సీఎం రేవంత్‌రెడ్డికి సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ లేఖ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిపులను వెంటనే విడుదల చేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ మేరకు శుక్రవారం ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి లేఖ రాశారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లను మరింత పారదర్శకంగా అమలు చేస్తామని ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్నారని గుర్తు చేశారు. కానీ ఇప్పటి వరకు వీటిని చెల్లించడంలో తీవ్ర నిర్లక్ష్యం కొనసాగించిందని తెలిపారు. తక్షణమే పెండింగ్ బకాయిలను చెల్లించి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ పేద విద్యార్థుల చదువులకు ఆటంకం కలగకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలోని 1800 ప్రయివేటు కాలేజీల్లో చదివే, 14 లక్షల మంది విద్యార్థులకు రూ.8,042 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్, రూ.1,924 కోట్ల స్కాలర్‌షిప్‌లను రాష్ట్ర ప్రభుత్వం చెల్లించకుండా మొత్తం రూ.9,966 కోట్లు పెండింగ్‌లో పెట్టిందని పేర్కొన్నారు.
వీటిని విడుదల చేయాలని కోరుతూ ఆగస్టులో యాజమాన్యాలు సమ్మె చేయగా, ప్రభుత్వం చర్చలకు పిలిచి దసరా సందర్భంగా రూ.300 కోట్లు, దీపావళికి రు.600 కోట్లు, నవంబర్ మొదటివారంలో రు.300 కోట్లు మొత్తం రూ.1,200 కోట్లు విడుదల చేస్తామని స్పష్టమైన హామి ఇచ్చిందని గుర్తు చేశారు. ఇప్పటి వరకు కేవలం రూ.300 కోట్లు మాత్రమే విడుదల చేసి మిగతా డబ్బులు చెల్లించలేదని పేర్కొన్నారు. దీంతో ఐదు రోజులుగా తిరిగి సమ్మెలోకి వెళ్ళిన కొంతమంది యాజమాన్యాలపై విజిలెన్స్ దాడులు జరుగుతున్నాయని తెలిపారు. నిధులు విడుదల చేసి సమస్యను సామరస్యంగా పరిష్కరించాలని కోరుతూ విద్యార్థి సంఘాలు, విద్యార్థులు 20 రోజులుగా ఆందోళనలు చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం కమిటీని వేసి కాలయాపనకు పూనుకోవడం సరికాదనీ, విద్యా సంస్థల్లో ఏమైనా అక్రమాలు ఉంటే వాటిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి గానీ, బకాయిలను ఆపడం సరికాదని తెలిపారు.
తక్షణమే ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు మిగతా రూ.900 కోట్లు విడుదలచేయాని విజ్ఞప్తి చేశారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్ధులకు కేంద్రం ఇచ్చే నిధులను కూడా రాష్ట్ర ప్రభుత్వం వాడుకుం టున్నదనీ, దీనికి తోడు ఫీజు రీయింబర్స్‌మెంట్స్, స్కాలర్‌షిప్స్ సమస్య వల్ల విద్యార్థులతో పాటు, కళాశాలల యాజమాన్యాలు, వాటిలో పనిచేసే 2.50లక్షల మంది ఉద్యోగులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. కొన్ని ప్రయివేటు కళాశాలలు విద్యార్థుల చదువులు పూర్తయినప్పటికీ రీయింబర్స్‌మెంట్ రాలేదనీ, సర్టిఫికెట్లు ఇవ్వకుండా వారి పైచదువులకు ఆటంకం కలుగుతున్నదని తెలిపారు. రాష్ట్ర బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తున్నప్పటికీ, విద్యార్థులు ఆందోళనలు చేసినప్పుడు మాత్రమే టోకెన్లు జారీ చేయడం తప్ప, ట్రెజరీల నుండి ఒక్కరూపాయి కూడా విడుదల చేయడంలేదని పేర్కొన్నారు. తక్షణమే విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని, పెండింగ్ నిధులను విడుదల చేసి సమస్య పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.



