మ ఇండ్ల వివరాలు ఇవ్వాలని హైకోర్టు ప్రభుత్వానికి ఆదేశించింది. వివరాలు ఇచ్చేందుకు నిరాకరించడం సమాచార హక్కు చట్టం-2005కు పూర్తి విరుద్ధమంది. పిటిషనర్‌కు బీపీఎల్ కింద ఉచిత సమాచారం ఇవ్వాలంది. మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేటలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల జాబితా, అర్హతలు, ప్రభుత్వ ఉత్తర్వులు ఇవ్వాలంటూ పంచాయతీ కార్యదర్శి, మండల అధికారులకు న్యాయ విద్యార్థి గాడిపెళ్లి గణేశ్ సమాచార హక్కు చట్టం కింద అప్లికేషన్ పెట్టుకున్నారు. బీపీఎల్ కేటగిరీలోని సమాచారాన్ని సెక్షన్ 7(5) కింద ఇవ్వాలని కోరితే, ఇచ్చేందుకు ఆఫీసర్లు నిరాకరించారు. దీనిని సవాలు చేస్తూ గణేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా జస్టిస్ టి మాధవీదేవి ఇటీవల తీర్పు చెప్పారు. జీవో 454 ఈ కేసులో వర్తించదని, దరఖాస్తుదారునికి చట్టప్రకారం సమాచారం ఇవ్వడం ప్రభుత్వ విధి అన్నారు.
సీఎస్ కోర్టుకు రావాలి : హైకోర్టు
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిషేధిత భూముల వివరాలను సంబంధిత సబ్‌రిజిస్ట్రార్లకు అందజేసే ప్రక్రియపై అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించినా పట్టించుకోని సీఎస్‌పై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. కోర్టు ఉత్తర్వులను ఉపేక్షిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించింది. అఫిడవిట్ దాఖలు చేయకపోతే వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశించామనీ, అఫిడవిట్ దాఖలు చేయకపోవడంతోపాటు వ్యక్తిగత హాజరుకాకపోవడం అసహనం వ్యక్తం చేసింది. కనీసం హాజరు మినహాయింపు కోరుతూ పిటిషన్ దాఖలు చేయకపోవడాన్ని తప్పుబట్టింది. చివరి అవకాశంగా మరో వారం గడువు ఇస్తున్నామని ఈలోగా రిజిస్ట్రేషన్‌ల చట్టంలోని సెక్షన్ 22ఎ కింద ఉన్న నిషేధిత భూముల వివాదానికి సంబంధించి అఫిడవిట్ దాఖలు చేయాలని లేదంటే వ్యక్తిగతంగా హాజరుకావాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు జారీ చేసింది. అఫిడవిట్ దాఖలు చేయకపోతే వ్యక్తిగతంగా హాజరుకావాల్సిందేనని, ఈసారి ఉపేక్షించే ప్రసక్తే లేదని తేల్చి చెబుతూ విచారణను 10వ తేదీకి వాయిదా వేసింది. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం వట్టినాగులపల్లిలో 475 చదరపు గజాల స్థలం రిజిస్ట్రేషన్‌కు సబ్‌రిజిస్ట్రార్ డాక్యుమెంట్‌లను స్వీకరించకపోవడాన్ని సవాలు చేస్తూ గుప్త రియాల్టీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీంతోపాటు ఇలా రిజిస్ట్రేషన్‌లను నిరాకరించడాన్ని సవాలు చేస్తూ మరికొందరు పిఇషన్‌లు దాఖలు చేశారు. వీటన్నింటిపై న్యాయమూర్తి జస్టిస్ అనిల్‌కుమార్ జూకంటి విచారణ చేపట్టారు. నిషేధిత జాబితాలోని భూముల వివరాలు 9 వారాల్లో సబ్‌రిజిస్ట్రార్‌లకు అందేలా చర్యలు తీసుకోవాలని, దీనికి సంబంధించి ఆయా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేయడంతోపాటు చేపట్టిన ప్రక్రియపై 10 రోజుల్లో అఫిడవిట్ దాఖలు చేయాలని లేదంటే హాజరు కావాలంటూ గత ఆదేశాల అమలు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి ఇలాంటిది ఊహించలేదని, ఇది ఆయన కార్యాలయం ప్రతిష్ఠను తగ్గించేలా ఉందని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ న్యాయవాది కాట్రం మురళీధర్‌రెడ్డి వివరణ ఇస్తూ హైకోర్టు ఉత్తర్వుల అమల్లో భాగంగా వివరాల సేకరణలో ప్రభుత్వం ఉందన్నారు. ఆయా జిల్లాల కలెక్టర్లతోపాటు దేవాదాయశాఖ, వక్ఫ్‌బోర్డుల నుంచి భూముల వివరాలను సేకరించడానికి ప్రభుత్వం ఈనెల 1న మెమో జారీ చేసిందంటూ ఆ కాపీని అందజేశారు. అన్ని వివరాలు సేకరించిన తరువాత తదుపరి చర్యలు తీసుకుంటామని దీనికి కొంత గడువు కావాలని కోరారు. వాదనలను విన్న న్యాయమూర్తి నిషేధిత జాబితాలోని భూముల వివాదాల పరిష్కారానికి కమిటీని ఏర్పాటు చేయాలంటూ వింజమూరి రాజగోపాలచారి కేసులో వెలువరించిన తీర్పు ఇప్పటివరకు అమలుకాలేదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేస్తూ గత నెల 23న జీవో 98 జారీ చేసిందని, దీని అమలుకు చర్యలు తీసుకోవాల్సి ఉందన్నారు. నిషేధిత భూముల జాబితా వివరాలను సబ్‌రిజిస్ట్రార్‌లకు అందజేసే ప్రక్రియపై చేపట్టిన చర్యలను వివరిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అఫిడవిట్ దాఖలు చేయాలని, లేని పక్షంలో వ్యక్తిగతంగా హాజరుకావాల్సిందేనంటూ విచారణను 10వ తేదీకి వాయిదా వేశారు.
యూనిఫాం హెచ్‌ఆర్ పాలసీ అమలుపై
యథాతథస్థితి : హైకోర్టు
ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్)ల్లోని ఉద్యోగులకు యూనిఫాం హెచ్‌ఆర్, బదిలీ పాలసీని తీసుకొస్తూ గతనెల 22న జారీ చేసిన సర్క్యులర్ అమలుపై యథాతథస్థితి కొనసాగించాలంటూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. సర్క్యులర్‌పై కౌంటర్లు దాఖలుచేయాలంటూ తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంక్ చైర్మెన్, నాబార్డ్ చీఫ్ జనరల్ మేనేజర్, పీఏసీఎస్ హెడ్‌లతోపాటు జిల్లా కమిటీల కన్వీనర్‌లకు నోటీసులు జారీ చేస్తూ తదుపరి విచారణను వచ్చేనెల ఏడో తేదీకి వాయిదా వేసింది. జిల్లా స్థాయి ఎంపవర్డ్ కమిటీల కన్వీనర్ గతనెల 22న జారీ చేసిన సర్క్యులర్‌ను సవాలు చేస్తూ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగుల యూనియన్‌తోపాటు మరికొందరు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ పుల్లా కార్తీక్ విచారణ చేపట్టారు. పిటిషనర్ తరపు సీనియర్ న్యాయవాది బిఎస్ ప్రసాద్ వాదనలు వినిపిస్తూ యూనిఫామ్ హెచ్‌ఆర్, బదిలీ పాలసీ అమలుకు సర్క్యులర్ జారీ చేసే ముందు కనీసం అభ్యంతరాలను కూడా స్వీకరించకపోవడం చట్టవిరుద్ధమన్నారు. వాదనలను విన్న న్యాయమూర్తి సర్క్యులర్‌పై యథాతథస్థితిని కొనసాగించాలంటూ మధ్యంతర ఉత్తర్వులను జారీ చేశారు.
న్యాయశాఖ కార్యదర్శిగా పాపిరెడ్డి బాధ్యతల స్వీకరణ
రాష్ట్ర న్యాయశాఖ కార్యదర్శిగా బి పాపిరెడ్డి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. మహబూబ్‌నగర్ జిల్లా ప్రిన్సిపల్ అండ్ సెషన్స్ జడ్జిగా పనిచేస్తున్న పాపిరెడ్డిని న్యాయశాఖ కార్యదర్శిగా నియమిస్తూ ప్రభుత్వం గతవారం ఉత్తర్వులిచ్చింది, మేడ్చల్ జిల్లా దబిల్‌పూర్‌కు చెందిన ఆయన 2012లో జిల్లా జడ్జిగా ఎంపికై నెల్లూరు, కృష్ణా, విశాఖ, హైదరాబాద్, మెదక్, నాంపల్లి మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జిగా పనిచేశారు. మహబూబ్‌నగర్ జిల్లా జడ్జిగా చేస్తూ లా సెక్రటరీగా ఆయన నియమితులయ్యారు.