Friday, August 29, 2025
E-PAPER
spot_img
Homeతాజా వార్తలుకాంట్రాక్ట్‌ ఉద్యోగుల్ని రెగ్యులరైజ్‌ చేయండి

కాంట్రాక్ట్‌ ఉద్యోగుల్ని రెగ్యులరైజ్‌ చేయండి

- Advertisement -

– హైకోర్టు కీలక తీర్పు
– 23 ఏండ్ల నుంచి కాంట్రాక్ట్‌ విధానంలోనే కొనసాగించడం చట్ట వ్యతిరేకం
నవతెలంగాణ – హైదరాబాద్‌

కాంట్రాక్ట్‌ పేరుతో ఏండ్ల తరబడి సేవలు చేయించుకుని, ఇప్పుడు ఉద్యోగ నియామకాలకు అర్హత సాధిస్తే అందులో 15 శాతం అవకాశం కల్పిస్తామని ప్రభుత్వం చెప్పడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. కాంట్రాక్ట్‌ సర్వీసు ఇస్తున్న వాళ్లను క్రమబద్ధీకరించకుండా తిరిగి నియామకాలు చేస్తామంటే కుదరదని స్పష్టం చేసింది. కాంట్రాక్ట్‌ సేవలందించిన వాళ్లను ఉద్యోగ నియామకాల్లో పాల్గొనాలని చెప్పడం సరికాదని వెల్లడించింది. రెగ్యులర్‌ నియామక ప్రక్రియలో ఎంపిక అయ్యాక ఉద్యోగ నియామకాలపై నిషేధం ఉందని చెప్పి వాళ్ల సర్వీసులను ఇప్పుడు వాడుకోమంటే ఎలాగని ప్రశ్నించింది. నియామకాలపై నిషేధం తొలగించాక వాళ్ల సేవలను విస్మరించి కొత్త నియామకాలు చేపట్టడానికి వీల్లేదని తీర్పు చెప్పింది. కాంట్రాక్ట్‌ పద్ధతిలో 6-15 ఏండ్లుగా పనిచేస్తున్న తమ సర్వీసును క్రమబద్ధీకరించకుండా 2013లో నోటిఫికేషన్‌ జారీ చేయడాన్ని సవాల్‌ చేస్తూ అప్పట్లో దాదాపు 200 పిటిషన్‌లు వేశారు. వీటిని పరిగణలోకి తీసుకున్న హైకోర్టు నియామకాలపై మధ్యంతర స్టే ఇచ్చింది. దీంతో వారంతా కాంట్రాక్ట్‌ పద్ధతిలోనే ఉద్యోగాలు చేస్తున్నారు. వాళ్ల సర్వీసును క్రమబద్ధీకరించేలా ప్రభుత్వానికి ఆదేశాలివ్వాలని కోరుతూ మెదక్‌ జిల్లా సదాశివపేటకు చెందిన మీరాభారు ఇతరులు వేసిన పిటిషన్లను జస్టిస్‌ నగేశ్‌ భీమపాక విచారించి పైవిధంగా తీర్పు చెప్పారు.

ఉద్యోగాలకు అర్హులు…
‘వాళ్లు కాంట్రాక్ట్‌ పద్ధతిన పనిచేస్తున్నారు. ఉద్యోగాలకు అర్హులు. గతంలో రెగ్యులర్‌ పోస్టులకే ఎంపికయ్యారు. అయితే, అప్పుడు ఉద్యోగ నియామాకాలపై బ్యాన్‌ ఉండటంతో కాంట్రాక్ట్‌ పద్ధతిలో పనిచేస్తున్నారు. ఈ నిషేధం ఉన్న నేపథ్యంలో వారు కాంట్రాక్ట్‌ పద్ధతిలో చేస్తున్నారని చెప్పి ఇప్పుడు వాళ్లను అలాగే కొనసాగించేందుకు వీల్లేదు. తాజాగా నోటిఫికేషన్‌ జారీచేసి వాళ్లకు 15 శాతం వెయిటేజీ మార్కులు ఇస్తామంటే కుదరదు. నియామకాలపై నిషేధం ఎత్తివేసినపుడు కాంట్రాక్ట్‌ కింద పనిచేస్తున్నవారికి ప్రాధాన్యం ఇవ్వాల్సిందే. అందుకు విరుద్ధంగా వారిని పరీక్షలు రాసి ఎంపిక ప్రక్రియలో పాల్గొనాలనడం చెల్లదు. ఇది చట్టవిరుద్ధమే. 2013లో పిటిషన్‌ దాఖలు చేశారు. అప్పటి నుంచి పనిచేస్తున్నా ఇంకా కాంట్రాక్ట్‌ విధానంలోనే కొనసాగించడం చట్ట వ్యతిరేకం. ఈ మేరకు పలు సుప్రీం కోర్టు తీర్పులు ఉన్నాయి’ అని హైకోర్టు తీర్పు చెప్పింది.

అంగన్‌వాడీ కాంట్రాక్ట్‌ ఉద్యోగులకు వెయిటేజీపై ఆక్షేపణ
సూపర్‌వైజర్‌గ్రేడ్‌-2 పోస్టుల భర్తీకి సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్‌లో అంగన్‌వాడీ కాంట్రాక్ట్‌ ఉద్యోగులకు 15 శాతం వెయిటేజ్‌ మార్కులు కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్‌ను హైకోర్టు తప్పుపట్టింది. గతంలో వారంతా రెగ్యులర్‌ పోస్టులకే ఎంపికయ్యారని, అయితే, అప్పుడు ఉద్యోగ నియామాకాలపై నిషేధం ఉండటంలో కాంట్రాక్ట్‌ పద్ధతిలో ఉద్యోగాలు చేస్తున్నారని గుర్తు చేసింది.

వరద సాయం వివరాలివ్వండి :ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా గత కొన్ని రోజులుగా వర్షాలు వరదలుగా మారడంతో బాధితులకు ప్రభుత్వం అందజేసిన సహాయక చర్యలపై నివేదిక అందజేయాలని హైకోర్టు రాష్ట్రానికి ఆదేశాలు జారీ చేసింది. విపత్తుల నిర్వహణ చట్టం కింద గతంలో ఇదే అంశంపై జారీ చేసిన మార్గదర్శకాలను ఏ మేరకు అమలు చేశారో చెప్పాలంది. ఇందుకు సంబంధించి గురువారం ఆదేశాలు జారీ చేసింది. వరదలపై గతంలో దాఖలైన పిల్‌ను చీఫ్‌ జస్టిస్‌ ఏకే సింగ్‌, జస్టిస్‌ మొహియుద్దీన్‌లతో కూడిన బెంచ్‌ విచారించింది. పిటిషనర్‌ న్యాయవాది చిక్కుడు ప్రభాకర్‌ వాదిస్తూ, రాష్ట్ర వ్యాప్తంగా కామారెడ్డి, మెదక్‌, రాజన్నసిరిసిల్ల, నిర్మల్‌, నిజామాబాద్‌తో సహా 10 జిల్లాల్లో వరద ప్రభావం ఉందన్నారు. దారుణపరిస్థితులు ఉన్నాయని చెప్పారు. ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ వరద సహాయక చర్యలు ప్రభుత్వం చేపట్టిందన్నారు. షెల్టర్లు, ఆహారం, నీరు అందిస్తోందని, వైద్యసేవలు కూడా అందుబాటులో ఉన్నట్టు వివరించారు.
తగిన చర్యలు చేపట్టేలా ఆదేశాలు జారీ చేయాలన్న పిటిషనర్‌ న్యాయవాది అభ్యర్థనను ధర్మాసనం తిరస్కరించింది. ప్రభుత్వం ఇప్పటికే చేపట్టిన చర్యలు తెలుసుకోకుండా ఉత్తర్వులు ఇవ్వలేమని, కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను సెప్టెంబరు 17కు వాయిదా వేసింది.

పేలుళ్లకు ఎవరు అనుమతిస్తారో చెప్పండి
కొండలు, రాళ్లను తొలగింపునకు పేలుళ్లు నిర్వహించాలంటే అనుమతి ఇచ్చే అధికారి ఎవరో తెలియజేయాలని రాష్ట్రానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. హైదరాబాద్‌ సిటీ పోలీసు చట్టం కింద కమిషనర్‌ అనుమతులు మంజూరు చేస్తున్నప్పటికీ దీనిపై స్పష్టత లేదంది. అధికారి ఎవరో తెలిస్తే ప్రతివాదిగా చేసి తగిన ఆదేశాలిస్తామని ప్రకటించింది. హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌ న్యాయవిహార్‌ వెనుక రాత్రిళ్లు పేలుళ్లు జరపడంపై హైకోర్టు న్యాయమూర్తి రాసిన లేఖను పిల్‌గా పరిగణించిన హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ బెంచ్‌ గురువారం విచారించింది. పేలుడు నిర్వహించడానికి ప్రత్యేక అధికారి ఉన్నారని, కలెక్టర్‌కు కూడా అధికారం ఉందని ప్రభుత్వం చెప్పింది. జూబ్లీహిల్స్‌లో రాత్రి 10 నుంచి తెల్లవారు జామున 4 గంటల వరకు మార్చి 31వరకు పేలుళ్లు నిర్వహించడానికి అనుమతి మంజూరైందని తెలిపింది. ప్రభుత్వ వివరణ నిమిత్తం విచారణను సెప్టెంబరు 16కు వాయిదా పడింది.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad