నవతెలంగాణ – హైదరాబాద్ : తమిళనాడు అధికార పార్టీ డిఎంకెకు సుప్రీంకోర్టులో భారీ ఉపశమనం లభించింది. ”ఉంగలుదన్ స్టాలిన్” పథకం పేరును సవాలు చేస్తూ అన్నాడిఎంకె ఎంపి సి.విఇ.షణ్ముగం దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు బుధవారం కొట్టివేసింది. తప్పుగా భావించడం, మరియు చట్ట దుర్వినియోగం అని వ్యాఖ్యానించింది. మద్రాస్ హైకోర్టులో షణ్ముగం దాఖలు చేసిన పెండింగ్ కేసును సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బి.ఆర్.గవాయి నేతృత్వంలోని ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం కొట్టివేసింది.
రాష్ట్ర సంక్షేమ పథకాలకు ఏ వ్యక్తి పేరు పెట్ట కూడదని, విస్తృతమైన ఆంక్షలు విధిస్తూ మద్రాస్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాన్ని ధర్మాసనం కొట్టి వేసింది. జులై 31న ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ డిఎంకె సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.
డిఎంకె తరపున న్యాయవాదులు ఎ.ఎం.సింఘ్వీ, ముకుల్‌రోహిత్గీ, పి.విల్సన్‌లు వాదనలు వినిపించగా, ఎంపి షణ్ముగం తరపున న్యాయవాది మణీందర్ సింగ్ వాదనలు వినిపించారు. రెండు వైపుల వాదనలను విన్న ధర్మాసనం వాటితో ఏకీభవించలేమని పేర్కొంది. పిటిషనర్ ప్రత్యేకంగా ఒక రాజకీయ పార్టీని ఎందుకు లక్ష్యంగా చేసుకున్నారని అన్నాడిఎంకె ఎంపిని నిలదీసింది. ఇతర రాజకీయ సంస్థలు తమ నేతల పేర్లను వినియోగించి కార్యక్రమాలను ప్రచారం చేయడానికి చేపడుతున్న చర్యలను ఎందుకు సవాలు చేయలేదని ప్రశ్నించింది.