ఆది మానవుడు ఆనాడు రాతి ఆయుధాలతో జంతువులను వేటాడి, ఆకలి బాధను తీర్చుకుంటే… ఆధునిక మానవుడు నేడు ‘విద్య’ అనే ఆయుధం చేబూని అనేక యుద్ధాలను జయిస్తూ, ఉన్నత శిఖరాలను అధిరోహిస్తున్నాడు. ఒక ప్రాంతం, దేశానికి పరిమితం కాకుండా ప్రపంచమంతా వ్యాపిస్తున్నాడు. అయితే మానవుని అభ్యున్నతికి కారణమైన జ్ఞానాన్ని అందించే విద్యాలయాల్లో నేడు అల్లరి మూకల జోక్యం, స్వైరవిహారం ఆందోళన కలిగించే అంశం. బడితో ఏమాత్రం సంబంధంలేని అనాగరిక గుంపులు పాఠశాల నిర్వహణ అంశాలపై అజమాయిషి ప్రదర్శిస్తుండడం గగుర్పాటు కలిగించే విషయం. పాఠశాలలోకి ప్రవేశించడానికి, ఉపాధ్యాయుల బోధన అంశాల్లో జోక్యం చేసుకోవడానికి ఏమాత్రం అర్హత లేని ఆకతాయి మూకలు నేడు ఉపాధ్యాయుల బోధనా అంశాలపై , విధానాలపై దాడులు, హింసాత్మక చర్యలకు పూనుకోవడం హేయం. విద్యార్థులకు అభ్యుదయకర ఆలోచనలను, విధానాలను నేర్పించాల్సిన పాఠశాలలను మూఢత్వం వైపుకు తిరోగమింపజేయడానికి పూనుకుంటున్న ఈ దుష్టశక్తులు విద్యారంగానికి ప్రమాద ఘంటికలను మోగిస్తున్నాయి.
”విద్యార్థి సంపూర్ణ వ్యక్తిత్వ వికాసమే విద్య యొక్క లక్ష్యం కావాలి” అంటారు జాతిపిత మహాత్మా గాంధీ. విద్యార్థి శారీరక, మానసిక, నైతిక, బౌద్ధిక, సామాజిక వికాసానికి తోడ్పాటునందించే సాధనంగా విద్య ఉండాలి. శ్రమ విలువను తెలుసుకుని, శ్రామిక జనబాహుళ్యం పట్ల గౌరవాన్ని నింపుకునేలా విద్య అందించబడాలి. దీనివల్ల శరీరం పట్ల అవగాహన, ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెరుగుతాయి. విద్య మనసుకు ఆనం దాన్ని, ఆహ్లాదాన్ని అందించాలి, భవిష్యత్తు ఆశయాలను నెరవేర్చుకోవడానికి మార్గం సుగమం చేయాలి. విద్యార్థుల్లో సంపూర్ణ మూర్తిమత్వాన్ని సాధించేందుకు ఎంతోమంది ఉపాధ్యాయులు ప్రయత్నాలు చేస్తున్నారు. చదువుతోపాటు సంస్కారం, మానవతా విలువలు నేర్పిస్తున్నారు. శాస్త్రీయ ఆలోచనా దృష్టిని పెంపొందించేందుకు, మూఢనమ్మకాలను విడనాడి వాస్తవ దృష్టితో మెలిగేందుకు అవసరమైన పాఠాలను విద్యార్థులకు బోధిస్తున్నారు. పిల్లల శారీరక అభివృద్ధితోపాటు సుఖ దు:ఖాలను సమాన స్థాయిలో స్వీకరించేందుకు అవసరమైన మానసిక పరిపక్వతను విద్యార్థుల వశం చేస్తున్నారు. అయితే.. ఈ క్రమంలోనే, వాస్తవాలను విద్యార్థులకు బోధించే తరుణంలోనే, అభ్యుదయకర ఆలోచనలను అంది స్తున్న సమయంలోనే కొంతమంది విషం చిమ్మే ఉన్మాదులు పాఠశాల ఆవరణల్లోకి ప్రవేశిస్తున్నారు. బోధనా అంశాల్లో జోక్యం చేసుకుంటున్నారు. ఉపాధ్యాయులపై దాడులకు పాల్పడుతున్నారు. వారి ఆత్మస్థైర్యం దెబ్బతినేలా వ్యవహరిస్తున్నారు. వారిని ఎన్నోరకాలుగా అవమానాలకు గురిచేస్తున్నారు. అసాంఘిక ధోరణులను ప్రదర్శిస్తున్నారు.
నిజామాబాద్ జిల్లా కోటగిరి ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించే లక్ష్యంతో మూఢనమ్మకాలను రూపుమాపేలా పాఠాలు బోధిస్తున్న ఉపాధ్యాయుడు మల్లికార్జున్‌పై 2023లో మతోన్మాద మూకలు దాడి చేశారు. విద్యార్థుల ముందు అవమానించారు. దుర్మార్గమైన మరో ఘటన 2024లో రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో జరిగింది. అయ్యప్ప మాల వేసుకున్న ఒక విద్యార్థిని నిలబెట్టి, ఎక్కం చెప్పమన్నందుకు ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాములుపై అయ్యప్పమాల ధరించిన ఉన్మాదులు దాడిచేసి కొట్టారు, బట్టలు చించేశారు. బలవంతంగా విద్యార్థి కాళ్లపై పడి క్షమాపణలు చెప్పేలా చేశారు. ఒక తాగుబోతు దాడి వల్ల మానసిక క్షోభకు గురై ఉపాధ్యాయుడు బలవన్మరణం పొందిన ఘటన ఆదిలాబాద్ జిల్లాలో జరిగింది. జిల్లా కేంద్రానికి ఆనుకుని ఉన్న మావల ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్న తాటి విలాస్‌పై గ్రామస్తుడైన ఒక తాగుబోతు దాడి చేశారు. విద్యార్థులు పాఠ్యపుస్తకాలకు కవర్లు వేసుకోకపోవడంతో వారిని మందలించిన అతనిపై భౌతిక దాడికి పాల్పడ్డాడు. ఈ అవమాన భారాన్ని తట్టుకోలేని సదరు ఉపాధ్యాయుడు తన స్వగ్రామం ఘోట్కురిలోని వ్యవసాయ బావిలో దూకి ఆత్మ హత్య చేసుకున్నాడు. తన పిల్లలు, కుటుంబానికి దూరమయ్యారు. వికారాబాద్ జిల్లా యాలాల బాలికల ఉన్నత పాఠశాల సైన్సు ఉపాధ్యాయురాలు కాసింబిపై మతో న్మాదులు దాడికి పాల్పడ్డారు. బయాలజీ సబ్జెక్టులో మెదడు నిర్మాణానికి సంబంధించిన పాఠం బోధిస్తున్న క్రమంలో.. విద్యార్థులకు సులభంగా అర్థమవ్వడానికి నిజ వస్తువులను చూపిస్తూ బోధించాలనే తాపత్రయంతో వారు గొర్రె మెదడును తీసుకొచ్చి విద్యార్థులకు ప్రత్యక్ష అనుభవం కలిగించారు. ఇది తెలుసుకున్న కొంతమంది ఉన్మాదులు అది గొర్రె మెదడు కాదు ఆవు మెదడు అంటూ గోల చేశారు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. బోధనా విధానాలపై అవగాహన కొరవడిన ఉన్నతాధికారులు ఆ ఉపాధ్యాయురాలిని నిర్దాక్షిణ్యంగా సస్పెండ్ చేశారు.
నాణ్యమైన, వాస్తవాధీనమైన బోధనను విద్యార్థులకు అందించడానికి కృషి చేస్తున్న ఉపాధ్యాయులపై తెలంగాణ రాష్ట్రంలో జరిగిన దాడుల్లో మచ్చుకు కొన్ని మాత్రమే ఇవి. ఇలాంటివి దేశవ్యాప్తంగా అనేకం జరుగుతున్నాయి. ఎంతోమంది ఉపాధ్యాయులు అల్లరి మూకలు, మతోన్మాద గుంపుల దాడులకు బలవుతున్నారు, ప్రాణాలను సైతం కోల్పోతున్నారు. నిత్యకృత్యమైన ఈ దుర్మార్గపు ఘాతుకాలకు కారణం ఎవరు? ఉపాధ్యాయులపై ఈ దాడుల వెనుక ఉన్నదెవరు? ఈ ఘటనలకు ఆజ్యం పోస్తున్న భావజాలం ఏది? ఎప్పుడూ లేని విధంగా ఈ వికృత చేష్టలు ఇప్పుడే ఎందుకు పెచ్చరిల్లిపోతున్నాయి? మేధావి వర్గంతో మొదలుకుని సామాన్య జనం వరకు ఈ అంశంపై ఆలోచించవలసిన ఆవశ్యకత ఉన్నది.మతం అనేది మానవ జీవన విధానంలో ఒక భాగం మాత్రమే కావాలి తప్ప ఉన్మాదం కాకూడదు. మతాన్ని అడ్డు పెట్టుకొని, మత ఆధారిత రాజకీయాలు చేస్తూ అధికారం కోసం చూస్తున్న వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. శాస్త్ర విజ్ఞానం వైపుగా కాకుండా మూఢత్వం వైపుకు జనాన్ని తీసుకెళ్లేలా ప్రయత్నిస్తున్న మత చాందసవాదుల చేష్టలను ప్రజలు అవగాహన చేసుకోవాలి. విద్యార్థుల సంపూర్ణ మూర్తిమత్వానికి ఆశనిపాతంగా నిలుస్తున్న ఇలాంటి ఘటనల పట్ల ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉండాలి, అడ్డుకట్ట వేయాలి. జ్ఞానాన్ని అందించే జాతి నిర్మాతలైన ఉపాధ్యాయులకు ప్రభుత్వాలు అండగా నిలబడాలి. అందరూ కలిసికట్టుగా జ్ఞాన సంపదను ఇనుమడింపజేస్తూ, విద్వేషాలను రూపుమాపుతూ ”విజ్ఞాన తెలంగాణ”ను నిర్మించుకోవాలి.
వరగంటి అశోక్
9493001171